శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. సాహిత్యం
  3. కళలు మరియు సంస్కృతి
Written By ivr
Last Modified: సోమవారం, 3 అక్టోబరు 2016 (17:47 IST)

దేవాలయాల పరిరక్షణ అందరి బాధ్యత... 'సేవ్ టెంపుల్స్' చిత్రోత్సవంలో మురళీధర రావు

హైదరాబాద్ : విజ్ఞాన కేంద్రాలైన దేవాలయాల పరిరక్షణ బాధ్యత అందరిదని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ మురళీధరరావు పేర్కొన్నారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ (జి.హెచ్.హెచ్.ఎఫ్) మరియు సేవ్ టెంపుల్స్. ఆర్గ్, USA సంయుక్త ఆధ్వర్యంలో ప్రసాద్ లాబ్స్‌

హైదరాబాద్ : విజ్ఞాన కేంద్రాలైన దేవాలయాల పరిరక్షణ బాధ్యత అందరిదని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ మురళీధరరావు పేర్కొన్నారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ (జి.హెచ్.హెచ్.ఎఫ్) మరియు సేవ్ టెంపుల్స్. ఆర్గ్, USA సంయుక్త ఆధ్వర్యంలో ప్రసాద్ లాబ్స్‌లో జరిగిన డాక్యుమెంటరీ చలన చిత్రోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ - భారతదేశం ప్రపంచానికే ఆదర్శమైన ఆధ్యాత్మిక కేంద్రమని, ఇక్కడ వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. దేవాలయాలు విజ్ఞానం, వికాసం, వ్యవస్థ నిర్మాణం తయారయ్యే ఆధ్యాత్మిక కేంద్రాలని చెప్పారు. సేవ్ టెంపుల్స్ పేరుతో డా. గజల్ శ్రీనివాస్ చేపట్టిన ఉద్యమం ఎంతో గొప్పదని, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరు అభినందనీయులని పేర్కొన్నారు. 
 
జస్టిస్ గ్రంధి భవానీ ప్రసాద్ మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతి మనపై ప్రభావం చూపుతుంటే, పురాతన దేవాలయాలు, సనాతన ధర్మం మన సంస్కృతిని గుర్తుచేస్తాయన్నారు. వాటిని వెలుగులోకి తెచ్చే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలన్న ఆకాంక్ష ఆయన వ్యక్తం చేశారు. డాక్యుమెంటరీ చలన చిత్రోత్సవ నిర్వాహకుడు, జి.హెచ్.హెచ్.ఎఫ్ మరియు సేవ్ టెంపుల్స్ ఆర్గ్, USA సంస్థ ప్రచార సారథి డా. గజల్ శ్రీనివాస్ దేవాలయాల పరిరక్షణకు చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి వెల్లడించారు. 
 
నాగసాయి మక్కం నిర్మాణ దర్శకత్వం వహించిన కురుమూర్తి రాయ చిత్రానికి రూ. లక్ష మొదటి బహుమతి, కొత్తపల్లి సీతారాం నిర్మించి దర్శకత్వం వహించిన మహేంద్ర గిరి చిత్రానికి రూ. 75 వేల ద్వితీయ బహుమతి, సత్య ప్రసాద్ దర్శకత్వంలో హరిష నిర్మించిన మనిష్యులు చేసిన దేవుడు చిత్రానికి రూ. 50 వేల తృతీయ బహుమతి లభించినట్లు చెప్పారు. అలాగే రూ. 10 వేల కన్సోలేషన్ బహుమతులు పొందిన చిత్రాలు, ప్రత్యేక స్క్రీనింగ్ విభాగంలో ఎంపికైన చిత్రాలను ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. బహుమతి పొందిన విజేతలకు బీజేపీ కార్యదర్శి మురళీధరరావు, జస్టిస్ భవానీ ప్రసాద్ నగదు బహుమతి, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ రేఖ గోపాలకృష్ణ, సినీ రంగస్థల నట శిక్షకులు దీక్షిత్, ప్రముఖ సినీ గేయ రచయిత సిరాశ్రీ, ఎంవీఆర్ శాస్త్రి, శాసనసభ్యులు జి కిషన్ రెడ్డి, సినీనటి కవిత, హీరోయిన్ మధుషాలిని, నటులు రోహిత్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.