మనం మరిచిన తొలి తరం తెలుగు కథా రచయిత: నేడు బుచ్చిబాబు జయంతి

సాహిత్యం సమాజాన్ని సమూలంగా మార్చేస్తుందా మార్చేయక పోవచ్చు కాని మార్పును తీసుకరావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ప్రజలను ఆలోచింపజేసేది. అనుభూతికి గురి చేసేది. ప్రజల్లో భావావేశాలు రగిలించేది సాహిత్యమంట

హైదరాబాద్| Raju| Last Updated: బుధవారం, 14 జూన్ 2017 (05:54 IST)
సాహిత్యం సమాజాన్ని సమూలంగా మార్చేస్తుందా మార్చేయక పోవచ్చు కాని మార్పును తీసుకరావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ప్రజలను ఆలోచింపజేసేది. అనుభూతికి గురి చేసేది. ప్రజల్లో భావావేశాలు రగిలించేది సాహిత్యమంటే అందులో అతిశయోక్తిలేదు. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన సృజనకారులెందరో ఉన్నారు. వారిలో తెలుగు కథాసాహిత్యానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన తొలితరం కథా రచయిత... బుచ్చిబాబు.
ప్రపంచ కథా సాహిత్యంలో యూజిన పిరాండెల్లో వంటి ఒకరిద్దరు యూరోపియన రచయితల స్థాయిలో గొప్ప కథలు రాసిన బుచ్చిబాబును గుర్తించక తెలుగు సమాజం తనకు తానే ఘోర అపచారం చేసుకున్నది అనిపిస్తోంది.

ఈయన వ్రాసిన చిన్న కథలు సాధారణంగా చాలా పొడవుగా ఉండి, పాత్ర చిత్రణలోనూ, కథ నెరేషన్‌లో విన్నూతమైన శైలి కలిగి ఉంటాయి. బుచ్చిబాబు ఆలోచనా స్రవంతిపై సోమర్‌సెట్ మామ్, ఓ హెన్రీ తదితర ఆంగ్ల రచయితల ప్రభావం మెండుగా కనిపిస్తుంది. కొన్ని నవలలే వ్రాసినా మంచి నవలా రచయితగా కూడా పేరు తెచ్చుకున్నాడు.

బుచ్చిబాబు మొత్తం మీద సుమారు 82 కథలు, నవల, వచన కావ్యం, 40 వ్యాసాలు, 40 నాటిక-నాటకాలు, పరామర్శ గ్రంథం, స్వీయ చరిత్రకు చెందిన మొదటి భాగం, కొన్ని పీఠికలు, పరిచయాలు తన లేఖిని నుండి వెలువడ్డాయి. ఈయన రచనలలో అత్యంత పేరు పొందినవి. చివరకు మిగిలేది (నవల), అజ్ఞానం (వచన కావ్యం), ఆశావాది, ఆద్యంతాలు మధ్య రాధ, నా అంతరంగ కథనం,
షేక్ స్ఫియర్ సాహిత్య పరామర్శ, మేడమెట్లు (కథా సంపుటి)

జీవిత నేపథ్యం
ఏలూరులో శివరాజుసూర్య ప్రకాశరావు, వెంకాయమ్మ దంపతులకు జూన్ 14, 1916న జన్మించాడు శివరాజు వెంకట సుబ్బారావు.
ప్రసిద్ధ నవలాకారుడు, నాటకకర్త మరియు కథకుడు అయిన ఈయన తెలుగు రచనలలో 'బుచ్చిబాబు' అన్న కలంపేరుతోనూ, ఆంగ్ల రచనలలో 'సంతోష్ కుమార్' అన్న పేరుతోనూ రచనలు చేశారు.

అక్షరాభ్యాసం కంకిపాడులో జరిగింది. పాలకొల్లులో ఎస్.ఎస్.ఎల్.సి.లో ఉత్తీర్ణులై, ఇంటర్మీడియట్ మరియు బి.ఏ. పట్టాలు గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చదివారు. 1937 చివరలో డిసెంబరు, మార్గశిర మానంలో తూర్పుగోదావరి జిల్లాలో ఇవ్వనపాడు గ్రామానికి చెందిన ద్రోణంరాజు సూర్యవకాశరావు రెండవ కుమార్తె సుబ్బలక్ష్మితో ఆయన వివాహం జరిగింది.

తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ. ఆనర్సులో ఉత్తీర్ణులై, నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి 1941లో ఎం.ఏ. పట్టా పొందారు. ఈయన కొన్నాళ్ళు అనంతపురం మరియు విశాఖపట్నంలలో ఆంగ్ల ఉపన్యాసకుడిగా పనిచేశాడు. 1945 నుండి 1967లో మరణించేవరకు ఆలిండియా రేడియోలో పనిచేశాడు.

మధ్యతరగతి మందహాసం బుచ్చిబాబు కథలు:
కుటుంబంలోనూ సమాజంలోనూ పురుషుడికి ఉండే ఆర్థిక ఒత్తిళ్ళవల్ల లంచాలకు లొంగిపోయి ఆస్తులు సంపాదించిన కుటుంబాలూ, ప్రభుభక్తివల్ల పేరు తప్ప నాలుగురాళ్ళు వెనకేసుకోలేని కుటుంబాలు వాటి మధ్య ఉండే అంతరాలు, మనుషుల మధ్య అంతరాలుగా ఎలా మారతాయో బుచ్చిబాబు కొన్ని కథల్లో ప్రస్తావించారు. మిగతా విషయాల్లో మనుషులంతా ఒకటే కానీ కొందరికి మాత్రమే ఉండే కార్లూ మేడలవల్ల మనుషులు వేరవుతారనీ ఆ వేరురేఖని పసిగట్టడానికే, కుటుంబాల స్థితిగతుల్ని అంచనా వేయడానికే పదే పదే నీకిప్పుడేమిస్తున్నారని ఆర్థిక ప్రస్తావనలు తెస్తున్నారని ప్రధానపాత్ర గ్రహిస్తాడు.


స్త్రీలు చదువుకుని ఉద్యోగాలలోకి రావడం, సామాజిక రంగాల్లో వారి భాగస్వామ్యం పెరగడం, స్ర్తిలపై హింసకి పరిష్కారంగా విడాకుల చట్టాలు రావడం వల్ల కుటుంబ పునాదులు కదిలినట్లు భావించేవారు ఇప్పటికీ ఉన్నారు. అలాంటిది తొలి రోజులనాటి సంచలనాలు ఏ స్థాయిలో ఉంటాయో బుచ్చిబాబు కథల్లో చూడొచ్చు.

భార్యాభర్తలు ఏ ఆలోచనలు సాగించేదీ ఒకరికొకరికి తెలిసినప్పటికీ తెలియనట్లుగా నటిస్తామనీ, తమ అన్యోన్యానికి కారణం ఇదేనేమోనని, వివాహం నెగ్గాలంటే ఇటువంటి నటన కాస్త అవసరమేమోనన్న అవగాహన కల భార్య పాత్రని సృష్టించాడు ‘వెనక చూపు- ముందు నడక’ కథలో. భార్యాభర్తలు విడిపోవాల్సి వచ్చినపుడు కుటుంబంలో భాగమైన పిల్లలేమవుతారు వంటి ప్రశ్నలు ఒక పెద్దమనిషి అడిగినపుడు ‘ఎవరు పోషించగలిగితే వారితో ఉంటారు. పోషించే శక్తి ఇద్దరికీ లేకపోతే ప్రభుత్వం భరించాలి’ అన్న అవగాహన ఉన్న స్ర్తి పాత్రల రూపకల్పన చేసాడు బుచ్చిబాబు.

బుచ్చిబాబు ఈ పేరు వినగానే ..మనకు చివరకు మిగిలేది నవల చప్పున గుర్తొస్తుంది. మనోవైజ్ఞానిక నవలగా అది తెలుగునాట ఎంతో పేరుగడించింది. మనిషి అంతరంగ ప్రపంచాన్ని అన్వేషించి, అచేతన స్థితిలోని మానసిక భావనలను అద్భుతమైన కథలుగా అల్లిన గొప్ప రచయిత బుచ్చిబాబు. తెలుగు నవలాచరిత్రలో ప్రముఖ సాహితీవేత్తలు శాశ్వతస్థానంగలదిగా గుర్తించిన నవల బుచ్చిబాబు
చివరకు మిగిలేది.

ఒక మనిషి ప్రేమ పొందలేకపోవడానికి కారణం సమాజం, సమాజంలో నిరోధకశక్తులు అంటారు ఈ నవలలో బుచ్చిబాబు. ఈ రెంటికీ అనుబంధంగా ప్రేమ అలౌకికం, మహోన్నతం అన్న ధ్వని కూడా వుంది. కథంతా దయానిధి అనబడే ఒక తాత్త్వికుని కోణంలోనే నడుస్తుంది. ఇది అతని భావనాలోకపు రికార్డు. తనజీవితంలో తారసపడిన ప్రతివ్యక్తినీ మానసికవిశ్లేషణ చేసుకుంటూ పోతాడు ఆద్యంతం. అతని జీవితంలో ప్రాముఖ్యత వహించిన వ్యక్తులు – అతని తల్లీ, కోమలీ, అమృతం, సుశీలా, తరవాత కొంతవరకూ ఇందిరా, నాగమణీ, కాత్యాయినీ.

‘‘ప్రేమించడానికే సమయం చాలడం లేదు, ఇక ద్వేషించడానికి తావెక్కడ?’’ అంటుంది సూఫీ కవయిత్రి రూబియా. ఆస్కార్‌వైల్డ్‌ కూడా ఈమాటే అంటాడు. కాని, ఆధునిక యుగంలో మనుష్యుల మధ్య ఆ ప్రేమ కరువైంది. ప్రేమించలేకపోవడం పెనుజాడ్యంగా మారింది. ప్రేమను పొంద లేకపోవడం నిత్యకృత్యమైంది. ఈ ప్రేమరాహిత్యాన్ని ‘చివరికి మిగిలేది’లో సూక్షస్థాయిలో పరిశోధిస్తాడు బుచ్చిబాబు. రాగద్వేషాలు లేని, ఏ సంకోచం లేని, సంకుచితంకాని ప్రేమ ఎందుకు సాధ్యపడటం లేదనే ప్రశ్న దయానిధిని వెంటాడుతుంది. ప్రేమరాహిత్యం ఇతరుల్లో కాదు, తనలో కూడా ఉన్నదని తెలుసుకొనే లోపల నవల పూర్తవుతుంది

ప్రేమరాహిత్యం యావత్ సమాజాన్ని ‘‘లేమి’’కి గురిచేస్తూన్న వర్తమాన సన్నివేశంలో 'చివరకు మిగిలేది' నవల ప్రాధాన్యం సంతరించుకుని పఠనీయమవుతున్నది. కాని విషాదమేమిటంటే బుచ్చిబాబు రచనలను తెలుగు పాఠకలోకం విస్మరించింది. తమ అంతశ్శోధనకు ఉపకరించే సాహిత్యానికి మధ్యతరగతి దూరంగా వుండిపోయింది. కనీసం జయంతి సందర్భంగానైనా తెలుగు సాహితీలోకం ఆత్మావలోకనం చేసుకొని బుచ్చిబాబు రచనల పఠనానికి చిత్తశుద్ధితో పూనుకొంటే మంచిది.

తెలుగు రచయితలు, కవులందరూ జాతీయవాదులు, మార్క్సిస్టులు లేదా ఏదో ఒక సంఘసంస్కరణ ఉద్యమానికి చెందిన వారైన కాలంలో అతికొద్ది మంది ఆధునిక అభ్యుదయ రచయితల్లో బుచ్చిబాబు ఒకరు.

జీవితంలో ఎదుర్కొన్న యథార్థాన్ని సాహిత్యంలో ఎదుర్కొంటే హర్షించడు పాఠకుడు. అతనికి కావల్సింది కళానుగుణమైన సత్యం. నగ్నసత్యం కాదు.
- బుచ్చిబాబు

(నేడు తొలి తరం బుచ్చిబాబు జయంతి సందర్భంగా)దీనిపై మరింత చదవండి :