ఏది నిజం? : ఉ.కొరియా అధిపతి బ్రెయిన్ డెడ్ అయ్యారా? వదంతుల్లో నిజమెంత?
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ బ్రెయిన్ డెడ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఏ అధికారి ధృవీకరించడం లేదు. పైగా, అటు ఉత్తర కొరియాగానీ, ఇటు దక్షిణ కొరియాగానీ స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వడం లేదు. పైగా, అంతర్జాతీయ మీడియా సంస్థలు మాత్రం చనిపోయారని నమ్మపలుకుతున్నాయి.
నిజానికి ఏప్రిల్ 11వ తేదీన తర్వాత కిమ్ జాంగ్ ఉన్ బయట కనిపించడం లేదు. పైగా, ఆయన ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు. గుండె ఆపరేషన్ కోసం తమ కోసం ప్రత్యేకంగా నిర్మించి ఆస్పత్రిలో చేరారని, అక్కడ ఆయనకు 12వ తేదీన గుండె ఆపరేషన్ జరిగినట్టు వార్తలు వచ్చాయి.
అయితే, ఆ ఆపరేషన్ చేసిన చిన్నపొరపాటు వల్ల అది వికటించడం వల్ల ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్టు వదంతులు వ్యాపించాయి. ఈ వదంతులను ఉత్తర కొరియా పాలకులు ఇప్పటివరకు ఖండించలేదు. కొట్టిపారేయలేదు. ఇదే ఇపుడు ప్రతి ఒక్కరినీ అనుమానించేలా చేస్తోంది.
మరోవైపు, 36 ఏళ్ల కిమ్‌కు చెందిన ప్రత్యేక రైలు ఆచూకీ చిక్కింది. కీలకమైన సమావేశాలకు హాజరయ్యేందుకు కిమ్ తన గ్రీన్ రైలును వినియోగిస్తారు. అయితే ఆ రైలు.. కిమ్ ప్యామిలీకి చెందిన వోన్‌సాన్ కాంపౌండ్‌లో కనిపించింది. శాటిలైట్ దృశ్యాల ద్వారా ఆ విషయాన్ని ధృవీకరించారు.
ఏప్రిల్ 21వ తేదీ నుంచి ఆ రైలు అక్కడే ఉన్నట్లు గుర్తించారు. ఆ రైలు ఉన్నంత మాత్రాన.. ఉత్తరకొరియా నేత కిమ్ బ్రతికున్నారా? లేక ఆయన ఆరోగ్యానికి ఏమైనా అయ్యిందా? అన్న విషయం మాత్రం క్లారిటీలేదు. కానీ రైలు ఉంది కాబట్టి.. అతను అక్కడే ఉండి ఉంటారన్న అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి.
కిమ్ ఫ్యామిలీ కోసం రిజర్వ్ చేసిన రైల్వే స్టేషన్‌లో ఆ రైలు ఆగి ఉంది. దాని పొడువు సుమారు 250 మీటర్లు. ఏప్రిల్ 15వ తేదీన ఆ రైలు అక్కడ లేదు. కానీ ఏప్రిల్ 21, 23 తేదీల్లో ఆ రైలు అక్కడే ఉన్నట్లు శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా గుర్తించారు. డిపార్చర్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఆ రైలు మాత్రం కొన్ని రోజుల నుంచి కదలలేదు.
కాగా, కిమ్ చివరిసారి ఎయిర్ ఫోర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు. కానీ వోన్‌సన్ ఏరియాలోనే కిమ్ ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు కిమ్‌కు చికిత్స అందించేందుకు ముగ్గురు చైనా వైద్యులు ఉత్తర కొరియా వెళ్లారు. దీంతో కిమ్ ప్రాణాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.