బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 17 నవంబరు 2022 (17:48 IST)

సమంత ఒప్పుకుంటే యశోద సీక్వెల్స్ చేస్తాం : దర్శక నిర్మాతలు

Yashoda team
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత
Yashoda team
శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. అన్ని భాషల్లో, అన్ని వయసుల ప్రేక్షకుల నుంచి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ డే ఆరున్నర కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల్లో 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అమెరికాలో హాఫ్‌ మిలియన్ మార్క్ చేరుకుంది.  ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. 
 
నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ''సమంత గారి వన్ విమన్ షో 'యశోద'. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత టైటిల్‌ రోల్‌కి సమంత గారయితే బావుంటుందని అనుకున్నాం. ఆమెకు వెళ్లి చెప్పిన  వెంటనే ఓకే చేశారు. కథ మీద నమ్మకంతో అన్ని భాషల్లో  చేస్తే బావుంటుందని అనుకున్నాం. సమంత గారు అద్భుతం. ఆవిడ మాకు ఎనర్జీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో మబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఆవిడ ఎదుర్కొంటున్నదీ అంతే! ఆవిడ మళ్ళీ సూపర్ ఎనర్జీతో వస్తారు. 'యశోద 2' గురించి చాలా మంది అడుగుతున్నారు.  ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్తగా క్రైమ్స్ పుట్టుకు వస్తున్నాయి. వాటికి పరిష్కరాలూ  ఉంటాయి. 'యశోద' సీక్వెల్ ప్రయత్నం హరి, హరీష్ నుంచి రావాలి. 'యశోద'కు ట్రెమండస్‌ రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ డే స్లోగా స్టార్ట్ అయిన  సినిమా... ఆ రోజు సాయంత్రానికి మౌత్‌టాక్‌తో హౌస్‌ఫుల్స్ తెచ్చుకుంది. శని, ఆదివారాలు అయితే ప్రభంజనమే. ఒక హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాకు ఈ రేంజ్‌ రెస్పాన్స్, యుఎస్‌లో ఈ రేంజ్‌ కలెక్షన్లను ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. మంచి సినిమా తీస్తే విజయం అందిస్తామని కాన్ఫిడెన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు. పాటలు లేకుండా సినిమా ఏంటని మణిశర్మ అడిగితే 'రీ రికార్డింగ్ అద్భుతంగా చేస్తావ్. అదరగొడతావ్' అని చెప్పాను. అద్భుతంగా చేశారు మణి. ఒక ప్రమోషనల్ సాంగ్ చేశాం. త్వరలో విడుదల చేస్తాం. 'యశోద'ను ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా అనుకోలేదు. కొత్త పాయింట్‌ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో చేశాం. మా నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో నాకు మా సహ నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి గారు ఎంతో సపోర్ట్ చేశారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్లు రాజా సెంథిల్‌, రవికుమార్‌ సహకారం మరువలేను. ప్రతి ఒక్కరూ సినిమాను ప్రేమించి పనిచేశారు'' అని అన్నారు. 
  
వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ ''ఇదొక అందమైన సినిమా. ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు కృష్ణప్రసాద్ గారు సపోర్ట్ చేస్తారని చాలా మంది చెప్పారు. ఈ సినిమా విషయంలో మరోసారి అది రుజువైంది. ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ రిస్క్ కాదని, మంచి హిట్ అవుతుందని ఆయన ప్రూవ్ చేశారు. ఆయనకు థాంక్స్ అండ్ కంగ్రాట్స్. కింగ్‌డమ్‌లో ఒక కింగ్ ఉంటారు. జనరల్ ఒకరు ఉంటారు. 'యశోద'కు కింగ్ హరి, హరీష్ అయితే... జనరల్ సమంత గారు. ఈ రోజు సక్సెస్ మీట్ స్టేజి మీద ఆవిడను మిస్ అవుతున్నాం. సినిమా అంతా అద్భుతంగా నటించింది. నా దగ్గరకు ఈ సినిమా తీసుకు వచ్చింది సెంథిల్ గారు. హరి, హరీష్ కూల్‌గా సినిమా తీశారు. మాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్'' అని అన్నారు.  
 
దర్శకులు హరి, హరీష్ మాట్లాడుతూ ''తెలుగులో మాకు  ఇది తొలి సినిమా. అన్ని భాషల నుంచి వస్తున్న స్పందన  ఎంతో సంతోషాన్నిచ్చింది. మాకు ఇది చాలా మ్యాజికల్ మూమెంట్.  అవకాశం ఇచ్చిన కృష్ణప్రసాద్ గారికి థాంక్స్. సమంత గారికి చాలా పెద్ద థాంక్స్. ఆవిడ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. వరలక్ష్మీ గారు వెర్సటైల్ యాక్టర్. మణిశర్మ గారు అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. మా కలను తమ ఆర్ట్ వర్క్ ద్వారా నిజం చేసిన అశోక్ గారికి థాంక్స్. సుకుమార్ గారు హాలీవుడ్ స్థాయి విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి, పని చేసిన సాంకేతిక నిపుణులకు థాంక్స్. 'యశోద 2'కు విషయంలో మాకు ఒక ఐడియా ఉంది. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్‌కు లీడ్ కూడా ఉంది. అయితే... అది సమంత గారిపై ఆధారపడి ఉంది. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన తర్వాత, ఆవిడతో డిస్కస్ చేస్తాం. సమంతగారు ఒప్పుకుంటే సీక్వెల్స్ చేస్తాం. మా నిర్మాత గారూ రెడీగా ఉన్నారు. 'యశోద 2'లో వరలక్ష్మి గారి క్యారెక్టర్ కూడా ఉంటుంది.  మా సినిమాలో సూపర్‌సైంటిస్ట్ ఉన్నిముకుందన్‌ ఉన్నారు. అతను ఏమైనా చేయగలడు(నవ్వుతూ).  యాక్షన్ డైరెక్టర్స్ యానిక్ బెన్, వెంకట్ గారు ఇంట్రెస్టింగ్ ఫైటింగ్స్ కంపోజ్ చేశారు. మాటల రచయితలు పులగం చిన్నారాయణ గారు, డా.  చల్లా భాగ్యలక్ష్మి గారికి స్పెషల్ థాంక్స్. ఇదొక సోషల్ అవేర్నెస్ ఫిల్మ్. కమర్షియల్ పంథాలో తీసినప్పటికీ... ఎమోషన్ ఉంది. ఆ భావోద్వేగాలు అందరికీ రీచ్ అయ్యేలా మాటలు రాశారు. క్రియేటివ్ డైరెక్టర్ హేమాంబర్ జాస్తి గారికి థాంక్స్'' అని అన్నారు. 
 
కల్పికా గణేష్ మాట్లాడుతూ ''ప్రేక్షకులు సినిమాను చూసి ఆదరించి ఇంత పెద్ద విజయం అందించడం, మేం సాధించిన అతిపెద్ద ఘనత. ఈ రోజు సమంత గారిని ఇక్కడ మిస్ అవుతున్నాం. సినిమాలో మంచి కాన్సెప్ట్ చెప్పారు. ఈ సినిమాతో ప్రజల్లో అవగాహన వస్తుందని ఆశిస్తున్నాం'' అని అన్నారు. 
 
సినిమాను హిందీలో విడుదల చేసిన యూఎఫ్ఓ లక్ష్మణ్ మాట్లాడుతూ ''మాకు అవకాశం ఇచ్చిన కృష్ణప్రసాద్ గారికి థాంక్స్. హిందీలో 750 థియేటర్లలో విడుదల చేశాం. అన్నిటిలో సినిమా విజయవంతంగా ఆడుతోంది. రెవెన్యూ పరంగా తొలి రోజు స్లోగా మొదలైనా... శని, ఆదివారాల రిపోర్ట్స్ బావున్నాయి. సూపర్ కలెక్షన్స్ వచ్చాయి. స్టడీగా ఉన్నాయి. విజయశాంతి గారు 'కర్తవ్యం'తో సూపర్ స్టార్ అయ్యారు. 'అమ్మోరు'తో సౌందర్య గారు, 'అరుంధతి'తో అనుష్క గారు సూపర్ స్టార్స్ అయ్యారు. ఇప్పుడీ 'యశోద' సమంత గారు పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యారు'' అని అన్నారు.
  
రచయితలు పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ''ఈ క్షణం ఇక్కడ నిలబడటానికి కారణం మా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారు. 'మీరు రాయగలరు. రాయండి. మీ ఇద్దరూ సక్సెస్ అయితే చూడాలని ఉంది' అని మమ్మల్ని  ఆశీర్వదించారు. ముందుగా ఆయనకు థాంక్స్. తమిళ్ తెలిసిన అమ్మాయి, తెలుగు నేటివిటీ తెలిసిన అబ్బాయి కలిసి పని చేస్తే బావుంటుందని, కథకు న్యాయం చేస్తారని ఆయన అన్నారు. కృష్ణప్రసాద్ గారికి ఉన్న ట్రెండీ మనసు ఇంకొకరికి ఉండదు. మాకు అవకాశం ఇచ్చిన హరి, హరీష్ గారికి థాంక్స్. ఇద్దరు కలిసి ఎలా పని చేయాలో వాళ్ళ నుంచి నేర్చుకున్నాం. మమ్మల్ని హేమాంబర్ గారు బాగా సపోర్ట్ చేశారు. ఇంత పెద్ద స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సినిమాకు కొత్త రచయితలతో మాటలు రాయించుకోవడానికి యాక్సెప్ట్ చేసిన సమంతగారికి ధన్యవాదాలు. యశోదలో వరలక్ష్మి గారి కేరక్టర్‌ చాలా బాగా కుదిరింది. ఆవిడ ఇండస్ట్రీలో పదేళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా కంగ్రాట్స్'' అని అన్నారు.      
 
ఈ కార్యక్రమంలో క్రియేటివ్ డైరెక్టర్ హేమాంబర్ జాస్తి, ఆర్టిస్టులు దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ, మధురిమ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాజా సెంథిల్, ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.