1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (07:44 IST)

కోటి రూపాయల ముడుపులతో 2 సార్లు ప్రమోషన్ : మంత్రి వెల్లంపల్లిపై సంచలన ఆరోపణలు

ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కి కోటి రూపాయల ముడుపులు ఇచ్చినందుకు 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ సంచలన ఆరోపణలు చేశారు.

విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దుర్గ గుడి ఈవో సురేష్ బాబుకి ఈవోగా కొనసాగే అర్హత లేదన్నారు. హైకోర్టు ఆదేశాలను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు.

హైకోర్టు తీర్పు ఇచ్చినా మంత్రి వెల్లంపల్లి, కమిషనర్ పద్మ ఎందుకు స్పందించట్లేదు..? అని ఆయన ప్రశ్నించారు. మంత్రికి కోటి రూపాయల ముడుపులు ఇచ్చినందుకు 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారని మహేశ్ సంచలన ఆరోపణ చేశారు.

దేవాదాయ శాఖ చరిత్రలోనే 3 నెలల్లో 2 సార్లు ప్రమోషన్లు ఇవ్వలేదని.. అలాంటిది సురేష్ బాబుకు మీరెలా ప్రమోషన్ ఇస్తారని మంత్రికి ఆయన సూటి ప్రశ్న సంధించారు.
 
‘గుడి మీద ప్రతి కాంట్రాక్టులో మంత్రి వెల్లంపల్లికి కమిషన్ వెళ్తోంది. రాష్ట్రం అంతా రివర్స్ టెండెరింగ్‌లో వెళ్తుంటే దుర్గగుడిపై ఎందుకు రివర్స్ టెండరింగ్‌కి వెళ్ళలేదు..?

సెక్యూరిటి టెండర్లు అధిక ధరలకు మంత్రి బినామికి ఇచ్చింది వాస్తవం కాదా?. 24 లక్షల రూపాయలు తాత్కాలిక పద్ధతిన శానిటేషన్ కాంట్రాక్టు ఎలా ఇస్తారు..?

వెల్లంపల్లి అనే పాము పాలు తాగటానికి 40 రూపాయల లీటర్ ధర పాలు 44 రూపాయలకు ఇచ్చింది వాస్తవం కాదా? తలనీలాల కాంట్రాక్ట్‌లో కోటిన్నర మంత్రి, ఈవో పంచుకోవాలని అనుకున్నారు.

ఏదో ఒక రూపంలో అమ్మవారి సొమ్ముని కాజేయాలని చూస్తున్నారు. అవినీతి మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలి. ఈవో సురేష్ బాబుని తప్పించకపోతే ఈ ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తునట్టే.

ఒక దుర్గ గుడి ఈవోనే కాదు.. ఇతర దేవాలయాల్లో కూడా అర్హత లేని వాళ్ళు ఈవోలుగా ఉన్నారు’ అని జనసేన నేత ఆరోపించారు.