బ్యానర్: సుధీర్‌బాబు ప్రొడక్షన్స్
నటీనటులు: సుధీర్‌బాబు, నభా నటేశ్, నాజర్, తులసి, సుదర్శన్, పృథ్వీ, జీవా, వైవా హర్ష తదితరులు
సంగీతం: అజనీశ్ లోక్‌నాథ్
నిర్మాత : సుధీర్‌బాబు
దర్శకత్వం : ఆర్.ఎస్.నాయుడు
నిన్నమొన్నటివరకు పలు చిత్రాల్లో హీరోగా నటించిన సుధీర్ బాబు.. ఇపుడు ఉన్నట్టుండి నిర్మాతగా మారిపోయాడు. అలా తనే నిర్మాతగా, తనే హీరోగా నటించిన తొలి చిత్రం "నన్నుదోచుకుందువటే". టైటిల్ వింటేనే ఇదొక లవ్‌స్టోరి అని ఎవరికైనా అర్థమైపోతుంది. కాబట్టి కథ గురించి, సినిమా ఎలావుంటుందో అని ప్రత్యేకంగా ప్రేక్షకుడు ఆలోచించుకునే పని ఉండదు. అయితే, 'సమ్మోహనం' వంటి సక్సెస్ తర్వాత ఆర్.ఎస్.నాయుడు అనే కొత్త దర్శకుడుతో కలిసి సుధీర్ బాబు చేసిన ప్రయత్నం ఎలా ఉందో ఓసారి పరిశీలిద్ధాం.
కథ:
ఓ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా కార్తీక్ (సుధీర్) పని చేస్తుంటాడు. అమెరికా వెళ్లాలన్నదే ఇతని లక్ష్యం. ఆ లక్ష్యంతో చిన్నప్పుడే తల్లి చనిపోయినా.. తండ్రి(నాజర్)కి దూరంగా హాస్టల్స్‌లో పెరుగుతాడు. రోజులో 18 గంటలకుపైగా ఆఫీస్ పనిలోనే నిమగ్నమైపోతాడు. ఇదిలావుంటే, కార్తీక్ పెళ్లిని అతని మేనకోడలితో చేయాలని తండ్రి భావిస్తాడు. అయితే తన మేనకోడలు మరొకరిని ప్రేమిస్తుందని కార్తీక్ తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని బయటకు చెప్పలేక... తనకు సిరి అనే గర్ల్‌ఫ్రెండ్ ఉందని అబద్ధం చెబుతాడు. అయితే, అది నిజమా? కాదా? అని తెలుసుకోవడానికి తండ్రి హైదరాబాద్‌కు వస్తాడు.
దీంతో తండ్రికోసం షార్ట్ ఫిలింస్‌లో నటించే మేఘన(నభా నటేశ్)ను సిరిగా పరిచయం చేస్తాడు. సిరి ప్రవర్తన, కలుపుగోలుతనం కార్తీక్ తండ్రికి నచ్చుతుంది. ఈ ప్రయాణంలో కార్తీక్, మేఘనలు ఒకరిపై ఒకరు మనసుపడతారు. వారి ప్రేమను వ్యక్తం చేసుకోవాలనుకునే సమయంలో అనుకోని మలుపులు తీసుకుంటుంది కథ. ఆ మలుపులేంటి? చివరకు కార్తీక్, మేఘన ఒక్కటయ్యారా? కార్తీక్ అమెరికా వెళ్లాలనే లక్ష్యం నేరవేరిందా? అనేదే మిగిలిన స్టోరీ.
కథా విశ్లేషణ:
ఈ చిత్రానికి ముందు సుధీర్ బాబు నటించిన చిత్రం 'సమ్మోహనం'. మంచి విజయాన్ని అందుకుంది. ఈ తాజా చిత్రంలో తన లక్ష్యం కోసం అహర్నిశలు పాటుపడే కుర్రోడిగా నటిస్తాడు. ముఖ్యంగా, తండ్రి ముందు బాధపడే కొడుకుగా నటించే సన్నివేశాల్లో బాగా నటించాడు. అల్లరిపిల్లగా, నేటి తరానికి ప్రతినిధిలా నభా నటేశ్ చక్కగా నటించింది. నభా తెలుగమ్మాయి కాదంటే ఎవరూ నమ్మరేమో.
సింగిల్ మదర్‌గా, కూతురి ఇష్టాయిష్టాలను అర్థం చేసుకునే తల్లిగా తులసి చక్కగా తన పాత్రలో ఒదిగిపోయారు. మిగిలిన పాత్రలు కూడా వాటి పరిధి మేరకు బాగానే చేశారు. నిర్మాత పెట్టిన ఖర్చు కూడా తెరపై కనిపించింది. ఇన్నేళ్లుగా ఎన్ని సినిమాల్లో నటించినా రానంత లాభం ఈ సినిమాతో వచ్చిందని ఆ మధ్య సుధీర్ బాహాటంగానే చెప్పారు. అజనీష్ సంగీతం ఇంకాస్త వినసొంపుగా ఉంటే బావుండేది.
ఎడిటింగ్ విషయంలోనూ కాసింత కత్తికి పదును పెట్టాల్సింది. డైలాగులు ఎఫెక్టివ్‌గా రాసుకుని ఉంటే బావుండేది. నిజానికి మంచి డైలాగులకు స్కోప్ ఉన్న సినిమా ఇది. చూసినంత సేపూ సరదాగా సాగుతుంది. మాస్ పల్స్‌ని అందుకునే సన్నివేశాలు మాత్రం తక్కువగానే ఉన్నప్పటికీ బీ, సీ సెంటర్లలో ఎలా ఆడుతుందో చూడాల్సిందే. కానీ, మల్టీప్లెక్స్‌లకు వచ్చే ప్రేక్షకుల మనసులను మాత్రం దోచుకున్నట్టే.
ఇకపోతే, ఈ చిత్రం ప్లస్ పాయింట్స్‌ను పరిశీలిస్తే, నటీనటుల పనితీరు, కెమెరా పనితనం, ఫస్టాఫ్‌లో వైవా హర్ష, సుధీర్ కామెడీ ట్రాక్ చిత్రానికి బలంగా ఉన్నాయి.
మైనస్ పాయింట్స్... కథలో కొత్తదనం లేకపోవడం, అన్ని వర్గాలను మెప్పించే కంటెంట్ కాదు, ట్యూన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ సోసోగానే ఉండటం మైనస్‌లుగా చెప్పుకోవచ్చు.