లంచం: ఏసీబీ అధికారులు పింక్ కలర్ ద్రావణం సీసాలను ఎందుకు చూపిస్తారో తెలుసా..?
మన దేశంలో సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కొందరు ఉద్యోగులు, సిబ్బంది ప్రజల నుంచి లంచాలను తీసుకుంటుంటారు. ఇక కొందరు బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తారు. దీంతో వారు చాలా చాకచక్యంగా అధికారులు లంచం తీసుకునే సమయంలో దాడులు చేసి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. నిత్యం మనం వార్తల్లో ఈ తరహా సంఘటనల గురించి చదువుతుంటాం.
అయితే ఏసీబీ వారు అలాంటి లంచగొండి ఉద్యోగులను పట్టుకున్నాక వారిని మీడియా ముందు చూపిస్తూ వారు లంచం తీసుకున్న కరెన్సీ నోట్లతో పాటు పింక్ రంగులో ద్రావణం ఉండే సీసాలను ఎదుట ఉంచుతారు. అవును.. మనకు ఆ సీసాలు కూడా కనిపిస్తుంటాయి. అయితే అసలు ఆ సీసాలు ఏమిటి ? అందులో పింక్ రంగులో ద్రావణం ఎందుకు ఉంది ? దానికి లంచానికి సంబంధం ఏమిటి ? అంటే... ఏసీబీ అధికారులు బాధితులకు ముందుగానే కరెన్సీ నోట్లు ఇచ్చి వాటిని ఉద్యోగులకు లంచంగా ఇవ్వమంటారు.
ఈ క్రమంలో ఏసీబీ వారు ఆ కరెన్సీ నోట్లకు ముందుగా ఫినాల్‌ఫ్తలీన్ అనే పౌడర్‌ను రాస్తారు. ఆ పౌడర్ మన కళ్లకు కనిపించదు. ఈ క్రమంలో బాధితులు ఆ నోట్లను ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వగానే ఏసీబీ వారు దాడి చేసి ఆ ఉద్యోగులను అదుపులోకి తీసుకుంటారు. అనంతరం వారి వద్ద ఉండే లంచం ఇచ్చిన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుంటారు.
తరువాత ప్రభుత్వ అధికారుల చేతులను ఒక ప్రత్యేకమైన మిశ్రమంలో ముంచుతారు. దాన్ని సోడియం బైకార్బొనేట్ మిశ్రమంగా పిలుస్తారు. అయితే ప్రభుత్వ అధికారులు కనుక లంచం తీసుకుంటే ఆ కరెన్సీ నోట్లను ముట్టుకుంటారు కదా, అలాంటప్పుడు ఆ నోట్లకు ఉండే ఫినాల్‌ఫ్తలీన్ పౌడర్ వారి చేతులకు అంటుకుంటుంది. ఈ క్రమంలో వారు సోడియం బైకార్బొనేట్ మిశ్రమంలో చేతులు ముంచగానే ఆ మిశ్రమం కాస్తా పింక్ రంగులోకి మారుతుంది. అంటే వారు లంచం తీసుకున్నారని చెప్పేందుకు పింక్ రంగులోకి మారిన ఆ మిశ్రమమే సాక్ష్యమన్నమాట.
ఈ క్రమంలో పింక్ కలర్ లోకి మారిన ఆ మిశ్రమాన్ని కూడా మీడియాకు చూపిస్తారు. దీన్నిబట్టి ప్రభుత్వ అధికారులు లంచం తీసుకున్నారని మనకు అర్థమవుతుంది. అందుకనే మనకు ఇలాంటి కేసుల్లో కరెన్సీ నోట్లతోపాటు పింక్ కలర్ మిశ్రమం కలిగిన సీసాలు కనిపిస్తాయి. వాటి వెనుక ఉన్న స్టోరీ ఇది. అయితే లంచం తీసుకోకపోతే కరెన్సీ నోట్లను ముట్టుకోరు కనుక వారి చేతులను ఆ మిశ్రమంలో ముంచినా ఆ మిశ్రమం పింక్ కలర్‌లోకి మారదు. ఇది అసలు లాజిక్..!