శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 జూన్ 2021 (17:31 IST)

"చిత్రం" సినిమాకు 21 ఏళ్ళు.. ఉదయ్ కిరణ్‌ను గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్!

Chirtam
బాలీవుడ్‌లో పెద్ద పెద్ద సినిమాలకు సినిమాటోగ్రఫర్ గా పని చేసిన అనుభవంతోనే దర్శకుడిగా మారిపోయాడు తేజ. అప్పటికే పెద్ద సినిమాలు బాగా రాజ్యమేలుతున్న సమయంలో ఊరు పేరు తెలియని వాళ్లను పెట్టి సంచలన సినిమా చేసాడు తేజ. అదే చిత్రం.. 2000 జూన్ 16న విడుదలైన ఈ చిత్రం కేవలం 10 రూపాయల టికెట్‌తోనే 10 కోట్లు షేర్ వసూలు చేసి చరిత్రలో నిలిచిపోయింది.
 
ఈ చిత్రంతోనే ఉదయ్ కిరణ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఆయనకు జోడీగా ముంబై భామ రీమా సేన్ నటించింది. ఈ చిత్రం సాధించిన విజయం గురించి అప్పట్లో ఇండస్ట్రీ చాలా రోజుల వరకు మాట్లాడుకుంది. ముఖ్యంగా చిరు, నాగార్జున లాంటి వాళ్లు ఉదయ్ కిరణ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. చిత్రం సినిమా సాధించిన విజయం గురించి తెలుసుకుని అంతా ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, ఢిల్లీ రాజేశ్వరి కామెడీ హైలైట్‌‌గా నిలిచింది. చిన్న వయసులోనే తల్లి తండ్రులుగా మారిన కాలేజీ పిల్లల కథ ఇది.
 
ముందుగా ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్ ను హీరోగా అనుకోలేదు తేజ. మెయిన్ హీరో అనుకున్నతను హ్యాండ్ ఇవ్వడంతో ఉదయ్ ముందుకొచ్చాడు. ఎలాంటి అంచనాలు లేకుండా.. చాలా తక్కువ థియేటర్స్ లో విడుదలైన చిత్రం సంచలన విజయం సాధించింది. 
 
ఆర్పీ పట్నాయక్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు వరంగా మారింది. మొత్తంగా ఓ అద్భుతమైన హీరోను తెలుగు తెరకు అందించింది చిత్రం సినిమా. ఈ సినిమా తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే, నీ స్నేహం లాంటి సినిమాలతో ఉదయ్ కిరణ్ స్టార్ అయిపోయాడు. కానీ ఆ తర్వాత ఆయన జీవితం విషాదంగా ముగిసింది. చిత్రం సినిమా 21 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.