కరోనా రోగులను ఉత్సాహపరిచేందుకు.. డ్యాన్స్ చేసిన డాక్టర్.. ఎక్కడ? (Video)
కరోనా వైరస్ సోకిందంటే చాలు ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందేనని భయం చాలా మందిని ఆహవించింది. దీంతో అనేక మంది ఈ వైరస్ సోకడం కంటే.. వైరస్ సోకిందన్న భయంతో ప్రాణాలు విడుస్తున్నారు. అయితే, తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్యులు, వైద్య సిబ్బంది, ఆస్పత్రి పారామెడల్ స్టాఫ్, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు గత ఏడు నెలలుగా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో అస్సాం రాష్ట్రంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. కరోనా రోగులకు వైద్యం చేసే వైద్యుడు ఒకరు.. కరోనా రోగులను ఉత్సాహపరిచేందుకు వారి ముందు డ్యాన్స్ చేశారు. కరోనా పేషెంట్లను ఉత్సాహపరిచేందుకు పీపీఈ కిట్ లోనే ఆయన డ్యాన్స్ చేశారు. ఆ డాక్టర్ పేరు అరూప్ సేనాపతి. ఈ వైద్యుడి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వైద్యుడు "వార్" సినిమాలోని ఘంగ్రూ పాటకు ఆయన స్టెప్పులు వేయడాన్ని అతని సహోద్యోగి డాక్టర్ ఫైజన్ అహ్మద్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ వీడియో వైరల్ అవుతోంది. అసోంలోని సిల్చార్ మెడికల్ కాలేజీలో ఆయన డ్యాన్స్ చేశారని ఫూజన్ వివరించారు. ఈ వీడియోను రెండు లక్షల మందికి పైగా చూశారు. ఇటువంటి వైద్యులు ఉంటే పేషెంట్లకు బాధలు ఉండవంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఆయనను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.