బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. సాహిత్యం
  3. కళలు మరియు సంస్కృతి
Written By ఎం
Last Updated : బుధవారం, 31 జులై 2019 (08:45 IST)

దాశరథి, సినారెల కవిత్వం - ఉర్దూ సాహిత్య ప్రక్రియా ప్రభావం

తెలంగాణా కవిత్వాకాశం మీద నిత్య సూర్య చంద్రులు దాశరథి, సినారెలు. ఇద్దరూ ప్రతిభావంతులైన కవులు. ఇద్దరూ తెలంగాణా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన వాళ్లు. తెలంగాణా దీపస్తంభాలుగా తెలుగు కవిత్వపు జిలుగుల్ని నలుదిశలా ఉద్దీపన చేసినవాళ్లు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి హృదయాలలో  రసవీణలు మీటిన వాళ్లు. దశదిశలా చాటిన వాళ్ళు.

తెలుగు ఉర్దూ తనకి రెండు కళ్ళు గా ప్రకటించుకున్నాడు దాశరథి, సినారె సైతం తన తెలుగు గొంతులోంచి ఉర్దూ పలుకులు పలికిన వాడు. దాశరథి, సినారెలు దక్కన్ పీఠభూమిలో పుట్టినవాళ్ళు. లేత ప్రాయంలోనే ఉర్దూ కవితా సౌరభాల్ని ఆఘ్రాణించిన వాళ్లు. ఆబగా ఆస్వాదించిన వాళ్ళు, కవిత శోభగా అక్షరీకరించిన వాళ్ళు. ఉర్దూ కవితా ప్రక్రియల్ని తెలుగు కవితావనంలో పువ్వులుగా విరబూయించిన వాళ్ళు.

వాటి కమనీయ కవితా పరిమళాల తో పాఠకలోకాన్ని ఉర్రూతలూగించారు. తెలుగు కవిత్వానికి చక్కదనాన్ని, చిక్కదనాన్ని చేకూర్చిన ఈ ఉభయ కవుల్ని యావదాంధ్రదేశం అభిమానించింది, ఆరాధించింది. ఈ ఇద్దరి కవుల ప్రభావం అనుకరించిన, అనుసరించిన వర్థమానులు వందల సంఖ్యలో ఉంటారు.
 
దాశరథి కవిత్వం - ఉర్దూ ప్రభావం
కవిగా దాశరథి హృదయం అంతా ఉర్దూమయం. ఆయనతో పరిచయమున్న వాళ్లకీ, ఆయన సభలో పాల్గొన్న వాళ్లకి ఈ విషయం బాగా తెలుసు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఒక ముషాయిరా జరిగిపోయేది. ఆయన ఉన్న సభలో ఉర్దూ కవితా నెత్తవి గుబాళించేది. దాశరథి విద్యాభ్యాసం ఉర్దూ మాధ్యమంలోనే జరిగింది. ఉర్దూ, ఫారసీ భాషలలో మంచి పరిచయం ఏర్పడింది. జనాబ్ జక్కీ సాహెబ్ గారు ఈ భాషల్లో గట్టి పునాదులు వేశారు. ఖమ్మం హైస్కూల్లో మౌల్వీ రషీదుల్ హసన్ గారు ఉర్దూ నేర్పిన ఉపాధ్యాయులు.

దాశరథితో పాటు హీరాలాల్ మోరియా, డి .రామలింగం ,కవిరాజ మూర్తి, ఎం.ఎల్ నరసింహారావు గారలు సహాధ్యాయులు. ఆయన బాల్య మిత్రులు. వారు కూడా వారి వారి రంగాల్లో ప్రసిద్ధులయ్యారు. బాల్యంలో పడిన ఉర్దూ కవిత బీజాలే పెద్దయ్యాక 'గాలిబ్ గీతాలుగా', మీర్ తకీమీర్ మాధుర్యంగా, బహదూర్ షా జఫర్ మధు తరంగాలుగా అనువాద రూపంగా అవతరించాయి. 

అమ్జద్ హైద్రాబాదీ, మఖ్దూం మొహియూద్దీన్, సర్దార్ జాఫ్రీ, షకీల్ బదాయునీ, హస్రత్ జైపురీ, మజ్రూహ్ సుల్తాన్ పురీ, సలావుద్దీన్ అయ్యర్, ఔజ్ యాకూబ్ (ఆంధ్రప్రదేశ్ ఉర్దూ ఆస్థాన కవి), రాజేంద్ర కిషన్, రాజా ఆలంబాద్, జానిసార్ అఖ్తర్ వంటి దిగ్దంతులైన ఉర్దూ కవులతో దాశరథి కలిసి తిరిగాడు. వారితో పాటు ముషాయిరాలో పాల్గొన్నాడు. ఉర్దూ కవితా సౌరభాల్ని హృదయంలో నింపుకున్నాడు.
 
దాశరథి సినిమా పాట - ఉర్దూ బాట
1960 ప్రాంతంలో దాశరథి సినిమా రంగంలోకి ప్రవేశించాడు. ఆ రోజుల్లో 'వాగ్దానం' సినిమాని ఆచార్య ఆత్రేయ స్వయంగా నిర్మిస్తున్నాడు. తాను తీసే సినిమాకు పాటల రచయితగా దాశరథిని ఎన్నుకున్నాడు. అప్పటికే దాశరథి అఖిలాంధ్ర మహాకవి గా పేరు పొందాడు. దాశరథి రాకతో తెలుగు సినిమా పాట కొత్త పరవళ్లు తొక్కింది. ఉర్దూ కవిత సోయగాల్ని సంతరించుకుంది.

ఉర్దూ సాహిత్య ప్రక్రియలైన 'రుబాయి', 'గజల్', 'ఖవాలీ', 'తరానా'లు తెలుగు సినిమా పాటకు కొత్త అందాలు రంగరించాయి. ఈ క్రింది పాటను చూస్తే గజల్ సంస్కృతిని దాశరథి ప్రవేశపెట్టిన వైనం తెలుస్తుంది.
"ఓహో గులాబీ బాలా! అందాల ప్రేమ మాలా!
సొగసైన కనుల దానా! సొంపైన మనసు దానా!
నీ వారెవరో తెలుసుకో! తెలు
సుకో!"

ఇదే అంశాన్ని సమర్థిస్తూ 'దాశరథి సినిమా పాటల్ని' సంకలనం చేసిన కె. ప్రభాకర్ తెలుగు సినిమా పాటలకు ఉర్దూ పలుకుబళ్ళు అందించిన సంగతి ఇలా పేర్కొన్నారు. "ఉర్దూలో నిష్ణాతుడైన దాశరథి 'ఇద్దరు మిత్రుల' లో 'ఖుషీ ఖుషీగా నవ్వుతూ' అనే పాటలో కొన్ని ఉర్దూ పదాల భావ సమైక్యతతో, వాక్యసమైక్యత చేకూర్చబడినది. కొన్ని ఖవ్వాలి పాటలకు తెలుగుదనం జోడించి రాశారు. దాంట్లో కొన్ని 'ఇద్దరు మిత్రులు' చిత్రంలో 'నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి', 'పునర్జన్మ'లోని 'దీపాలు వెలిగె పరదాలు తొలిగె', 'లేతమనసు'లోని 'అందాల ఈరేయి నీదోయి నీదోయి' ఇవి జనాదరణకు నోచుకున్నాయి. ఉర్దూ పదాల ఖుషీ, చలాకి, హుషారు, నిషా, మజా, ప్యాలా ఆయా పాటలకు సౌందర్యాన్ని ఇనుమడింపజేశాయి".
 
దాశరథి - ఉర్దూ గజల్ ప్రక్రియ
దాశరథి, అమ్జాద్ హైద్రాబాదీ, మీర్ తకీమీర్, దాగ్, అసదుల్లాఖాన్ గాలిబ్, బహదూర్ షా జఫర్, ఇక్బాల్, ఫైజ్, అహ్మద్ ఫైజ్, జోష్ మలీహాబాదీ, షకీల్ బదాయూనీ, సాహిర్ లూథియాన్వీ, అహ్మద్ ఫరాజ్ మొదలైన ఉర్దూ మహాకవుల గజళ్ళను, రుబాయీలను ఇష్టంగా చదివాడు. తన్మయత్వంతో వాటిని తెలుగులోకి తర్జుమా చేశాడు. ఆ భాషలో మిఠాస్ (తియ్యదనం) తెలుగువారందరికీ పంచాడు.

ఇది తెలుగు కవిత్వానికి దాశరథి అందించిన అమూల్యమైన కానుక. ఈ విషయంలో జాతియావత్తు ఆయన రుణం తీర్చుకోవాలి. తెలుగులో దాశరథి గజల్ ప్రక్రియకు ఆద్యుడు. అలాగే రుబాయి ప్రక్రియకు కూడా తానే బాధ్యుడు. 1966లో దాశరథి తొలి గజల్ రాశాడు. ఈ విషయాన్ని సాధికారికంగా 'తెలుగు పై ఉర్దూ పారశీకముల ప్రభావము' (1968) అనే గ్రంథంలో డా. కె. గోపాలకృష్ణారావు గారు స్పష్టీకరించారు. 'అచ్చమైన గజల్ స్వరూపమును తెలుగు మూసలో దింపిన గౌరవము దాశరథి గారికి లభించుచున్నది" అని కీర్తి కితాబునిచ్చారు. ఆ గజల్ కి ఎన్నో పాఠాంతరాలున్నా పూర్తి పాఠం ...

'రమ్మంటే చాలు గానీ రాజ్యాలు విడిచిరానా
నీ చిన్ని నవ్వుకోసం స్వర్గాలు గడచిరానా
ఏడేడు సాగరాలు, ఎన్నెన్నొ పర్వతాలు
యెంతెంత దూరమైన బ్రతుకంతా నడిచిరానా
కనులందు మంచులాగా కలలన్ని కరిగిపోగా
కావేరి వోలె పొంగి కన్నీరు తుడిచిరానా
నీవున్న మేడ గదికి నను జేర నీయ రేమో!
జలతారు చీరగట్టి సిగపూలు ముడిచిరానా
పగబూని కరకువారు, బంధించి వుంచినారు
యేనాటికైనా గానీ ఈ గొడ పొడిచిరానా!"
ఈ గజల్ ఎందరో సాహితీ పిపాసకుల్ని, సంగీత గాయక ప్రియులను ఆకట్టుకుంది. దాశరథి మొత్తం 11 గజళ్ళు రాశారు. దాశరథి వెలిగించిన గజల్ మషాల్ (కాగడ) అందుకుని, ఆ కాంతిని దశదిశలా వ్యాపింపజేసిన వారు సి.నా.రె.
 
దాశరథి - రుబాయీ ప్రక్రియ
దాశరథికి రుబాయి ప్రక్రియమీద కూడా వల్లమాలిన అభిమానం. అరబ్బీలోని రుబాయికి మూలకర్త ఉమర్ ఖయామ్. ఆ కవి ప్రభావం కూడా దాశరథిని రుబాయి వైపు రూపు మళ్లించేలా చేసింది. అంతేకాదు తన యౌవనంలో అమ్జద్ హైద్రాబాదీ అనే రుబాయి కవి దాశరథిని సమ్మోహితుణ్ణి చేశాడు. అమ్జద్ హైద్రాబాదీతో దాశరథికి గాఢమైన పరిచయం ఉండేది.

ఆ పరిచయాన్ని దాశరథి తన స్వీయచరిత్రలో ఇలా రాసుకున్నాడు. "అమ్జద్ ఆయన కలం పేరు. అసలు పేరు సయ్యద్ అహ్మద్ హుసేన్. కానీ 'అమ్జద్ హైద్రాబాదీ' గానే ప్రసిద్ధుడు. ‘ఆగాపురా’ ప్రాంతంలో ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు. ఆయన బేగం, చాయ్ తయారు చేయించి పంపుతూ ఉండేది. వేడి వేడి చాయ్ తాగుతూ ఆయన వాడి వాడి రుబాయిలు వినేవాళ్ళం.
"కవిగా దాశరథి స్వేచ్ఛా ప్రియుడు. నిజాంను ఎదిరించి నిప్పులు కురిపిస్తాడు. ప్రేయసిని తలచుకుంటూ వెన్నెల కుప్పలు కురిపిస్తాడు. దాశరధి రుబాయిలు హాయిగా సాగిపోతాయి. గిలిగింతలు పెడతాయి. మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. హాస్యం కురిపిస్తాయి. ఆలోచింపచేస్తాయి. మచ్చుకి రెండు రుబాయీలు చవిచూడండి.
"నింగి కితాబు చేశాను 
చుక్కల హిసాబు వేశాను
ప్రేయసి కోసం వేచి వేచి 
తుదకు మంచమే నేశాను"
"నిప్పులోంచి అప్పుడప్పుడు పొగ పుడుతుంది
నీళ్ళలోంచి విద్యుత్తను సెగ పుడుతుంది
ఈ దానవ లోకంలో ఎన్నటికైనా
మానవులని పిలువదగిన తెగ పుడుతుంది"
దాశరథి గజల్ రాసినా, రుబాయీ రాసినా ఆయన ముద్ర స్పష్టంగా ఉంటుంది.

ఉర్దూ కవి సమయాలు, కవితా సామాగ్రి దాశరథి తెలుగు భాషకు ప్రదానం చేశాడు. కొంతమంది కోస్తాంధ్ర కవుల్లాగా ఆయన విదేశీ కవుల్ని పట్టుకుని వేళ్లాడలేదు. దాశరథి భారతీయ భాషల్ని ప్రేమించాడు. ఉర్దూ భాష ప్రక్రియలైన గజళ్ళని, రుబాయి లను తెలుగు వాళ్లకు పరిచయం చేశాడు. వీటిని తెలుగు కవితా ప్రక్రియల్లో విలీనం చేశాడు. తెలంగాణ దాశరథి రుణం తీర్చుకోవాలి. నిత్య స్మరణం చేసుకోవాలి.
 
 సినారె కవిత్వం ఉర్దూ సాహిత్య ప్రక్రియా ప్రభావం
సినారె కంటే దాశరథి ఆరేళ్ళు పెద్దవాడు. ఆ పెద్దరికం ఆ రోజుల్లో సినారెని బాగా ప్రభావితం చేసింది. దాశరథి 25 ఏళ్లకే మహాకవి అయ్యాడు. ఆ సమయంలో సినారె 'నవ్వని పువ్వు' లాంటి గేయాలు రాస్తున్నాడు. ఇద్దరిని తెలంగాణ తల్లి ఒక్కటి చేసింది. 'తెలంగాణ రచయితల సంఘం' రచనా రంగంగా మారింది. సినారె తన 'జలపాతం' కావ్యాన్ని అంకితమిచ్చి దాశరథిని 'కవితాలోక ప్రభానీరధి’, ‘మనోజ్ఞ కవితాశరథి’, ‘ఓహో! దాశరథీ మహాకవీ!' అని పులకరించి పలవరిస్తాడు.

దాశరథి కూడా ' తమ్ముడాయని మనస్సుమములు విరబూయ' సినారెని ప్రేమగా పిలుస్తాడు. అంతేకాదు 1981లో జరిగిన సినారె 50 వ జన్మదినోత్సవ సందర్భంలో దాశరధి రాసిన ' తమ్ముడూ! తన్మయత్వంలో నిన్నుగూర్చి యాభై పంక్తులు' అనే అభినందన కవిత అపురూపం త్యాగరాయగానసభలో ఆనాడు దాశరథి ఆ కవిత చదవడం, ఓరియంటల్ కళాశాల విద్యార్థిగా ఈ వ్యాసకర్త వినడం ఒక మరపురాని దృశ్యం. సినారె, దాశరథులు ఇద్దరూ 'స్నిగ్థ స్నేహబంధాల బద్ధులు' ఆ స్నేహంతోనే సినారె తరుణ కావ్యలతికలకు దాశరథి తన కరాలతో లేత రేకుల కెంజాయలద్దాడు.

ఇలాంటివి మరెన్నో వారి అనుబంధం గురించి చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇద్దరూ తల్లులు వేరైనా ఇద్దరు ఒక తెలంగాణ తల్లికి పుట్టిన అపూర్వకవి సోదరులుగా సాహిత్యలోకం వీరిని గుర్తించింది. అక్కున చేర్చుకుంది. ఆరాధించింది.

 సినారె కవిగా ఎంత ప్రతిభావంతుడో, అనువాదకుడిగా కూడా అంతే ప్రతిభావంతుడు. గాంధీజీ, సూక్తుల్ని, మీరాబాయి గిరిధర గీతాల్ని, ఖలీల్ జిబ్రాన్ కవితోక్తుల్ని, సరోజినీ నాయుడు ముత్యాల కోకిలల్ని, జాతీయ కవి సమ్మేళనాల్లో ప్రఖ్యాత భారతీయ కవుల కవితల్ని, విభిన్న కవితా రూపాల్ని అనువదించిన తీరు వేరే కవి చేయలేడేమో అనిపించేలా ఉంటుంది.

సినారె కవిత్వానువాదంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మూలంలోని ఛందశ్శిల్పం చెడకుండా మాతృకలోని వన్నె తగ్గకుండా పదాలకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు. అనువాదానికి తెలుగుదనం ఆపాదించడం లో ఆయనది అందెవేసిన చెయ్యి, అది ఉర్దూగజలైనా, హిందీ భజనైనా,దోహా అయినా, సింధి గీతమైన, ఇంగ్లీషు వచనమైనా ఏవైనా సరే సి.నా.రె.కలం కలంకారీతనంలో తెలుగు దుస్తులు తొడుక్కోవలసిందే. సినారె ఉర్దూ పదాలకు దీటుగా తెలుగు మాటలు కూర్చడంలో దిట్ట.

అంతేకాదు హిందీ గీత రచయితలలో సమానంగా అనువాదంలో తాను కూడా సమఉజ్జీ ననిపించుకుంటాడు.
సినారె. సినిమా పాట - ఉర్దూ తోట
సినిమా పాట గురించి శ్రీశ్రీ ఇలా అన్నాడు
"సినిమా పాట రాయడం తేలిక అనుకుంటారు చాలా మంది కానీ కొన్ని లక్షల మందిని
మెప్పించాల్సి ఉంటుంది", సినిమా కవిగా సినారె కోట్లాదిమంది అభిమానుల మనస్సు చూరగొన్నవాడు. 'పాట, మాట - ఇవి నా రెండు కళ్ళు, మాట పాటై మోగాలనీ, పాట మాటై నిలిచిపోవాలని నా తపన అని ఆయన షష్టి పూర్తి ఉత్సవం లో చెప్పుకున్నాడు.

ఇటువంటి భావాన్నే ఓ తెలుగు గజల్ లో ఇలా పలికించాడు. 'మాటకు దండం పెడతా పాటకు దండం పెడతా' అని చెప్పడం పాట మీద ఆయనకున్న ప్రేమకు తార్కాణం అంతే కాదు. "ఎన్ని తెన్నుల కైత కన్నె విహరించినను పాటలలోనే నాదుప్రాణాలు గలవందు" అని ప్రకటించటం ఆయనకే చెల్లింది. ఏదో ఒక సందర్భంలో ఆయన ఇలా అన్నాడు. "నేను నగరానికి రాకుండా ఆధునిక కవిగా కాకుండా ఉంటే గద్దర్ లాగా భుజాన చద్దర్ (దుప్పటి) వేసుకొని పూర్తిగా పాటగాడిగా మారిపోయి ఉండేవాణ్ణ"ని చెప్పారు. 

సినారె 1960వ దశకంలో సినీగీత రచయితగా రంగప్రవేశం చేశాడు. తెలుగు సినిమా పాటకి ప్రబంధపు పోకడల్ని సున్నితమైన శృంగార భావనల్ని అందించాడు. సినారెకున్న ఉర్దూ, హిందీ భాషలలో పరిచయం, పాండిత్యం తెలుగు సినిమా పాటల ప్రపంచానికి ఎంతో ఉపకరించింది. బాల్యం నుంచి ఆయనపై హిందీ సినిమా పాటల ప్రభావం ఉంది. దాశరథి తెలుగు సినిమాల్లో తొలి ఖవ్వాలీ రాస్తే, దానికి విశేష ప్రాచుర్యం కల్పించినవాడు సి.నా.రె.

ఖవాలి బాణీలో 'భలే తమ్ముడు' (1969) సినిమాలో ఉర్దూ పదాలను మేళవించి రాసిన గీతం గురించి నాలుగు మాటలు 'పాటలో ఏముంది - నా మాటలో ఏముంది' పుస్తకంలో సినారె ఇలా రాశారు.
’’ఈ గీతంలో 'సాఖీ'లో నర్తకి పాడుతూ ఉంటే మారువేషంలో ఉన్న హీరో మాటలు విసురుతూ ఉంటాడు. 'షారాబీ కళ్ళతో నిన్ను దోచుకోనా' అంటే 'లాజవాబ్' అంటాడు. 'నషేలీ కురులలో నినుదాచుకోనా' అంటే 'యా షబాబ్' అంటాడు. 'ఆజాలేజా' అంటే క్యాఖూబ్ క్యాఖూబ్' అంటాడు.

ఇందులో కళ్ళతో పాటు కురులకు కూడా మత్తును హత్తి చూపడం కొత్త 'నషేలీకురులు' అంటే మత్తు కొలిపే కురులని, యాషబాబ్' అంటే ఏమి యౌవనమని. ఈ పాటలో ఉర్దూ పదాలతో మరికొన్ని గమ్మత్తులు చేశాను. 'రోజామహలు కట్టి / రాజులా ఏలుకుంటాను' "తల్వారు చూపులకు / దిల్ మిలాయింపనులే" లాంటి ప్రయోగాలవి. తల్వార్ చూపులు అంటే కత్తిలా పదునైన చూపులని'.

తెలుగు సినిమా పాటలకు సినారె ఉర్దూ సోయగాలతో పాటు ఉర్దూ కవి సమయాలు కూడా ముస్తాబు చేయడం ఆయనలోని ప్రయోగదక్షత కి నిదర్శనం. అంతేకాదు ప్రసిద్ధమైన 'రుబాయి' ఛందస్సు తో కూడా సినిమా పాట రాయడం సినిమా సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది. 'సప్త స్వరాలు' అనే సినిమాలో ఒక పాటలోని చరణాన్ని సినారె రుబాయి గా మలచిన తీరు గమనించాల్సిన అంశం
.
"పున్నమి రేయి పోసిన తోట 
కన్నులు చేసే గారడీ వేట
చూపులు జతచేసి ఊపిరి శ్రుతిచేసి 
తనువే జల్లన కవ్వించిన ఆ మాట"
 
సినారె చేసిన హిందీ పాట తెలుగు అనువాదం కూడా అబ్బురపరుస్తుంది. 1962లో 'చైనాటౌన్' సినిమాలో మజ్రూహ్ సుల్తాన్ పురి రాసిన సుప్రసిద్ధ గీతం.
 
''బార్ బార్ దేఖో! హజార్ బార్ దేఖో!!
దేఖ్ నేకె ఛీజ్ హై హమారీ దిల్ రుబా 
తాలీహో! తాలీహో!!తాలీహో!!!"
దీనిని ‘భలే తమ్ముడు’ సినిమాలో హిందీట్యూన్ కి అనుగుణంగా తెలుగులో మహమ్మద్ రఫీ పాడాడు. సినారె చేసిన ఆ హింది గీత అనువాదం ఎవరు విన్న వారెవ్వా! అనకుండా ఉండలేరు.

రఫీ గొంతుకు సరిపోయే శబ్దాన్ని టపీమని వేయ్యడంలో సినారె చాకచక్యానికి (తాలీహో) చప్పట్లు కొట్టకుండా ఉండలేము. ఆ అనువాద గీతం ఇలా ఉంది.
 
"ఎంతవారు గానీ వేదాంతులైన గాని
వాలుచూపు సోకగానే తేలిపోదురోయ్ 
కైపులో! కైపులో!! కైపులో!!!"
(కైపులో అంటే మత్తులో)
సినారె తెలుగు సినిమా పాటల్లో వైవిధ్య భరితమైన రూప నిర్మాణం చేశాడు. రుబాయీ, గజల్, షేర్, దోహా, భజన్, చౌపాయీ, తరానా వంటి ఉర్దూ హిందీ కవితా ప్రక్రియ ని పరిచయం చేసి తెలుగు సినిమా పాటకు నెమలి సింహాసనాన్ని వేశారు.
 
సినారె కవిత - గజల్ ప్రక్రియ
 సినారె "సంప్రదాయంలో ప్రయోగవాది / ప్రయోగంలో సంప్రదాయ వాది". ఆయనది పాదరసం లాంటి బుర్ర. నిలువెల్లా కవి. 'నవ్వని పువ్వు' నుంచి ఈనాటి 'కలం అలిగింది' వరకు ఆయన నిరంతర కవితా స్ఫూర్తి. సినారె కవిగా ఎంతో జీవితాన్ని చూశాడు. కవిత్వంలోని ఎన్నో ప్రక్రియలను అధ్యయనం చేశాడు. మహాకవి దాశరథి లాగే ఉర్దూ పాఠశాలలో చదువుకున్నాడు. ఉర్దూ కవిత ప్రక్రియల్ని అధ్యయనం చేశాడు.

తన కాలంలో జీవించిన ఉర్దూ భాషావేత్తలు సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు, దేవులపల్లి రామానుజరావు, ముఖ్దూం, రాజా బహదూర్ గౌర్, కాళోజీ సోదరులు, దాశరథి వంటి ప్రముఖుల పరిచయం ఆయన ఉర్దూ కవితాభిమానానికి దోహదం చేసింది. సుప్రసిద్ధ ఉర్దూ కవులతో ముషాయిరాల్లో పాల్గొనడం, కవితాగానం చేయడం, ఆయనలోని ఉర్దూ కవితాభిరుచికి పాదులు తీసింది. సినారెని ఇంగ్లీష్ కవుల కంటే హిందీ, ఉర్దూ, ఇతర భారతీయ కవులే ఎక్కువగా ఆకట్టుకున్నారు. సినారె వారిని ఎక్కువగా అనువదించారు.
 
సినారె గేయకవి ''కర్పూరవసంతరాయలు'' కావ్యం ఆయన కంఠంలోంచే వినాలి. సినారె శాబ్దిక సౌందర్యం తెలిసిన లయహృదయుడు. సహృదయుడు. గజల్ ప్రక్రియని తెలుగు వారి ఇంటింటికి రంజాన్ పాయసంలా తీసుకెళ్లాడు. విశ్వవ్యాప్తం చేశాడు. 'తెలుగు గజళ్ళు', సినారె స్వయంగా పాడిన ఆడియో క్యాసెట్లు ఆయనకు ఎనలేని పేరు తెచ్చాయి. ఆయన గజళ్ళకు చలువ పందిళ్లు వేశాడు.

దాశరథి తన గజళ్ళతో కాస్త శృంగారాన్ని కొద్దిగా ప్రణయాన్ని రుచి చూపించాడు. సినారె మాత్రం తన గజళ్ళలో మానవీయ దృక్పథాన్ని, సామాజిక అంశాల్ని, సమస్యల్ని చిత్రించాడు. దాశరథి గజళ్ళ కంటే సినారే గజళ్ళే విశేష ప్రాచుర్యం పొందాయి. ఎందుకోగానీ దాశరథి గజళ్ళను భుజాన వేసుకుని ప్రచారం చేసే గాయకులు లేకపోవడమే కారణం అయి ఉండవచ్చు. బహుశా సినారె గాయకుడు కావడం, దాశరథి గాయకుడు కాక పోవడం మరో కారణం కావచ్చునని విమర్శకుల అభిప్రాయం.

సినారె గజల్ లో ఉదాత్తమైనదీ, హృదయాన్ని ఆకట్టుకున్నదీ, అపురూపమైనదీ అమ్మ మీద రాసిన ఈ గజల్.
 "అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు
  సరి తూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు"
సినారె గజళ్ళు వందకు పైగా ఉంటాయి. అన్నీ వస్తువైవిధ్యంతో కూడుకున్నవే. గజల్ ఛందస్సుకు అనుగుణంగా ఉండేవే!
 
సినారె కవిత్వం - రుబాయీ ఛందం
సినారె గజల్ ప్రక్రియతో పాటు రుబాయీ ప్రక్రియను కూడా అవకాశం ఉన్నప్పుడల్లా సినిమా పాటల్లోనూ, తన గేయ కావ్యాల్లోనూ ప్రయోగిస్తూ ఉండేవాడు. సినారె ప్రయోగ దృష్టి విలక్షణమైంది. సినారె రుబాయీ రూపురేఖల్ని మార్చేశాడు. సాధారణంగా రుబాయీకి నాలుగు పాదాలు ఉంటాయి 1, 2, 4 పాదాలకు అంత్యప్రాసనియతి ఉంటుంది. దీనిని ఉర్దూలో ఖాఫియారదీఫ్ అంటారు.

3వ పాదంలో ప్రాస ఉండదు. సినారె పాత రుబాయీ ఛందస్సు కి కొత్త లక్షణం చేర్చాడు. కొత్తగా 5 వ పాదం చేర్చాడు. నిర్మాణ శిల్పంలో తన ప్రతిభని చూపాడు. తన రుబాయీలకు 'ప్రపంచపదులు' అని నామకరణం చేశాడు. ఇవి కూడా తెలుగులో విశేష ప్రాచుర్యం పొందినవే. మూల రుబాయీలోని 3వ పాదంలో తఖల్లుస్ (కవి నామముద్ర) ఉంటుంది. అయితే సినారె అరుదుగా వాడాడు. ఉదాహరణకు ఈ ప్రపంచపదులు రుబాయిని గమనించండి.
"ఒరిగి పండిన జాతికి వెను చరుపులీ ప్రపంచపదులు
    మరుగుపడిన నీతికి కనుమెరుపులీ ప్రపంచపదులు
    చేదో తీపో మథించి చెప్పాడు సుమా సినారె
      కునికే అడుగులకు మేలు కొలుపులీ ప్రపంచపదులు
      మారే విలువలకు దారి మలుపులీ ప్రపంచపదులు"
ఫారసీ రుబాయీ ప్రక్రియను 'ప్రపంచపదు'ల్లో సినారె చేసిన వైవిద్యభరితమైన వినూత్న ప్రయోగ విన్యాసాల్ని గురించి మరింత విపులంగా అర్థం చేసుకోవాలంటే 'ప్రపంచపదులు' సంపుటికి డా ఎన్. గోపి గారు రాసిన ముందుమాట 'పంచ పదుల్లో ప్రపంచం' చదివితే తెలుస్తుంది.

దాశరథి, సినారెలిద్దరూ తెలుగు సినిమా పాటకు ఉర్దూ నడక నేర్పారు. గజల్ సువాసనల్ని గుప్పించి చవులూరించారు. తెలుగులో గజల్ ప్రక్రియ దాశరథితో పోటమరిచింది. సినారెతో విస్తరించింది. దాశరథి, సినారె తెలంగాణా కవికిశోరాలు. కాళిదాసభారవులు ఆనాడే కాదు ఈ కాలంలోనూ ఉన్నారనడానికి ఈ ప్రతిభారవులు నిలువెత్తు దర్పణాలు.

దాశరథి సినారెల కవిత్వం మీదే కాదు మొత్తం రెండు రాష్ట్రాల తెలుగు కవుల మీద ప్రసరించిన ఉర్దూ సాహిత్య ప్రభావం మీద లోతైన పరిశోధనలు జరగాలి. లోకానికి తెలంగాణ కవుల ప్రతిభా విశేషాలు తెలియాలి.
 
(తెలంగాణా దీపస్థంభాలైన ఈ మహోన్నత కవుల జయంత్యుత్సవాల సందర్భంగా)