మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

మాస్‌ ఫార్మెట్‌లో 'విజయ్‌ సేతుపతి' (మూవీ రివ్యూ)

నటీనటులు : విజయ్‌ సేతుపతి, రాశి ఖన్నా, నివేత పెతురాజ్‌, నాజర్‌, రవి కిషన్‌
 
సాంకేతికత: సినిమాటోగ్రఫర్‌: ఆర్‌ వెల్‌ రాజ్‌, సంగీతం: వివేక్‌, మెర్విన్‌, నిర్మాత: రావూరి వి శ్రీనివాస్‌, దర్శకత్వం: విజయ్‌ చందర్‌.
 
కమేడియన్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టులుపలు చిత్రాల్లో నటించి పెర్‌ఫార్మర్‌గా పేరుపొందిన విజయ్‌సేతుపతి కథానాయకుడిగా ఎదిగాడు. ఆమధ్య సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ 'పేట' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి పరిచయం అయ్యారు. తాజాగా ''సైరా''తో మరింత సుపరిచితం అయ్యారు. ఇదిలా వుండగా విజయ్‌ చందర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ''విజయ్‌ సేతుపతి'' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ : 
చరణ్‌ (విజయ్‌ సేతుపతి) తన స్నేహితుడితో కలిసి సినిమాల్లో వేషాలకోసం ట్రై చేస్తుంటాడు. మరోపక్క రామాపురం అనే ఊరిలో కార్పొరేట్‌ సంస్థ అధినేత సంజయ్‌ (రవికిషన్‌) ఓ కాపర్‌ ఫ్యాక్టరీని ఆ ఊరికి తీసుకురావాలని ప్రయత్నించగా ఆ ఊరి ప్రజలు అడ్డు పడతారు. ఆ ఊరికి పెద్ద నాజర్‌. అతని కొడుకే విజయ్‌ సేతుపతి. నాజర్‌కు నమ్మినబంటు, స్నేహితుడు అయిన అశుతోష్‌రాణాకు ఎం.ఎల్‌.ఎ. సీటు ఇప్పించి గెలిచేలా నాజర్‌ చేస్తాడు. చివరికి కార్పొరేట్‌ శక్తులతో కుమ్మక్కయి ఊరిని నాశనం చేసే కాపర్‌ ఫ్యాక్టరీకి అనుమతిస్తాడు. ఇది తెలిసి నాజర్‌ రీకాల్‌ చేయడంతో మరలా ఎన్నికలు జరుగుతాయి. నాజర్‌ ఎం.ఎల్‌.ఎ.గా గెలుస్తాడు. ఇది సహించని అశుతోష్‌ ఏం చేశాడు? తర్వాత ఎలాంటి పరిణామాలు సంభవించాయనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ: 
చూడ్డానికి ఇది సాధారణ కథ. చాలాకాలం నుంచి చూసిన కథే. కాకపోతే విజయ్‌ సేతుపతి కోణంలో చెప్పిన కథ. ఆ విషయాన్ని దర్శకుడు కూడా సందర్భాన్నిబట్టి పాత్రలచేత చెప్పించడం విశేషమే. ముఖ్యంగా విజయ్‌సేతుపతి నటన ఎమోషన్స్‌ మాస్‌ ప్రేక్షకుల్ని అలరించేట్లుగా వున్నాయి. సినిమాలో వచ్చే యాక్షన్‌ సీన్స్‌లో విజయ్‌ చక్కటి పెర్ఫామెన్స్‌ ప్రదర్శించారు. చరణ్‌, విజయ్‌ సేతుపతి ఇలా రెండు షేడ్స్‌లో నటన మెప్పిస్తుంది. 
 
ఆద్యంతం కమెడియన్‌ సూరి, విజయ్‌ సేతుపతిల మధ్య నడిచే ప్రతీ కామెడీ ట్రాక్‌ కూడా పండింది.ఈ ట్రాక్స్‌ అన్ని దర్శకుడు చక్కగా రాసుకున్నారు. వారిద్దరి మధ్య జరిగే సంభాషణలు విజయ్‌సేతుపతి తను ఇంతకుముందు ఏమిటో అని అందరికీ ఒకసారి తెలిసేలా తెలియజేసినట్లుంది. ఫస్టాఫ్‌లోని సేతుపతి కుటుంబాన్ని కూడా ఒక విభిన్నమైన కోణంలో చూపిన విధానం కూడా బాగుంటుంది.
 
ఇక హీరోయిన్‌ రాశిఖన్నా చిత్రంలో కీలక పాత్ర పోషించింది.నటన పరంగా మరోపక్క గ్లామర్‌ పరంగా రాశిఖన్నా తన పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చింది. ద్వితీయార్థంలో నివేత పెతురాజ్‌ పాత్ర చిన్నదే అయినా పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంది. అలాగే నెగిటివ్‌ షేడ్‌ పాత్రల్లో కార్పొరేట్‌ బిజినెస్‌ మాగ్నెట్‌గా కనిపించిన రవి కిషన్‌, పొలిటిసియన్‌గా అషుతోష్‌ రానా మరియు మరో కీలక పాత్రలో కనిపించిన నాజర్‌ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నేపథ్య సంగీతం పర్వాలేదు. డాన్స్‌లో విజయ్‌సేతుపతి ఇంకా మెరుగుపడాలి.  
 
అలాగే ముందు అంతా మంచి హిలేరియస్‌గా మంచి ట్విస్ట్‌తో కొనసాగిన ఫస్ట్‌ హాఫ్‌ సెకండాఫ్‌కు వచ్చేసరికి అంతే స్థాయిలో నిరుత్సాహ పరుస్తుంది. దీనికి కారణం ఈ టైపు స్టోరీ లైన్‌తో గతంలో తమిళ్‌ ''కత్తి'' తెలుగులో ''ఖైదీ నెం 150'', అలాగే కొన్ని ఎమోషనల్‌ ఎపిసోడ్స్‌ తెలుగులో మనకి బాగా తెల్సిన కొన్ని సినిమాలు కలిపి తీసినట్టుగా సెకండాఫ్‌ అనిపిస్తుంది. ఈ విషయంలో దర్శకుడు విజయ్‌ చందర్‌ కొత్తగా ఆలోచించి తెరకెక్కించి ఉంటే బాగుండేది. ఏదైనా ఆవేశంతో చేయకూడదు. ఆలోచనతో అదను చూసి ముందగుడు వేయాలనే నీతి దర్శకుడు ఈ చిత్రం ద్వారా చెప్పాడు. 
 
కేవలం సేతుపతిని ఎలివేట్‌ చెయ్యడం కొన్ని కీలక ఫ్యామిలీ మరియు కామెడీ ఎపిసోడ్స్‌ పైనే దృష్టి పెట్టిన దర్శకుడు సినిమాకు అత్యంత కీలకమైన కథ విషయంలో నిర్లక్ష్యం వహించి రొటీన్‌ అనిపించారు. అలాగే ఆర్‌ వేల్‌ రాజ్‌ అందించిన సినిమాటోగ్రఫీ ఎక్కడ ఎలా ఉండాలో చాలా సహజంగా బాగుంది. ఇకపోతే నిర్మాణ సంస్థ హర్షిత మూవీస్‌ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే తెలుగు వెర్షన్‌లో విజయ మూవీస్‌ వారు మంచి అవుట్‌ ఫుట్‌ అందించారు.