శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: శనివారం, 17 ఆగస్టు 2019 (14:19 IST)

48 రోజుల కంచి వరదుడి దర్శనం పరిసమాప్తం... తిరిగి జలగర్భంలోకి, ఇక 2059లోనే దర్శనం

దక్షిణాది రాష్ట్రాల్లోనే ప్రాముఖ్యత సంతరించుకున్న ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం అత్తి వరదరాజస్వామి ఆలయం. 40 సంవత్సరాలకు ఒకసారి 48 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. అలాంటి ప్రాముఖ్యత కలిగిన ఉత్సవాలను ప్రపంచ నలుమూలల నుంచి అధికసంఖ్యలో భక్తజనం తరలివచ్చి స్వామివారిని దర్సించుకుని తరిస్తుంటారు. ఆ ఘట్టం నేటితో ముగుస్తోంది. స్వామివారు తిరిగి జలగర్భంలోకి వెళ్ళనున్నారు. 
 
జూన్ 28వ తేదీన అత్తి వరదరాజస్వామి పుష్కరిణి నుంచి బయటకు తీశారు. స్వామివారిని అందంగా అలంకరించి జూలై 1వ తేదీ నుంచి దర్సనానికి అనుమతించారు. స్వామివారు జూలై 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శయన అవతారంలో భక్తులకు దర్సనమిచ్చారు. ఆ తరువాత ఆగష్టు 1వ తేదీ నుంచి నేటి వరకు నిలబడిన భంగిమలో భక్తులను అనుగ్రహించారు. కోటిమందికి పైగా భక్తులు 48 రోజుల పాటు దర్సించుకున్నట్లు ఆలయ అధికారులు అధికార ప్రకటన విడుదల చేశారు.
 
అయితే ఈ ఉత్సవాలు పూర్తయ్యాయి. ఇక 40 సంవత్సరాల తరువాతే స్వామివారిని దర్సించుకోవాల్సి ఉంటుంది. అంటే 2059 సంవత్సరానికే స్వామివారిని తిరిగి బయటకు తీసుకువస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు స్వామివారిని జలగర్భంలోకి తీసుకెళ్ళే క్రతువు ప్రారంభమవుతుంది. రాత్రి 9 గంటలకు ఆ క్రతువు ముగుస్తుంది. వెండి పెట్టెలో స్వామివారిని ఉంచి జలగర్భంలోకి తీసుకెళనున్నారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు అశేష భక్తజనం కంచికి తరలివచ్చింది. అయితే మీడియా ప్రతినిధులను మాత్రం లోపలికి ఆలయ అధికారులు అనుమతించడం లేదు.