శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. సాహిత్యం
  3. కళలు మరియు సంస్కృతి
Written By ఎం
Last Updated : గురువారం, 23 జులై 2020 (10:40 IST)

నేడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి

'స్వాతంత్ర్యం నా జన్మ హక్కు'  ఈ గర్జన లోకమాన్య బాలగంగాధర తిలక్ ది. భారతజాతి కణకణంలో స్వాతంత్రేచ్చను  జాగృతం చేసిన సింహగర్జన అది.

◆ తిలక్ పాఠశాలలు నడిపారు. పత్రికలు నడిపారు. జైలు ఊచలు లెక్క పెట్టారు.గీతారహస్యం లాంటి మహోన్నత గ్రంథాలు రాశారు.

◆ శివాజీ జయంతులు, గణేష్ ఉత్సవాలు నిర్వహించారు. అయితే వీటన్నిటిలోనుంచి ఆయన ప్రయత్నం ఒక్కటే! భారత జాతిని జాగృతం చేయాలి. తన చిట్టచివరి శ్వాసవరకు మరియు జాతీయ చైతన్యం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం, పరితపించిన మహనీయునుడే తిలక్.

◆ బాలగంగాధర్ తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్. ఆయన గొప్ప సంస్కృత విద్వాంసుడు, ప్రసిద్ధ ఉపాధ్యాయుడు.

◆  బాల్ కు  బాల్యంనుంచే స్వతంత్రమైన ఆలోచనలు వుండేవి. ఎప్పుడూ స్వతంత్రంగానే వ్యవహరించేవాడు. చిన్నప్పటినుంచే బాల్ అన్యాయాన్ని ఎదుర్కొనే అలవాటు చేసుకున్నాడు.

◆ నానాసాహెబ్ , తాత్యా తోపే, ఝాన్సీరాణిల కథలు విన్న బాల్ ఉత్తేజితుడయ్యేవాడు. ఈ కథలు విన్న బాల్ పసి మనసులో  అనేక ఆలోచనలు పరిగెత్తేవి. "ఆహా! మాతృదేశం కోసం ప్రాణాలర్పించిన వీరెంత గొప్పవాళ్లు! ఆ మహనీయుల్లాగానే నేను కూడా పెద్దవాడినయిన తర్వాత మాతృభూమికి సేవ చేస్తాను". మాతృ భూమిని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేస్తాను. ఈ కోరిక ఆయన అంతరాంతరాలల్లో ప్రతిజ్ఞగా నిలిచిపోయింది.

◆ బాలగంగాధర్ తిలక్ "దక్కన్ కాలేజీ"లో చేరాడు. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండేది. శారీరకంగా బలహీన ఆయనది. బలహీన శరీరంతో దేశ సేవ చెయ్యడం ఎలా ? అందుకని ఆరోగ్యాన్ని కుదుట పరుచుకోవాలని, శరీర దారుఢ్యాన్ని పెంచుకోవాలని తిలక్ నిర్ణయించుకున్నాడు. రోజూ వ్యాయామం చేస్తూ పుష్టికరమైన ఆహారం తీసుకునేవాడు.

శరీర దారుడ్యం పెరగడంతో కళాశాలలో అన్ని ఆటలలో ఆయనే ప్రథమ స్థానాన్ని సాధించాడు. డబుల్ గ్రాడ్యుయేషన్ చేసిన తిలక్ కు ఆంగ్లేయుల పాలనలో పెద్ద జీతంతో మంచి ఉద్యోగమే దొరికేది. కానీ జీవితాన్ని దేశం కోసమే అర్పించాలని తిలక్ చిన్నప్పుడే నిర్ణయించుకున్నాడు.

◆ ప్రజల్లో స్వాతంత్ర్య భావనలు ఇంకా పూర్తిగా వికసించలేదు. స్వాతంత్ర్య పిపాసను వారిలో రగల్చవలసి ఉంది. దేశభక్తిని వారి హృదయాల్లో నాటవలసి ఉంది. భారతీయ సంస్కృతి ఆధారంగా, నవ్యజీవన భవంతికి పటిష్టమైన పునాది వెయ్యవలసి ఉంది. ప్రతి భారతీయుడికి భారతీయ సంస్కృతినీ, జాతీయ ఆదర్శాలను బోధించవలసి ఉంది. వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవలసి వుంది. ఈ ఆదర్శాల సాఫల్యానికి విద్యా సంస్థలే మార్గమని  తిలక్ బలమైన అభిప్రాయం.

◆ ప్రతిదానికి భగవదేచ్ఛగా భావించే ప్రజల్లోని, మూఢ విశ్వాసాన్ని తొలగించి ప్రజలను జాగ్రత్త పరచవలసిన అవసరం ఉంది అని, విద్యార్థుల్లో  నైతిక, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఎన్నో విద్యాసంస్థల్ని స్థాపించాడు.

◆ బాల్యవివాహాలను నిషేధించాలని వితంతు వివాహాలను ప్రోత్సహించాలని తిలక్ నినదించారు.

◆ గాంధీజీ సహాయ నిరాకరణ ఆందోళన ప్రారంభించారు. ఈ ఆందోళనకు అనుసరించిన పద్ధతి 1906 లో తిలక్ రూపొందించిన విధానమే.

◆ ఆంగ్లేయులు బెంగాల్ ను  విభజించారు. ప్రజల్లో పెల్లుబికిన ఆవేశాన్ని అణిచివేయడం కోసం ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించింది. "దేశ దౌర్భాగ్యం" పేరుతో  "కేసరి" లో తిలక్ ఒక వ్యాసం వ్రాశారు. ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు.

◆ " దేశ దౌర్భాగ్యం" అనే శీర్షికతో రాసిన వ్యాసం సాకుతో తిలక్ ని ప్రభుత్వం దేశద్రోహిగా చిత్రించింది. ఆరేళ్ల దేశ బహిష్కరణ శిక్ష విధించారు. బర్మాలోని మాండలే  జైల్లో తిలక్ ని నిర్బంధించారు. మాండలే జైల్లో ఓ ఏడాది గడిచిన తరువాత కొన్ని షరతులకు అంగీకరిస్తే తిలక్ ని  ప్రభుత్వం విడుదల చేస్తుందని సూచించారు.

అందుకు తిలక్  ఈ విధంగా అన్నాడు. "ఇప్పుడు నాకు 53 ఏళ్లు. ఇంకో పదేళ్ళు బతుకుతానుకుంటే జైలు  నుంచి విడుదలయ్యాక మరో ఐదేళ్ల సమయముంటుందన్నమాట. ఆ ఐదేళ్లు ప్రజలకు సేవ చేయగలుగుతాను. కానీ షరతులకు లొంగినట్లయితే నేను ఇప్పుడే చచ్చిపోయినట్లు లెక్క."

◆"స్వాతంత్రం  మా జన్మహక్కు"న్న తిలక్ నినాదం ప్రతి భారతీయుడి హృదయ ఫలకం మీద ముద్రించుకుని పోయింది. భారతీయులకోర్కెల సాధనకు, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆందోళన కొనసాగించాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు.

◆ అప్పటికి తిలక్ ఆరోగ్యం బాగా క్షీణించింది. శరీరం అలసిపోయింది. అయినా ప్రజలను జాగృత పరచడానికి ఆయన పర్యటిస్తూనే ఉన్నారు. 1920 ఆగస్టు 1న ఆదీపం కొండెక్కింది. రెండు లక్షలమందికి పైగా ప్రజలు ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, లాలాలజపతిరాయ్ తదితర నాయకులు మృతదేహాన్ని మోశారు.