బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2024 (15:41 IST)

రజనీకాంత్ నటించిన వేట్టయాన్ - ది హంటర్ మూవీ ఫుల్ రివ్యూ

Vettayan - The Hunter
Vettayan - The Hunter
నటీనటులు: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, రావు రమేష్, అభిరామి తదితరులు 
సాంకేతికత : ఛాయాగ్రహణం: ఎస్.ఆర్.కదిర్, సంగీతం: అనిరుధ్ రవిచందర్,  నిర్మాత: సుభాస్కరన్ రచన-టీజీ జ్ఞానవేల్-కృత్తిక దర్శకత్వం: టీజీ జ్ఞానవేల్ 
 
తమిళంలో రూపొందిన వేట్టయాన్ - ది హంటర్ చిత్రం తెలుగులో అదేపేరుతో విడుదలైంది. రానా దగ్గుబాటి, దిల్ రాజు ఈ సినిమాను తెలుగులో విడుదలచేశారు. ఇందులో రానా కూడా కీలక పాత్ర పోషించారు. గత ఏడాది 'జైలర్' మూవీ తర్వాత  రజినీకాంత్ ఆ తరహాలోనే ఈ సినిమాను చేసినట్లు ట్రైలర్ ను చూస్తే తెలిసిపోయింది. అయితే తెలుగులో పెద్దగా ప్రచారం లేకపోయినా రజనీ బ్రాండ్ తోపాటు 'జై భీమ్'తో మంచి గుర్తింపు సంపాదించిన టీజీ జ్ఞానవేల్ రూపొందించిన చిత్రం కావడంతో మంచి క్రేజ్ వచ్చింది. ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
తమిళనాడు  కన్యాకుమారిలో ఓ స్కూల్ లోని రూమ్ ను ఆసరాగా చేసుకుని గంజాయి స్మగ్గింగ్ చేస్తున్న బ్యాచ్ ను టీచర్ శరణ్య వెలుగులోకి తేవడంతో అక్కడ ఎస్పీగా పని చేసే అథియన్ (రజినీకాంత్) తనకున్న ఎన్ కౌంటర్ స్పెషలిస్టు పేరును సార్థకం చేస్తూ ఆా బ్యాచ్ నాయకుడ్ని మట్టుపెడతాడు. ఆ తర్వాత జరిగిన పరిణామలతో శరణ్య దారుణంగా చనిపోతుంది.  దీనికి బాధ్యుడిగా ఆ స్కూల్ లో పనిచేసే కంప్యూటర్ మెకానిక్ గుణ అని పోలీసు దర్యాప్తులో తెలిశాక అథియన్ అతన్ని కాల్చిపారేస్తాడు. దాంతో మానవహక్కుల పరిరక్షణ కమిటీ అమాయకుడ్ని చంపాడని గొడవ చేస్తారు.
 
అనంతరం ఈ ఎన్ కౌంటర్ మీద విచారణ జరిపిన జడ్జి సత్యదేవ్ (అమితాబ్) కొన్ని కీలక విషయాలు బయటపెట్టి పోలీసులు తప్పుచేశారని బ్లేమ్ చేస్తాడు. దాంతో పశ్చాత్తాప పడిన అథిరన్ ఏం చేశాడు? అసలు శరణ్య ను ఎవరు చంపారు? గుణ పాత్ర ఏమిటి? వీరి వెనుక అసలు ఎవరు వున్నారు? అనేది అసలు కథ. 
 
సమీక్ష:
కథను బట్టి ఎంత పెద్ద స్టార్ అయిన ఎలా ఒదిగిపోయేలా చేయాలో దర్శకుడికి బాగా తెలిస్తే చిత్రం వేరే లెవల్లో వుంటుంది. ఈ సినిమా కూడా అలాంటిది. గతంలో స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి సూర్యతో చేయించిన 'జై భీమ్' అలాంటిది. ఈ సినిమాలో కూడా మర్డర్, మానభంగం, పిల్లల చదవులతో కార్పొరేట్ సంస్థలు ఏవిధంగా వారి జీవితాలతో ఆడుకుంటున్నాయని దర్శకుడు చెప్పాడు. గతంలో ధనుష్ చేసిన సార్ సినిమాలో ఈ అంశాలున్నా నేపథ్యాలు వేరుగా వున్నాయి. 
 
ఈ సినిమాలో దర్శకుడు చాలా పెద్ద కుంభకోణం కళ్ళకు కట్టినట్లు చూపాడు. హంగు, ఆర్థిక స్తోమత వుంటే చాలు మంత్రులను, పోలీసు యంత్రాంగాన్ని న్యాయ వ్యవస్థను కూడా తమ చేతిలో పెట్టుకుని మంచి ఎడ్యుకేషన్ పేరుతో ప్రజలను పీడించే వైట్ కాలర్ దోపిడీ ఈ సినిమాలో బాగా చూపించారు. ఒకరకంగా ఇది చాలా పెద్దకథ. మొదటి భాగం ఆకట్టుకునేలా సాగిపోయినా సెకండాప్ లో వచ్చేసరికి చాలా పెద్ద కథ చెప్పిన ఫీలింగ్ కలిగింది. కమర్షియల్ హంగులు జోడించాడు. 
 
చట్టం కంటే మనస్సాక్షిని నమ్మే ఓ పోలీస్ అధికారి ఎన్నో ఎన్ కౌంటర్లు చేసినా అతని మనసును కదిలించని ఎన్ కౌంటర్ గుణ విషయంలో కలుగుతుంది. అసలు ఎన్ కౌంటర్ అంటే చంపేసే హక్కు అని భావించడం తప్పని అమితాబ్ ప్రశ్న. ఇలా వారి సంభాషణలు చాలా ఆసక్తిగా వుంటుంది.  సెకండాఫ్ లో కాస్త జైలర్ పోలికలు కన్పించినట్లుగా దాన్ని డైవర్ట్ చేసే విధంగా దర్శకుడు కేర్ తీసుకన్నాడు. 
  
'వేట్టయాన్' రసవత్తరంగా కథా గమనం నడుస్తుంది. అమితాబ్ బచ్చన్ పాత్ర కథకు మలుపుతిప్పేదిగా వుంటుంది.  ప్రథమార్ధంలో బిగి చూపించాడు. కొన్ని చోట్ల మెరుపులు మెరిపించాడు. కానీ ఓవరాల్ గా మాత్రం ఒక పకడ్బందీ సినిమాను అందించలేకపోయాడు దర్శకుడు. రజనీ, అమితాబ్ పాత్రలకు ధీటుగా ఫాజిల్ పాత్ర వుంటుంది. ఆడుతూపాడుతూ తన పాత్రకు న్యాయం చేశాడు. ఆ పాత్రలోనే వినోదాన్ని చూపాడు దర్శకుడు.  నెగెటివ్ పాత్రలో రానా దగ్గుబాటి ఆకట్టుకున్నాడు. రజినీ ముందు అతను దీటుగా నిలబడ్డాడు. రజినీ భార్య పాత్రలో మంజు వారియర్, మిగిలిన పాత్రలలో రితిక సింగ్, కిషోర్,  అభిరామి సరిపోయారు.
 
టెక్నికల్ గా అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం బాగుంది. రెండే పాటలుంటాయి.  రజినీ ఎలివేషన్ సీన్లలో అనిరుధ్ బాగా చేశాడు. కదిర్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్ గా సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలూ బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ ప్రయత్నం మాత్రం మెచ్చదగిందే. ప్రథమార్ధం ఇన్వెస్టిగేషన్ డ్రామాను నడపడంలో చూపించిన నైపుణ్యాన్ని.. ద్వితీయార్ధంలో సమస్యను చెప్పడంలో శ్రద్ద పెట్టాడు. దాంతో సాగదీతగా అనిపించింది.
 
నేటి సమాజంలో పాతుపోయినా విద్యావ్యవస్థలోని లోపాలను పిల్లల కోసం పెద్దలు దేనికైనా త్యాగాలు చేస్తారనే పాయింట్ ను బేస్ చేసుకుని దర్శకుడు ఈ సినిమా తీశాడు. ఇటీవల చాలా చోట్ల పేరున్న కాలేజీలు, హాస్టల్లలో పిల్లలు బలన్మరణం పొందడం వంటి వార్తలు చాలా వచ్చాయి. కొన్ని సార్లు పోలీసులు ఎవరినో చంపేసి కేసులు క్లోజ్ చేసిన సందర్భాలు ఎక్కువే. అటు న్యాయ వ్యవస్థలోనూ, పోలీసు వ్యవస్థలోనూ స్వార్థపరులు ఏవిధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారనే సమాజిక సందేశం ఈ సినిమాలో చాలా వుంది. రజనీ, అమితాబ్ వయస్సుకు తగ్గ పాత్రలు వేసి మెప్పించారు.
రేటింగ్ : 3/5