మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 26 ఏప్రియల్ 2018 (12:03 IST)

'సింహపురి సోగ్గాడు' ఆనం వివేకా ఎందుకు చనిపోయారో తెలుసా?

'సింహపురి సోగ్గాడు'గా పేరొందిన మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే, ఆయన చనిపోవడ

'సింహపురి సోగ్గాడు'గా పేరొందిన మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే, ఆయన చనిపోవడానికి గల కారణం మాత్రం అనారోగ్యమేనని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.
 
నిజానికి ఆయన ఆనం వివేకానంద రెడ్డి ప్రొస్టేట్ క్యాన్సర్‌తో పోరాడి చివరకు తుదిశ్వాస విడిచారు. 2012 నవంబర్ నుంచి ఆయన ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు బయటపడింది. అప్పటి నుంచి ఆ క్యాన్సర్ మహమ్మారిపై ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. దేశ, విదేశాల్లో చికిత్స చేయించుకున్నారు. ప్రముఖ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు కూడా ఆయనకు వైద్యం చేశారు. 
 
గత నవంబర్‌లో కూడా వైద్యం కోసం సింగపూర్ వెళ్లి వచ్చారు. కానీ, ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ యేడాది ఆరంభం నుంచి క్యాన్సర్ మరింత ముదిరింది. జనవరి నుంచి ఆయన హైదరాబాదులోని కిమ్స్‌లో చికిత్స పొందుతూ వచ్చారు. తన తల్లి మరణించిన సమయంలో ఒక్కసారి నెల్లూరుకు వెళ్లి వచ్చారు. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో, మార్చి 13 నుంచి 40 రోజుల పాటు ఆయన మృత్యువుతో పోరాడుతూ వచ్చిన ఆనం వివేకానంద రెడ్డి బుధవారం తుదిశ్వాస విడిచారు. 
 
ఇదిలావుండగా, ఆనం వివేకానంద రెడ్డి మరణంతో నెల్లూరు కన్నీటిసంద్రమైంది. వివేకా ఇక లేరు అనే వార్తను అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. వివేకాకు నివాళి అర్పించేందుకు గురువారం తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో అభిమానులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించి, కన్నీటిపర్యంతం అవుతున్నారు. మారుమూల గ్రామాల నుంచి సైతం వివేకాను కడసారి చూసేందుకు జనాలు నెల్లూరుకు చేరుకుంటున్నారు.
 
ఇకపోతే, గురువారం జరిగే ఆనం వివేకా అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. ఇందుకోసం ఆయన నెల్లూరుకు వస్తున్నారు. ఈ సందర్భంగా వివేకాకు ఆయన నివాళి అర్పించి, కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేయనున్నారు. ఈ సాయంత్రం వివేకా అంతిమ యాత్ర మొదలవుతుందని ఆయన సోదరుడు, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. అధికారిక లాంఛనాలతో పెన్నా తీరంలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన చెప్పారు.