శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 2 అక్టోబరు 2021 (16:38 IST)

గాంధీని ఎందుకు చంపార‌నే అంశంతో 1948 - అఖండ భారత్

1948-Akhanda Bharat
ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి నిర్మిస్తున్న చిత్రం `1948-అఖండ భారత్`. అన్ని భారతీయ, అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. గాంధీ జయంతి సందర్బంగా ఈ చిత్రం తాజా పోస్టర్ ను రిలీజ్ చేశారు.
 
ఆలేఖ్య శెట్టి హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ చిత్రంలో గాంధీగా రఘనందన్, నాథురాం గోడ్సే గా డా. ఆర్యవర్ధన్ రాజ్, సర్ధార్ వల్లభాయ్ పటేల్ గా శరద్ దద్భావల, నెహ్రుగా ఇంతియాజ్, జిన్నాగా జెన్నీ, అబ్దుల్ గఫర్ ఖాన్ గా సమ్మెట గాంధీ ప్రధాన పాత్రలు పోషించగా సుమారు 92 ముఖ్య పాత్రలతో భారీగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లు నిర్మాత ఎం.వై.మహర్షి తెలిపారు
.
గాంధీజీని ఎవరు చంపారన్నది అందరికి తెలుసు. కానీ ఎందుకు., ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది? దానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియవు. దానిక్కారణం, గాడ్సే తన కోర్ట్ వాదనలో గాంధీజీని వధించడానికి గల కారణాలను సుమారు 150 పాయింట్స్ గా 8 గంటలపాటు సుదీర్ఘంగా వివరించినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కోర్ట్ నుంచి బైటికి రానివ్వకుండా నిషేధించింది. 
 
గాడ్సేని ఉరి తీసిన సుమారు 30 సంవత్సరాల తర్వాత ఆయన కోర్ట్ లో ఇచ్చిన వాగ్మూలం బయటకు వచ్చినా- దాన్ని కూడా  ప్రచురణ కాకుండా అడ్డుకున్నారు. అలా 70 సంవత్సరాల పాటు దాచి పెట్టబడిన నిజాలను  ప్రామాణికంగా పరిశోధన చేసి ఈ సినిమాకి స్క్రిప్ట్ ని సిద్ధం చేశామని ద‌ర్శ‌కుడు వివ‌రించారు. మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని, వివాదాలకు తావులేని రీతిలో- మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించామన్నారు.
 
 11,372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పైచిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి 96 క్యారెక్టర్లు, 114 సీన్స్, 2200కి పైగా ప్రొపర్టీస్, 1670కి పైగా కాస్ట్యూమ్స్,  500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్ లో, 9 షెడ్యూల్స్ లో  ఉన్నత ప్రమాణాలతో జాతీయ, అంతర్జాతీయ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నామని డాక్టర్ ఆర్యవర్ధన్ రాజ్ తెలిపారు.
 
ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే -మాటలు - రీసెర్చ్: డాక్టర్ ఆర్యవర్ధన్ రాజ్, సంగీతం: 'గులాబీ' ఫేమ్ శశిప్రీతమ్, ఎడిటింగ్: రాజు జాదవ్, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, మేకప్: హరి పోగుల, కెమెరా: చంద్రశేఖర్ (చెన్నై), నిర్మాత: ఎమ్.వై.మహర్షి, దర్శకత్వం: ఈశ్వర్ డి.బాబు.