కళ్యాణ్ రామ్ "ఎంత మంచివాడవురా" ఎలా ఉందంటే.. (మూవీ రివ్యూ)

Entha Manchivaadavuraa
ఠాగూర్| Last Updated: బుధవారం, 15 జనవరి 2020 (16:32 IST)
చిత్రం .. ఎంత మంచివాడవురా.
నిర్మాణ సంస్థలు .. శ్రీదేవి మూవీస్, ఆదిత్యా మూజిక్
నటీనటులు : కళ్యాణ్ రామ్, మహ్రీన్, సుహాసిని, శరత్ బాబు, తనికెళ్ళ భరణి, రాజీవ్ కనకాల, వెన్నెల కిశోర్ తదితరులు
సంగీతం: గోపీ సుంద‌ర్‌
సమర్పణ :శివలెంక కృష్ణ ప్రసాద్
నిర్మాతలు ‌: ఉమేష్‌ గుప్త‌, సుభాష్ గుప్త‌
రచన, దర్శకత్వం : సతీశ్ వేగేశ్న

గతకొంతకాలంగా వైవిధ్యభరితమైన చిత్రాలు (యాక్షన్) చేస్తూ వచ్చిన నందమూరి కళ్యాణ్ ఈ దఫా పక్కా కుటుంబ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన నటించిన తాజా చిత్రం "ఎంత మంచివాడవురా". సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఇందులో మెహ్రీన్ హీరోయిన్. ఈ చిత్రం గుజరాతీ సినిమాకు ఇది రీమేక్‌.

జాతీయ అవార్డు ద‌క్కించుకున్న "శ‌త‌మానం భ‌వ‌తి" చిత్రాన్ని తెర‌కెక్కించిన దర్శ‌కుడు కావడంతో ఈ చిత్రంపై భారీ ఆశలు నెలకొన్నాయి. అలాగే, ఇప్పటివరకు యాక్షన్ చిత్రాలే సినిమాలే చేసిన క‌ల్యాణ్‌రామ్‌ని ఎంత కొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశారు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే ఈ చిత్ర కథను విశ్లేషించాల్సిందే.

చిత్ర కథ :
బాలు(నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌)కి బంధువులు, బంధుత్వాలు అంటే అమితమైన ఇష్టం. అయితే, అనుకోకుండా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో బాలు తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోతారు. దీంతో బాలు దిక్కులేనివాడిగా మిగిలిపోతాడు. పైగా, బంధులంద‌రూ అత‌న్ని ఒంట‌రివాడిని చేయడంతో అతను అనాథగా మారుతాడు.

ఆస‌మ‌యంలో బాలు తండ్రి మిత్రుడు (న‌రేశ్‌) అత‌న్ని చేరదీసి, ఆదరిస్తాడు. పైగా, ఓ హాస్ట‌ల్‌లో చేర్చి ఏదైనా స‌హాయం కావాలంటే అడ‌గ‌మ‌ని చెబుతాడు. అదేసమయంలో చిన్నప్పటి నుంచి బాలు మ‌న‌స్త‌త్వాన్ని ఇష్టపడిన నందు(మెహ్రీన్‌) ప్రేమిస్తుంది. పెళ్లి చేసుకోవాల‌ని అనుకోవాల‌నుకుంటుంది. బాలుని హీరో అని పిలుస్తూ అత‌నితో షార్ట్ ఫిలింస్ చేస్తూఉంటుంది.

అయితే బాలు ఒక్కొక్క‌సారి ఆకస్మికంగా కనిపించకుండా పోతాడు. అత‌ని ప్ర‌వ‌ర్త‌న అనుమానంగా ఉండ‌టంతో నందు త‌న స్నేహితుల స‌హాయంతో ఆరా తీయిస్తే.. బాలు త‌న‌కు బంధువులేకానీ వ్య‌క్తుల‌తో బంధుత్వాలు క‌లుపుకుంటూ ఉంటాడ‌ని తెలుసుకుంటుంది. అదేవిష‌యాన్ని అడిగితే బాలు అస‌లు విష‌యం చెబుతాడు.

అస‌లు బాలు ఏం చెబుతాడు? బాలు వేర్వేరు పేర్ల‌తో బంధుత్వాలు ఎందుకు క‌లుపుకుంటూ ఉంటాడు? వీటి వ‌ల్ల బాలు ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటాడు? చివ‌ర‌కు బాలు జీవితం ఎలాంటి మ‌లుపు తీసుకుంటుంది? అన్నదే మిగిలిన కథ.

చిత్ర విశ్లేషణ :
బంధువులు, బంధుత్వాలు మ‌న‌లోని బాధ‌ను, ఒంట‌రిత‌నాన్ని దూరం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఒక్క పాయింట్‌ను ఆధారంగా చేసుకుని సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈయన గతంలో 'శ‌త‌మానం భ‌వ‌తి' చిత్రాన్ని తెరకెక్కించగా అది జాతీయ స్థాయిలో పలు అవార్డులను దక్కించుకుంది.

ఈ చిత్రంలో త‌ల్లిదండ్రుల‌ను కొడుకులు విడిచిపెట్టి విదేశాల్లోనే ఉంటే వారుప‌డే మాన‌సిక బాధ‌ను చూపించాడు. త‌ర్వాత 'శ్రీనివాస‌ క‌ల్యాణం' చిత్రంలో పెళ్లి గొప్ప‌త‌నాన్ని చెప్పిన స‌తీశ్‌.. ఈసారి ఒంటిరిగా ఉండేవాళ్లు, వాళ్ల మ‌న‌సులోని బాధ‌ను దూరం చేసుకోవ‌డానికి బంధాలు కావాల‌నుకున్న‌ప్పుడు అలాంటి బంధాల‌ను క‌ల్పిస్తే ఎలా ఉంటుంది.

మ‌న చుట్టూ ఉన్న‌వారిని న‌వ్వుతూ ప‌ల‌క‌రించాలి.. బంధుత్వం అనేది ర‌క్త సంబంధాన్ని బ‌ట్టేకాకుండా మ‌న‌సుని బ‌ట్టి కూడా ఏర్ప‌డుతుంద‌ని చెప్పే చిత్రంగా దీన్ని మ‌లిచాడు. అయితే దర్శ‌కుడు ఎక్క‌డా ఎక్కువ ఎమోష‌న‌ల్ యాంగిల్‌లో సినిమాను న‌డింపించ‌లేదు. అహ్లాదంగా న‌డిపించే ప్ర‌య‌త్నం చేశాడు. తన పాత్ర‌కు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. ఇక అత‌న్ని ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకోవాల‌నే వ్య‌క్తిగా మెహ్రీన్ చ‌క్క‌గా న‌టించింది.

ఇక న‌రేశ్‌, శ‌ర‌త్‌బాబు, ప‌విత్ర‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, రాజీవ్ క‌న‌కాల‌, విజ‌య్ కుమార్ త‌దిత‌రులు వారివారి పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. అలాగే, ఈ చిత్రంలోని పాటలు మాత్రం పెద్దగా ఆకట్టుకునేలా లేవు. చిత్ర నేప‌థ్య సంగీతం ఓకే. రాజ్‌తోట సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. ప్ర‌తి స‌న్నివేశం రిచ్‌గా, నేచుర‌ల్‌గా ఉండేలా తీశాడు.

ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్ బావున్నా.. దాన్ని స్లో నెరేష‌న్‌లో తెర‌కెక్కించ‌డంతో సినిమా చూసే ప్రేక్ష‌కుడికి సినిమా భారంగా సాగుతుందనే ఫీలింగ్ కనిపిస్తుంది. మొత్తంమీద ఈ చిత్రం ఇప్పటికే సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలతో పోటీపడలేదని చెప్పొచ్చు.దీనిపై మరింత చదవండి :