నటీనటులు: నాగ చైతన్య, సాయి పల్లవి, ఈశ్వరి రావు, రాజీవ్ కనకాల, ఉత్తేజ్, దేవయాని తదితరులు
సాంకేతికతః సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, సంగీత దర్శకుడు: పవన్ సి.హెచ్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాతలు: నారాయణ్ దాస్ కె నారంగ్,పుస్కర్ రామ్ మోహన్ రావు, దర్శకుడు: శేఖర్ కమ్ముల
దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రాలంటే ఏదో సినిమా ద్వారా చెప్పబోతాడు అన్నది తెలిసిందే. ఫిదా తర్వాత మరలా సాయిపల్లవి నాయికగా చేయడం, సారంగదరియా.. పాట మిలియన్ల వ్యూస్ సంపాదించుకోవడంతో సినిమాపై క్రేజ్ ఏర్పడింది. అందుకు నాగచైతన్య కూడా తోడయ్యాడు. కోవిడ్ వల్ల పలుసార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు థియేటర్లలో ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ :
చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన రేవంత్ (నాగచైతన్య) తల్లి ఈశ్వరి రావు పెంపకంలో పెరుగుతాడు. అర్థ ఎకరం పొలాన్ని తల్లి కాపాడుకుంటూ వస్తుంది. పెద్దయ్యాక రేవంత్ హైదరాబాద్ వచ్చి స్వశక్తితో ఎదగాలని జుంబా సెంటర్ (హెల్త్ క్లబ్ సెంటర్) పెడతాడు. నత్తనడకగా సాగుతున్న అతని జుంబా సెంటర్ మౌనిక (సాయిపల్లవి) రాకతో ఒక్కసారిగా జోష్ వస్తుంది. ఇక జుంబా సెంటర్ ఎదగడంతోపాటు వీరిమధ్య ప్రేమకూడా బలపడుతుంది. ఇద్దరిదీ ఒకేఊరు కావడం. మౌనిక బాబాయ్ రాజీవ్ కనకాల ఊరి పెద్ద కావడంతోపాటు కులవివక్ష కూడా వీరి ప్రేమకు అడ్డంకి ఏర్పడుతుంది. ఆ సమయంలో రేవంత్ మామయ్య ఎస్.ఐ. ఉత్తేజ్ సలహాతో ఒకటవ్వాలనుకుంటారు. కానీ చివరినిముషంలో బెడిసికొడుతుంది. ఆ తర్వాత రేవంత్ ఏం చేశాడు? మౌనికకు తన బాబాయ్ అంటే ఎందుకు భయం? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణః
మొదటినుంచి ఈ సినిమా కులాల పట్టింపుల కథ అనేది దర్శకుడు చెబుతూనే వున్నాడు. కానీ తాను తీసిన విధానం చాలా కొత్తగా వుంటుందని కూడా వెల్లడించారు. కానీ దానికంటే ఓ సామాజిక అంశం కూడా ముడిపడి వుందని మాత్రం చెప్పాడు. అదేమిటనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అన్నాడు. అది ఒళ్ళు గగుర్పాటు కల్గించే ఆ అంశం. కథలో ఈ ముడి విప్పడానికి చివరివరకు కథను నడపాల్సివచ్చింది.
మొదటి భాగం చూశాక ఇది రొటీన్ కథే. ఇంతకంటే ఏం చెప్పగలడు అనిపిస్తుంది. అలా అనీ ఏమాత్రం విసుగుపుట్టించకుండా ప్రతి సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు దర్శకుడు. ఇందులో మూడు విషయాలు మాత్రం చెప్పగలిగాడు.
1) రేవంత్ కు చిన్నతనంలోనే, `మనది ఇచ్చే చేయి కావాలికానీ. కింద తీసుకునే చేయి కాకూడదు. అందుకు కష్టపడాలి` అని తల్లి చెప్పిన బోధనే మనసులో నాటుకుపోతుంది.
2) మౌనికది అగ్ర కులం. ఊరి పెత్తందారు కూతురు. తండ్రి పెద్దగా పట్టించుకోడు. అన్నీ బాబాయ్ చూసుకుంటాడు. పేరు బాబాయ్ అయినా ఉన్న 20 ఎకరాలు తక్కువలో కొట్టేసి మౌనిక కుటుంబంపై పెత్తనం. దానికితోడు మౌనిక నానమ్మ బాబాయ్‌కు సపోర్ట్. ఆడపిల్ల అంటే అణిగిమణిగి వుండాలనే నైజం.
3) జుంబా సెంటర్లోనే పనిచేసే ఓ కుర్రాడు అక్కడ డాన్స్ క్లాస్‌కు వచ్చే పెద్దింటి అమ్మాయిని ప్రేమించడం, దానివల్ల జీవితాన్ని కోల్పోవడం.
ఈ మూడు అంశాలే సినిమాకు కీలకం. బ్లాక్ అండ్ వైట్ నుంచి వస్తున్న కుల వివక్షకథలు చాలానే వున్నాయి. కాలంమారినా ఇంకా ఇలాంటివి వుంటాయా! అని ఇప్పటి తరానికి ఆశ్చర్యం కలిగించినా వాస్తవంగా సమాజంలో ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలనే దర్శఖుడు చేసిన ప్రయత్నం. ఇంతకుముందు రంగస్థలం కానీ, `ఉప్పెన`కానీ మరేదైనా కానీ అన్నింటిలో వున్నది అదే అంశం. నేపథ్యాలే వేరు.శేఖర్‌కమ్ముల తీసుకున్న నేపథ్యం భిన్నంగా వుంది. దాన్ని ముగింపులో అసలు ముడివిప్పి ఆశ్చర్యం కలిగించాడు.
ఒక్కమాటలో చెప్పాలంటే ఆడపిల్లను ఇంటిదగ్గర ఎన్నో జాగ్రత్తలతోపాటు భయాలు కూడా నూరిపోస్తారు. దాంతో ఆమె మనసులో ఏముందో తెలుసుకోవడానికి కూడా తల్లిదండ్రులు ఇష్టపడరు. అలా చేస్తేనే కదా అసలు మీ అమ్మాయి ఏంచేస్తుందో ఏం చెప్పదలచుకుందో తెలిసేందని ముగింపులో హీరో చేత చెప్పిస్తాడు. ఇదే దర్శకుడు సమాజానికి చెప్పదలిచింది. మగవాడికి కూడా ఎందుకు ఇలా రూల్స్ పెట్టరు. వారికి అలా పెట్టి పెంచితేనే గదా సమాజం నందనవనంలా వుండేది. కుటుంబాల మధ్య మంచి వాతావరణ నెలకొనేది. తల్లిదండ్రులు అనేవారు కుమార్తె గురించి సమయం కేటాయించాలి. వారి బాగోగులు అడిగి తెలుసుకోవాలి. అది లేనినాడు కూతురు లోలోపల ఎంతో బాధను దిగమింగుకుని జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుంది. అలాంటి అమ్మాయికు కాస్త దైర్యం నూరిపోసే తోడు దొరికితే చాలు ఎంతకైనా తెగిస్తుంది. అలా ధైర్యాన్ని నింపి తనదానిలా చేసుకున్న రేవంత్ కథే ఈ లవ్‌స్టోరీ. ప్రేమంటే ఇద్దరి మధ్య ప్రేమకాదు. కుటుంబంలోనూ ఇలానే వుండాలి.
ఎమోషన్స్ పండించాడు
ఇక కథప్రకారం ప్రేమికుల మధ్య ఎమోషన్స్, కుటుంబ బంధాలు అన్నీ ఇందులో దర్శకుడు చూపించాడు. సంభాషణల పరంగా అన్నీ బాగున్నాయి. హీరో హీరోయిన్లు ఇద్దరూ ఈ పాత్రలకు సరిపోయారు. సాయి పల్లవి నటన, డ్యాన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణం. రాజీవ్ కనకాల పాత్ర సమాజంలో మేకవన్నెపులిలాంటిది. చాలా కుటుంబాల్లో కనిపించేదే. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
టెక్నికల్‌గా
సంగీతపరంగా పవన్ పనితనం ఆకట్టుకునేలా వుంది. వున్న రెండు పాటలకు బాణీలు, నేపథ్య సంగీతం బాగా కుదిరాయి. విజయ్‌కుమార్ కెమెరా పనితనం, నిర్మాణపు విలువలు బాగున్నాయి. సహజంగా దర్శకుడు తన ఇంటి పరిసర ప్రాంతాల్లోనే కొత్తకోణంలో చూపిస్తుంటాడు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ పర్వాలేదు. ముగింపును రెండు కోణాల్లో తీశారనే టాక్ వుంది. అందుకే సినిమాటిక్‌గా ముగించినట్లు కనిపిస్తుంది. తనకొడుకు మంచివాడు కాకపోయినా సమర్థించుకునే తల్లులున్నంత కాలం ఈ సమాజం మారదు. అందుకే తన సినిమా ద్వారా ఏ ఒక్కరు మారినా చాలు అన్న శేఖర్ కమ్ముల. సమాజం అంతా మారాలంటే సునామిలాంటిది రావాల్సిందే అని విడుదలకు ముందు వెల్లడించారు.
ఇక ఇలాంటి కథకు తప్పొప్పులు వెతికేకంటే ఫీల్ గుడ్ మూవీగా ప్రయత్నించాడని అభినందించాల్సిందే. అక్కడక్కడా స్లోగా వుంది. ఇంకాస్త బాగా తీస్తే బాగుండేది అనేకంటే, తీసినంత వరకు ఎటువంటి వల్గారిటీలేకుండా అటు పెద్దలని, ఇటు సమాజాన్ని ఆలోచించేలా ఈ సినిమా వుంది. ఇలాంటి సినిమాను యువత తప్పనిసరిగా చూడాలి. పెద్దలు కూడా చూసి మారాలి.
రేటింగ్ః 3/5