"సరిలేరు నీకెవ్వరు" మూవీ రివ్యూ
చిత్రం : సరిలేరు నీకెవ్వరు.
సమర్పణ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్‌రాజు
బ్యానర్స్: జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్
నటీనటులు : మహేశ్ బాబు, రష్మిక మందన్నా, విజయశాంతి, ప్రకాశ్‌రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, సత్యదేవ్, పోసాని తదితరులు.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం: అనిల్ రావిపూడి
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి "సరిలేరు నీకెవ్వరు" చిత్రంతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. గత యేడాతి 'ఎఫ్-2' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గత యేడాది "ఎఫ్-2" ఎంత సందడి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇపుడు మహేష్ బాబును హీరోగా పెట్టి, కామెడీ, సెంటిమెంట్, కథాంశాలను బలంగా చేసుకుని ఆర్మీ బ్యాక్ డ్రాప్‌లో "సరిలేరు నీకెవ్వరు" చిత్రాన్ని నిర్మించారు. అలాగే, ఈ చిత్రం ద్వారా 13 యేళ్ల తర్వాత లేడీ అమితాబ్‌గా గుర్తింపు పొందిన సీనియర్ నటి విజయశాంతి మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది.
ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు తెలుగులో సరిగ్గా ఆడవు అనే సెంమెంట్ ఉన్నప్పటికీ మహేశ్ ఓకే చేసిన సబ్జెక్ట్ ఇది. మరి మహేశ్ సెంటిమెంట్‌ను దాటి సక్సెస్‌ను సాధించాడా? సరిలేరు నీకెవ్వరుతో ఎలాంటి మెసేజ్ ఇచ్చారు? కమర్షియల్ సినిమాల డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి సూపర్‌స్టార్ మహేశ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కథను రాసుకున్నాడా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం.
చిత్ర కథ :
ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ (మహేశ్) సరిహద్దుల్లో తీవ్రవాదులతో పోరాడుతూ దేశాన్ని కాపాడుతుంటాడు. అదే రెజిమెంట్‌లోకి అదే పేరుతో మరో వ్యక్తి(సత్యదేవ్) జాయిన్ అవుతాడు. ఓ టెర్రరిస్ట్ ఎటాక్‌లో అజయ్(సత్యదేవ్) బాగా గాయపడతాడు. అతను త్వరలోనే చనిపోతాడు కాబట్టి ఆ విషయాన్ని అతని కుటుంబానికి చెప్పడానికి ఆర్మీ నిర్ణయించుకుంటుంది.
అజయ్ తల్లి భారతి(విజయశాంతి) ఓ వైద్య కాలేజీకి ప్రిన్సిపాల్. చిన్న తప్పును కూడా భరించని వ్యక్తి. తన పెద్దకొడుకు ఆర్మీలో చనిపోయినప్పటికీ చిన్నకొడుకును కూడా ఆర్మీకి పంపుతుంది. సంప్రదాయం ప్రకారం భారతి చెల్లెలి పెళ్లి చేయడానికి అతని స్థానంలో మేజర్ అజయ్ కృష్ణ, ప్రసాద్(రాజేంద్ర ప్రసాద్)తో కలిసి కర్నూలు బయలుదేరుతాడు. రైలులో సంస్కృతి(రష్మిక) కుటుంబంతో కలిసి ప్రయాణిస్తుంటుంది. సంస్కృతికి వాళ్ల నాన్న(రావు రమేశ్) ఇష్టం లేని పెళ్లి చేయాలనుకుంటాడు.
అదేసమయంలో ఆమె మేజర్ అజయ్‌ని చూసి ప్రేమిస్తుంది. అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడి, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది. వారి నుండి తప్పించుకుని అజయ్ కర్నూలు చేరుకుంటాడు. అక్కడ భారతి, వాళ్ల కుటుంబం కనపడదు. ఆమెను మంత్రి నాగేంద్ర(ప్రకాశ్ రాజ్) చంపడానికి ప్రయత్నిస్తుంటారు. వారి బారి నుంచి భారతిని ఆమె కుటుంబాన్ని మేజర్ అజయ్ కృష్ణ కాపాడుతాడు. అసలు నాగేంద్రతో భారతికి ఉన్న సమస్యేంటి? ఆమెను నాగేంద్ర ఎందుకు చంపాలనుకుంటాడు? మేజర్ అజయ్ కృష్ణ.. భారతి సమస్యను ఎలా పరిష్కరిస్తాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
చిత్ర విశ్లేషణ :
కొన ఊపిరితో పోరాడుతున్న ఓ సైనికుడి పరిస్థితిని.. అతని కుటుంబసభ్యులకు సున్నితంగా చెప్పడానికి ఊరికి బయలుదేరిన హీరో, అక్కడ పరిస్థితులను ఎలా చక్కదిద్దాడనేది ఈ చిత్ర కథ. మహేష్ ఒన్ మ్యాన్ షోగా సినిమాను ముందుకు నడిపించాడు. 13 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై విజయశాంతి కనిపించినా, తన యాక్టింగ్‌లోనూ, డైలాగు డెలివరీలోనూ ఆమె గ్రేస్ ఎక్కడా తగ్గలేదు.
లొకేషన్లు, సెట్స్ అన్నీ బావున్నాయి. రష్మిక ఫ్యామిలీ సీన్లు కాస్త డ్రమటిక్‌గా కనిపించాయి. బండ్ల గణేష్ సీన్ కనిపించనంత సేపు కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది. సంగీత, రావు రమేష్ పాత్రలన్నీ బావున్నాయి. పాటలు కూడా స్క్రీన్ మీద కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. మహేష్ గత చిత్రాలతో పోలిస్తే డ్యాన్స్ సూపర్బ్‌గా ఉంది.
యాక్షన్ సీక్వెన్స్‌ల విషయానికి వస్తే టెర్రరిస్ట్ ఎటాక్ నుంచి పిల్లలను కాపాడే ఫైట్‌తో పాటు, నల్లమల అడవుల్లో ఫైట్‌ను చాలా చక్కగా డిజైన్ చేశారు. మిగిలిన ఫైట్స్‌ను కమర్షియల్ ఫార్మేట్‌లో బాగా డిజైన్ చేశారు. దేవిశ్రీ సంగీతంలో సరిలేరు టైటిల్ ట్రాక్, మైండ్ బ్లాక్ సాంగ్స్ బావున్నాయి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. రత్నవేలు సినిమాటోగ్రఫీకి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సూపర్బ్‌గా ఉంది. మీరు దేశం విలువ రూపాయల్లో చూస్తే.. నేను ఎగిరే జెండాలో చూస్తాను.. ఇలా పలు డైలాగ్స్ సందర్భానుసారంగా ఉన్నాయి.
పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాను అందంగా మలిచాడు. ఇక కొన్ని సన్నివేశాల్లో లాజిక్కులు కనపడవు. మినిస్టర్‌ను ఓ సైనికుడు భయపెట్టేయడం.. కొడుకు చనిపోయిన సంగతి ఎలా చెప్పాలా? అని అందరూ ఆలోచిస్తుంటే.. తనకు తెలిసిపోయినట్లు ఆమె మాట్లాడటం ఇవన్నీ లాజిక్కులకు అందవు.
ఏదైనా ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ప్రేక్షకులు సినిమాను నవ్వుకుంటూ.. అభిమానులు హీరో ఇమేజ్‌ను ఎంజాయ్ చేసేలా సినిమాను తెరకెక్కించారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ విషయం చిత్ర నిర్మాణ విలువలను బట్టి ఇట్టే తెలుసుకోవచ్చు. మొత్తంమీద మహేష్ ఖాతాలో మరో హిట్ పడింది.