నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, జగపతిబాబు, మురళీశర్మ, ప్రియదర్శి తదితరులు..
సాంకేతికత- సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, సంగీత దర్శకుడు: జస్టిన్ ప్రభాకరన్, నేపథ్య సంగీతం- థమన్, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత: వంశీ, ప్రమోద్, ప్రసీధ, దర్శకత్వం : కె రాధాకృష్ణ కుమార్.
ప్రభాస్ హీరోగా నాలుగేళ్ళ తర్వాత వెండితెరపై కనిపిస్తున్న సినిమా రాధేశ్యామ్. భారీ బడ్జెట్‌తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తీసినట్లు ట్రైలర్, టీజర్‌లో తెలిసిపోయింది. చేయిచూసి జాతకాలు చెప్పే పాత్రను పోషించిన ప్రభాస్ జాతకం ఎలా వుందో తెలియాలంటే ఈరోజే విడుదలైన సినిమా సమీక్షలోకి వెళదాం.
కథ :
విక్రమాదిత్య ఉరఫ్ ఆదిత్య (ప్రభాస్) ఫేమస్ పామిస్ట్. చేయిచూసి జాతకం చెప్పే విద్యను తన గురువు పరమహంస (కృష్ణంరాజు) నుంచి నేర్చుకుంటాడు. ఆ తర్వాత తన గమ్యం ఏమిటో అర్థం చేసుకుని దేశాలన్నీ తిరుగుతూ తన తల్లి భాగ్యశ్రీ వుండే లండన్ వస్తాడు. అక్కడ ఫేమస్ డాక్టర్ కుమార్తె ప్రేరణ (పూజా హెగ్డే)ను చూసి ప్రేమలో పడతాడు.
ప్రేరణ కూడా డాక్టరే. ఆమెకూ లవ్ అంటే పడదు. ఆదిత్యకు లవ్ అనేది తన జాతకంలోనే లేదంటాడు. అలాంటి వీరిద్దరినీ విధి కలుపుతుంది. మరలా అదే విధి రాతను బట్టి ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఓ దశలో ఇద్దరూ చావుబతుకుల్లో వున్నట్లు గ్రహించి ఏం చేశారు? అన్నది మిగిలిన కథ. ఈమధ్యలో జరిగిన కొన్ని సంఘటనలు, పాత్రలు, లవ్ ట్రాక్ అనేవి కథను సాగేందుకు దోహదపడ్డాయి. అవి ఎలాగో చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణః
జాతకాలు చాలా రకాలున్నాయి. కేవలం చేయి చూసి భూతకాలం, భవిష్యత్ కాలం చెప్పే వాడు ఆదిత్య. అయితే జాతకాల గురించి అవపోసన పట్టిన ఆయన గురువురు పరమహంస కూడా జాతకం అనేది సైన్స్. 90 శాతం జరుగుతాయి. ఒక్క శాతం జరగదు. ఆ ఒ క్కశాతంలో ఎంతోమంది విధిరాతను తిరగరాసి ఏవిధంగా సక్సెస్ అయ్యారనేది కూడా చరిత్ర చెబుతోందంటాడు. ఈ కోణంలో దర్శకుడు ముగింపు ఇస్తాడు. అది కూడా సినిమాటిక్‌గా వుంటుంది. విధి రాతను బట్టి హీరో హీరోయిన్లు చనిపోవాలి. కానీ ఎలా బతకారనేది ఒక్కశాతం కేటగిరి కథ.
అభినయంః
హీరోహీరోయిన్ల పాత్రలపరంగా బాగా నటించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది బాగా పండింది. ఒకరు లేనిదో ఒకరు వుండలేమన్నట్లుగా కుదిరారు. పరమహంసగా కృష్ణంరాజు స్థాయికి తగ్గ పాత్ర. భాగ్యశ్రీ చాలా కాలం తర్వాత అందమైన అమ్మగా కనిపిస్తుంది. మిగిలిన పాత్రలు బాగానే చేశారు.
టెక్నికల్‌గా చూస్తే,
సినిమాటోగ్రఫీ కనులవిందుగా వుంంది. మనోజ్ పరమహంస రిచ్‌లుక్ తీసుకువచ్చాడు. ప్రతి సన్నివేశం క్లాస్‌గా లావిష్‌గా కనిపిస్తుంది. ఆ తర్వాత ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితనం హైలైట్. సన్నివేశపరంగా నేపథ్య సంగీతం- థమన్ చక్కగా ఇచ్చాడు. పాటలు రెండే వున్నా వాటిని తగిన బాణీలు సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ సమకూర్చాడు. సంబాషణలు మితంగా వున్నాయి.
చేతిరాతకాదు చేతలను బట్టే మన జీవితం ఆధారపడి వుంటుందని దర్శకుడు ముగింపు ఇస్తాడు. మధ్యమధ్యలో వచ్చే డైలాగ్‌లు సందర్భానుసారంగా వున్నాయి. ప్రధానంగా హైలైట్‌గా చెప్పాల్సింది ముగింపులో వచ్చే పడమ ప్రయాణం. జోరున వర్షం, పడవ ప్రమాదం, అందులోనుంచి హీరో ఎలా బయటపడ్డాడనేది విజువల్‌గా బాగా చూపాడు. అందుకు టెక్నికల్ టీమ్ కృషి బాగా కనిపించింది.
మైనస్ పాయింట్లు..
- సహజంగా జాతకాలు మగవారికి కుడిచేయి, ఆడవారికి ఎడమచేయి చూస్తారు. మరి దర్శకుడి అందరికీ కుడిచేయి చూసి చెప్పే విధంగా చూపించడం పామరుడికి ప్రశ్నగా వుంటుంది. బహుశా దర్శకుడికి ఈ లాజిక్ తెలియదేమో అనుకోవాలి.
- ప్రభాస్‌తో క్లాస్ లవ్ స్టోరీ తీయడం బాగానే వున్నా, బి,సి, సెంటర్ల వారికి ఆకట్టుకోకపోవచ్చు.
- చాలా చోట్ల లాజిక్క్‌లకు అందని సన్నివేశాలున్నాయి.
- ఇది కేవలం బాలీవుడ్, ఓవర్‌సీన్ వారి కోసమే తీసినట్లుగా వుంది.
ముగింపుః
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ జాతకాలకు కనెక్ట్ అవుతారు. ఒక్కో దేశంలో ఒక్కో ఆచారం ప్రకారం జాతకాలు నడుస్తుంటాయి. జాతకాలను రాజకీయ నాయకులు ప్రధానంగా నమ్ముతారు. వారికోసం ఎలక్షన్ల ముందు కొద్దిమంది వచ్చి వారి జాతకాలు చెబుతుంటారు. ఇది దర్శకుడు రాధాకుమార్ సినిమా పరిశోధనలో గ్రహించాడు. 2018లో సినిమాను ఆరంభించే ముందే ఈ సినిమా 2022 ప్రథమార్థంలోనే విడుదలవుతుందని కేరళలోని పెద్ద జ్యోతిష్యుడు కూడా చెప్పేశాడు.
అప్పట్లో దర్శక నిర్మాతలు ఆశ్చర్యపడ్డప్పటికీ, కరోనా రావడంతో అది 2022లో విడుదలయింది. దీంతో నమ్మక తప్పలేదు. కానీ తొందరపడ్డ దర్శక నిర్మాతలు జనవరి సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ విధిరాత మార్చలేమని వారు గ్రహించినట్లు లేరు. మరలా ఒమిక్రాన్ రావడం, ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్లు, సినిమా టెక్కట్ల పంచాయితీ జరగడంతో తప్పని స్థితిలో మార్చిలో విడుదల చేయాల్సివచ్చింది. అంటే దీన్ని బట్టి జాతకాన్ని నమ్మాలన్నమాట. కానీ దర్శకుడు ముగింపులో చేతిరాత కంటే మన చేతలే జీవితాన్ని నిర్ణయిస్తాయని ముగింపు ఇచ్చాడు. అంటే అంతా గుడ్డిగా నమ్మకండి. కష్టపడి సాధించండనే నీతిని చెప్పినట్లుగా అనిపిస్తుంది.