సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 25 ఏప్రియల్ 2018 (10:24 IST)

నెల్లూరు సోగ్గాడు ఆనం వివేకా ఇకలేరు... 26న అంత్యక్రియలు

నెల్లూరు సోగ్గాడుగా చెరగని ముద్రవేసుకున్న మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి ఇకలేరు. ఆయన బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 67 యేళ్లు. గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య

నెల్లూరు సోగ్గాడుగా చెరగని ముద్రవేసుకున్న మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి ఇకలేరు. ఆయన బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 67 యేళ్లు. గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు.
 
1950 డిసెంబరు 25వ తేదీన నెల్లూరులో పుట్టిన ఆనం వివేకానంద రెడ్డి స్థానికంగా ఉండే వీఆర్ కాలేజీలో బీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆనం వివేకానంద రెడ్డి మూడుసారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆయన.. తన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 
 
ప్రతి ఒక్కరికి ఆప్తుడిగా ఉంటూ వచ్చిన ఆనం వివేకానంద రెడ్డి గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతు, సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. ఇటీవల ఆనం ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కిమ్స్‌ ఆసుపత్రికి వచ్చి ఆయనను పరామర్శించిన విషయం తెలిసిందే. ఆనం మృతితో టీడీపీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు. 
 
కాగా, ఆనం వివేకానంద రెడ్డి భౌతికకాయాన్ని సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు తరలించి గురువారం నెల్లూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతిపట్ల నెల్లూరు పట్టణ ప్రజలే కాకుండా పలు రాజకీయ పార్టీల నేతలు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.