నిర్మాణ సంస్థ: హారిక అండ్ హాసిని క్రియేషన్స్
తారాగణం : పవన్ కల్యాణ్, కీర్తిసురేష్, అను ఇమాన్యుయేల్, ఖుష్బూ, రావు రమేష్.
సంగీతం : అనిరుధ్
నిర్మాత : ఎస్.రాధాకృష్ణ
దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం అజ్ఞాతవాసి బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఏపీలో బుధవారం అర్థరాత్రి నుంచే బొమ్మ పడగా, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉదయం 10 గంటల నుంచి సినిమాను ప్రదర్శిస్తున్నారు. భారీ అంచనాలు మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'అజ్ఞాతవాసి'.
సాధారణంగా పవన్ సినిమా అంటేనే ఓ క్రేజ్ ఉంటుంది. మరి పవన్‌కు త్రివిక్రమ్ తోడైతే ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'జల్సా', 'అత్తారింటికి దారేది' చిత్రాలు పెద్ద విజయాలను నమోదు చేసుకున్నాయి. మరి 'అజ్ఞాతవాసి' వీరికి హ్యాట్రిక్ హిట్ మూవీగా నిలిచిందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
కథ విశ్లేషణ
బొమన్ ఇరానీ (గోవింద్ భార్గవ్ అలియాస్ విందా) ప్రముఖ వ్యాపార వేత్త. ఏబీ సంస్థలకు అధిపతి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విందాని, అతని తనయుడిని వ్యాపార లావాదేవీలు కారణంగా చంపేస్తారు. దాంతో విందా భార్య ఇంద్రాణి (ఖుష్బూ) కంపెనీ వ్యవహారాలు పర్యవేక్షణ కోసం బాలసుబ్రమణ్యం(పవన్ కల్యాణ్)ని మేనేజర్‌గా నియమిస్తారు.
అస్సాం నుండి వచ్చిన బాలసుబ్రమణ్యం మేనేజర్‌గా వ్యవహారాలు చేసుకుంటేనే.. విందా హత్యకు కారకులెవరనే దానిపై ఆరా తీస్తుంటాడు. ఇంతకు విందాను హత్య చేసిందెవరు? అసలు బాలసుబ్రమణ్యమెవరు? అస్సాం నుండి ఏబీ మేనేజర్‌గా రావడానికి కారణాలేంటి? బాలసుబ్రమణ్యం, అభివ్యక్త భార్గవకు ఉన్న రిలేషన్ ఏంటి? సీతారామ్(ఆదిపినిశెట్టి) ఎవరు తనకి, విందాకు ఉన్న లింకేంటి? అనే విషయాలు వెండితెరపై చూడాల్సిందే.
ఈ చిత్రం కథ మొత్తం హీరో ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు తెరకెక్కించాడు. బాలసుబ్రమణ్యం, అభిషక్త భార్గవ అనే రెండు షేడ్స్‌లో పవన్ నటన ఆకట్టుకుంది. సినిమా మొత్తాన్ని తన భుజాలపై ముందుకు తీసుకెళ్లాడు. తనదైన మార్కు డైలాగ్స్, యాక్షన్స్ సీక్వెన్స్, నటనతో పవన్ అభిమానులను మెప్పించడం ఖాయం.
ఇక సినిమాలో చెప్పుకోవాల్సిన మరో పాత్ర ఖుష్బూ.. ఇంద్రాణి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. స్టాలిన్ తర్వాత మరోసారి తెలుగులో మంచి పాత్రలో కనపడింది ఖుష్బూ. క్లైమాక్స్‌లో ఖుష్బూ నటన మెప్పిస్తుంది. ఇక సినిమాలో భాగమైన కీర్తిసురేష్, అను ఇమాన్యుయేల్ పాత్రలు గ్లామర్‌కే పరిమితమయ్యాయి.
సరైనోడు చిత్రంలో అల్లు అర్జున్‌తో పోటీపడి నటించిన ఆది పినిశెట్టి ఈ చిత్రంలోనూ తన మార్క్ విలనిజాన్ని చూపాడు. మురళీశర్మ, రావు రమేష్ పాత్రలు కామెడీకి పరిమితం. మిగిలిన పాత్రధారులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతికంగా చూస్తే.. బేసిక్‌గా రచయిత అయిన త్రివిక్రమ్ తనదైన డైలాగ్స్‌తో తన మార్కును చూపించారు.అయితే కథ, కథనంపై కేర్ తీసుకుని ఉంటే బావుండేది.
ఇక ఈ సినిమా ద్వారా తెలుగులోకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్ తనదైన స్టైల్లో మంచి సంగీతాన్ని అందించాడు. మూడు పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం బావుంది. ముఖ్యంగా పవన్ పాడిన "కొడకా కోటేశ్వరరావా" పాట ఆకట్టుకుంటుంది. మణికంఠన్ ప్రతి సన్నివేశాన్ని చక్కగా చిత్రీకరించాడు. పవన్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొనివున్నాయి.