మహేశ్ బాబు సినిమాకు ఉపేంద్ర నో చెప్పారా.. మరి విజయ్ సేతుపతి
సంక్రాంతి బరిలో విడుదలైన 'ఎఫ్ 2' భారీగా విజయం సాధించి, బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి మహేశ్ బాబుతో క్రేజీ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నాడు. దీంతో ఈ సినిమాను భారీ ఎత్తున, మంచి యాక్టర్స్‌తో తీయాలని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ప్రధాన నటీనటుల విషయంలో మరింత శ్రద్ధ వహించి ఎంపిక చేస్తున్నారంట ఈ చిత్రం యూనిట్. కన్నడ స్టార్ హీరో ఉపేంద్రతో ప్రతినాయకుడిగా చేయించాలని భావించిన అనిల్ సంప్రదింపులు జరపగా ఆయన ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇటీవల ఉపేంద్ర ప్రజాకీయ పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఆ వ్యవహారాల్లో బిజీగా ఉంటూ సమయం కేటాయించలేకపోవడం వలనే ఈ ఆఫర్‌ను తిరస్కరించారట. ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటన వెలువడనప్పటికీ రూమర్స్ మాత్రం జోరుగా ప్రచారంలో ఉన్నాయి.
ఇటీవల హీరోయిన్ పాత్ర కోసం సాయిపల్లవిని సంప్రదించగా, ఆమె నో చెప్పడంతో రష్మికతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతలో ప్రతినాయకుడి పాత్ర విషయంలో ప్రచారం సాగుతోంది. ఉపేంద్ర నో చెప్పడంతో తమిళ్ హీరో, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతిని కాంటాక్ట్ చేస్తున్నారంట. త్వరలో క్లారిటీ వచ్చాక అధికారిక ప్రకటన ఉండవచ్చని సన్నిహిత వర్గాల టాక్.