సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 మే 2020 (12:19 IST)

చిరంజీవి నివాసంలో సినీ ఇండస్ట్రీపై మెగా చర్చలు!

మెగాస్టార్ చిరంజీవి నివాసం ఇపుడు సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం ఓ వేదికగా మారింది. ముఖ్యంగా కరోనా లాక్డౌన్ దెబ్బకు సినీ ఇండస్ట్రీ సంక్షోభంలో కూరుకునిపోయింది. ఈ లాక్డౌన్ దెబ్బకు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన అనేక కొత్త మూవీ ప్రాజెక్టులు ఇపుడు అర్థాంతరంగా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను సడలించింది. దీంతో సినీ ఇండస్ట్రీలో కదలిక వచ్చింది. లాక్డౌన్ తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలన్న అంశాలపై చర్చించేందుకు చిరంజీవి తన నివాసంలో ఇండస్ట్రీ పెద్దలతో కలిసి ఓ సమావేశాన్ని గురువారం ఏర్పాటు చేశారు. 
 
ముఖ్యంగా లాక్డౌన్ కారణంగా నష్టాల్లో కూరుకునిపోయిన సినీ ఇండస్ట్రీని తిరిగి గాడిలో పెట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం పొందాలి? తదితర అంశాలపై చర్చలు జరుపనున్నారు. ఈ సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా చిరంజీవి ఇంటికి వచ్చారు. వీరిద్దరితో పాటు ఇండస్ట్రీ పెద్దలంతా సినీ పరిశ్రమ ఇబ్బందులపై చర్చిస్తున్నారు.
 
సినీ ఇండస్ట్రీకి ప్రముఖులు అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు, రాజమౌళి, సి.కల్యాణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశానికి వచ్చారు. ఈ చర్చల అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమ, సినిమా థియేటర్లను తిరిగి తెరిచే అంశాలపై కొంత స్పష్టత వస్తుందని సమాచారం.