గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 డిశెంబరు 2023 (10:28 IST)

బెడిసికొట్టి "వ్యూహం" - లైట్లన్నింటిని ఆర్పేసి చీకటిలోనే 'మమ' అనిపించారు...

vyooham movie pre release
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా నిర్మించిన చిత్రం వ్యూహం. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైకాపాకు, ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మేలు చేసేలా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అన్ని కల్పిత పాత్రలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌లను లక్ష్యంగా చేసుకుని అనేక రకాలైన అసత్యాలతో విమర్శలు గుప్పించారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ శనివారం సాయంత్రం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాటు చేశారు. వైకాపా నేతలు స్వయంగా రంగంలోకి దిగి ఈ ఏర్పాట్లు పర్యవేక్షించడంతో పాటు సినిమా నిర్మాణంతో ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అయ్యే ఖర్చును భరించారు. 
 
అయితే, వైకాపా నేతలు ఒకటి అనుకుంటే అక్కడ మరొకటి జరిగింది. కనీసం వందల సంఖ్యలోనూ అభిమానులు లేకపోవడంతో సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించాల్సిన వేడుకను రాత్రి 8 గంటల వరకూ ప్రారంభించలేకపోయారు. టీడీపీకి వ్యతిరేకంగా వైకాపా ఆధ్వర్యంలో రూపొందించిన ఈ 'వ్యూహం' బెడిసికొట్టింది. దీంతో ఎలాగైనా వేడుకకు జనాన్ని తీసుకురావాలని వైకాపా నాయకులు రంగంలోకి దిగి తీవ్రంగా ప్రయత్నించారు. ఆటోలు, కార్లను పెట్టి జనాన్ని తీసుకొచ్చి కుర్చీల్లో కూర్చోబెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ వారు గంటల కొద్ది వేచి ఉండలేక వెళ్లిపోయారు. ఖాళీ కుర్చీలు కనిపించకుండా ఉండేందుకు స్టేడియంలోని లైట్లన్నింటినీ ఆర్పేసి చీకటిలోనే కార్యక్రమాన్ని పూర్తి చేసి మమ అనిపించారు.