బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 జులై 2020 (08:30 IST)

బొత్తిగా మనకు - పశువులకు తేడాలేకుండా పోయింది.. స్టార్ డైరెక్టర్

సామాజిక అంశాలతో కూడిన కథలను ఎంచుకుని, వాటిని ఆణిముత్యాలుగా తీర్చి సూపర్ డూపర్ హిట్లు అందుకుంటున్న తెలుగు సినీ దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ఇప్పటివరకు ఆయన తీసిన చిత్రాలే అందుకు నిదర్శనం. అయితే, ఈయన ప్రస్తుతం సమాజంలోని మనుషులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ బారినపడకుండా ఉండాలంటే ఏకైక మార్గం కేవలం ముఖానికి మాస్కులు ధరించాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. వైద్య వర్గాలు మొత్తుకుంటున్నారు. అయినప్పటికీ వాటిని ధరించేందుకు ఏ ఒక్కరూ పెద్దగా శ్రద్ధ చూపించడం లేదు. ఇది కొరటాల శివకు ఆగ్రహం తెప్పించింది. 
 
ఇదే అంశంపై ఆయన స్పందించారు ప్రభుత్వాలు, వైద్య నిపుణులు మొత్తుకుని చెబుతున్నా మాస్కులు ధరించకుండా తిరిగితే బొత్తిగా మనకు, పశువులకు తేడా ఉండదు అని ట్వీట్ చేశారు. కరోనా వ్యాప్తి తగ్గాలంటే ప్రస్తుతానికి మాస్కు ధరించడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. దయచేసి మాస్కులు వేసుకుందాం అంటూ విజ్ఞప్తి చేశారు. అయితే, మాస్కు వేసుకునేది మెడ మీద కాదు... ముక్కు, మూతి కవరయ్యేలా ధరించుదాం అని స్పష్టం చేశారు. ఇక మాస్కు వేసుకోని వాళ్లకు ప్రత్యేకంగా చెబుదాం అంటూ పేర్కొన్నారు. 
 
కాగా, మహర్షి తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం "ఆచార్య". ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. ఇందులో చిరు తనయుడు రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే, చెర్రీకి జోడీగా దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నారు.