బుధవారం, 6 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 ఆగస్టు 2025 (16:11 IST)

షారూక్‌ ఖాన్‌ను ఉత్తమ నటుడు అవార్డు ఎలా ఇస్తారు? నటి ఊర్వశి ప్రశ్న

urvashi
ఇటీవల కేంద్రం ప్రకటించిన 71వ జాతీయ చలన చిత్ర అవార్డులపై వివాదం రాజుకుంది. ప్రముఖ సీనియర్ నటి ఊర్వశి ఈ అవార్డుల ఎంపిక కోసం నియమించిన జ్యూరీ సభ్యులకు కొన్ని ప్రశ్నలు సంధించారు. బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌కు ఉత్తమ నటుడు అవార్డు ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. అలాగే, తనను ఉత్తమ సహాయ నటి అవార్డుకు ఎలా ఎంపిక చేశారని, సహాయ నటి అంటే ఏమిటో జ్యూరీ సభ్యులు చెప్పాలని కోరారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, తనకు అసలు ఉత్తమ సహాయ నటి అవార్డు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సహాయ నటి అంటే ఏమిటో జ్యూరీ సభ్యులు వివరించాలని కోరారు. తనను సహాయ నటిగా ఎలా పరిగణిస్తారని ఆనె ప్రశ్నించారు. వయసు పెరిగితే సహాయనటిగా పరిగణిస్తారా అని నిలదీశారు. తన నటనను ఏ పద్ధతిలో కొలిచారని ప్రశ్నించారు. మీరు అవార్డు ఇవ్వగానే వచ్చి సైలెంట్‌గా తీసుకోవడానికి అదేమీ పెన్షన్ కాదని ఎద్దేవా చేశారు. 
 
బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌కు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడంపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. "పూక్కలమ్" సినిమాకుగాను మలయాళ నటుడు విజయ్ రాఘవన్‌కు ఉత్తమ సహాయ నటుడు విభాగంలో అవార్డు ఇచ్చారని, అసలు ఆయనకు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాలని అన్నారు. అది రూ.250 కోట్ల సినిమా కాదని అవార్డు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. షారూక్ గతంలో ఎంతో గొప్పగా నటించిన సినిమాలకు అవార్డులు ఇవ్వలేదని, ఇపుడు 'జవాన్' సినిమాలో నటనకు అవార్డు ఇవ్వడం ఏమిటని నటి ఊర్వశి ప్రశ్నించారు.