శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు! 12వ తరగతి పరీక్షలు వాయిదా

దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ పదో తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తూ ప్రకటించింది. దీంతోపాటు 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. 
 
ఈ పరీక్షలపై జూన్‌లో మరోసారి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పలు పార్టీల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బోర్డు పరీక్షలపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం స్వయంగా అధికారులతో సమీక్షించారు. 
 
ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌న్న డిమాండ్ల నేప‌థ్యంలో ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌ధాని మోడీ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలోనే ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌న్న కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కాంగ్రెస్ నేత‌లు రాహుల్‌, ప్రియాంకా గాంధీల‌తోపాటు ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కూడా ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు.
 
జూన్ 1న బోర్డు అప్ప‌టి ప‌రిస్థితుల‌ను స‌మీక్షించి 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను త‌ర్వాత నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. 12 త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మే 4 నుంచి జూన్ 14 వ‌ర‌కూ జ‌ర‌గాల్సి ఉండ‌గా.. ఇప్పుడ‌వి వాయిదా ప‌డ్డాయి. ప‌రీక్ష‌లు తిరిగి నిర్వ‌హించే ముందు క‌నీసం 15 రోజులు ముందు నోటీసు ఇవ్వ‌నున్నారు.
 
ఇంటెర్న‌ల్ అసెస్‌మెంట్ ఆధారంగా ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌ను ప్రమోట్ చేస్తామ‌ని విద్యా శాఖ మంత్రి ర‌మేష్ పోఖ్రియాల్ వెల్ల‌డించారు. ఒక‌వేళ ఎవ‌రైనా విద్యార్థి అసెస్‌మెంట్‌పై అసంతృప్తిగా ఉంటే ఆమె/అత‌డు ప‌రిస్థితులు మెరుగుప‌డిన త‌ర్వాత పరీక్ష‌లు రాయ‌వ‌చ్చ‌ని కూడా ఆయ‌న చెప్పారు.