మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (16:18 IST)

నాన్నగారికి నచ్చిన స్థలంలోనే విగ్రహం పెట్టాం : నాగార్జున

Nagarjuna family at akkineni statue
Nagarjuna family at akkineni statue
నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు ఘనంగా  ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు, అక్కినేని కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
 
ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు మహేశ్‌బాబు, నమ్రతా శిరోద్కర్, రామ్‌చరణ్‌, మోహన్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి, ఎం.ఎం. కీరవాణీ , నాని, మంచు విష్ణు, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్,  శ్రీకాంత్‌, జయసుధ, బ్రహ్మానందం, అల్లు అరవింద్‌, అశ్వినీదత్, దిల్‌ రాజు, మురళీమోహన్‌, సుబ్బరామిరెడ్డి, సి కళ్యాణ్, చినబాబు, నాగవంశీ, ఎస్ గోపాల్ రెడ్డి, వైవిఎస్ చౌదరి, జెమిని కిరణ్, గుణ్ణం గంగరాజు, అనుపమ్ ఖేర్, నాజర్ తదితరులు పాల్గొని శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారికి ఘనంగా నివాళులు అర్పించారు.
 
Nag-DSP
Nag-DSP
నాగార్జున మాట్లాడుతూ.. ఎవరి విగ్రహాన్ని అయినా చూస్తే ..’ఆయన గొప్ప వ్యక్తి, ఇప్పుడు మనతో లేరు’’అనే భావన చిన్నప్పటి నుంచి నా మనసులో ముద్రపడిపోయింది. విగ్రహం చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది. అందుకే నాన్న గారి విగ్రహాన్ని వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించేవరకూ చూడలేదు. ఎందుకంటే..  నాన్న గారు లేరనేది యాక్సప్ట్ చేయాలని. శిల్పి వినీత్ అద్భుతంగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. నాన్నగారు అద్భుతమైన జీవితాన్ని గడిపారు. మీ అందరికీ నాన్న గారు అద్భుతమైన నటుడు, తరతరాలు గుర్తుపెట్టుకునే పాత్రలు చేసిన నటుడు, కోట్లమంది తెలుగు ప్రజలు ప్రేమించిన వ్యక్తి. మాకు మాత్రం నాన్న గారు మా గుండెలను నాన్న ప్రేమతో నింపారు. చిరునవ్వుతో మమ్మల్ని పిలిచే వ్యక్తి.  సంతోషాన్ని, బాధను నాన్నతోనే పంచుకునే వాళ్లం. ఆయనతో కూర్చుంటే  అన్ని బాధలు తీరిపోయేవి. అన్నపూర్ణ స్టూడియోస్‌ అంటే ఆయనకు చాలా ఇష్టం. నచ్చిన స్థలంలో విగ్రహం పెడితే ప్రాణప్రతిష్ట చేసినట్లు అంటారు. ఆయన ప్రాణంతో మా  మధ్యలోనే  నడుస్తున్నారని అనుకుంటున్నాం. ఆయన మన అందరి మనసుల్లో జీవించే వుంటారు. మా కుటుంబానికి పెద్ద దిక్కు వెంకయ్య నాయుడు గారు. ఎప్పుడు ఆహ్వానించినా ఆయన తప్పకుండా వస్తారు. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు’’ తెలిపారు.