శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

కమలా హ్యారిస్‌కు రంగవల్లికలతో స్వాగతం

అమెరికా 46వ అధ్యక్షుడుగా జో బైడెన్ ఈ నెల  20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం సమీపిస్తున్న కొద్ది అమెరికలో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రవాస భారతీయులు నూతన అగ్రరాజ్య పాలకులకు వినూత్నంగా స్వాగతం పలుకుతున్నారు. టైల్స్పై అందమైన రంగవల్లికలు వేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. వాటిని వాషింగ్టన్‌కు పంపుతున్నారు. 
 
స్వాగతానికి, సానుకూలతకు ప్రతిబింబాలైన భారతీయ ముగ్గులు ప్రస్తుతం అమెరికాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈనెల 20న నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులు జో బైడెన్, కమలా హారిస్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకొని వందలాది భారతీయ అమెరికన్లు ముగ్గులతో వారికి స్వాగతం పలుకుతున్నారు. 
 
ప్రధానంగా వాషింగ్టన్‌లో బైడెన్ - కమలా హారిస్లను స్వాగతిస్తూ ఓ ఇంటి ముందు తీర్చిదిద్దిన ముగ్గు శ్వేతసౌధం ముందు వేలాది ముగ్గుల టైల్స్ పరచి కొత్త అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపే ఏర్పాట్లలో ఉన్నామని 'అమెరికా ముగ్గుల బృందం 2021' సభ్యురాలు సౌమ్య సోమనాథ్ చెప్పారు. 
 
శనివారం నాటికే వేలాది ముగ్గులు పూర్తి చేసి వాటిని వర్చువల్గా ప్రదర్శించారు. కాలిఫోర్నియా, బోస్టన్, న్యూజెర్సీతో పాటు చాలా ప్రాంతాల నుంచి వాషింగ్టన్కు చేరుకుంటున్నాయి. ముగ్గుల ప్రదర్శనకు తొలుత వాషింగ్టన్ డీసీ పోలీసులు సైతం అనుమతి ఇచ్చారు. అయితే ట్రంప్ మద్దతుదారుల దాడుల భయంతో ప్రస్తుతం అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తుండగా.. అనుమతి రద్దు చేశారు. 
 
బైడెన్ ప్రమాణస్వీకారం తర్వాత తమ కార్యక్రమానికి కచ్చితంగా అనుమతి లభిస్తుందని సౌమ్య చెప్పారు. 'అందరి అధ్యక్షుడు'గా బైడెన్ అమెరికాను నడిపించాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశమని డెమోక్రాట్ పార్టీ నిధుల సేకరణ బృందంలో కీలక సభ్యుడైన శేఖర్ నరసింహన్ తెలిపారు.