1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జూన్ 2022 (14:39 IST)

ఎన్డీయే కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు?

venkaiah naidu
భారత రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థిగా తెలుగు బిడ్డ ముప్పవరపు వెంకయ్య నాయుడు పేరు తెరపైకి వచ్చింది. ఇదే అంశంపై బీజేపీ ముమ్మర కసరత్తు చేస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు తమ అభ్యర్థిని బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో అన్ని పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా, అందరికీ ఆమోదయోగ్యమైన నేతగా ఉన్న వెంకయ్య నాయుడును రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈయన ఉపరాష్ట్రపతిగా ఉన్న విషయం తెల్సిందే. 
 
ఈ ఎన్నికకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని బరిలోకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై నేడు భాజపా పెద్దలు వెంకయ్య నాయుడితో సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం వెంకయ్య నివాసానికి చేరుకున్న పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆయనతో భేటీ అయ్యారు. 
 
ఈ ఉదయం వెంకయ్య నాయుడు సికింద్రాబాద్‌లో నిర్వహించిన యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భాజపా నేతలతో భేటీ నిమిత్తం ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించేందుకు మంగళవారం భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ కానున్న తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
 
మంగళవారం సాయంత్రం భాజపా ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల కోసం పలువురు కేంద్ర మంత్రులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు సహా 14 మంది నేతలతో భాజపా ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసింది.