ప్రభుత్వానికి పట్టిన పిచ్చా లేదా రాష్ట్రానికి పట్టిన శనినా? చంద్రబాబు ప్రశ్న
పోలవరం రివర్స్ టెండరింగ్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. రివర్స్ టెండరింగ్‌పై హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు వైకాపా ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ఆయన అన్నారు. తాజా తీర్పుపై ప్రభుత్వం ఏం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది ఇక్కడితో ఆగదని.. ఈ జాప్యం ప్రాజెక్టుపై మరింత ప్రభావం చూపుతుందని అన్నారు.
పోలవరంపై ప్రయోగాలు వద్దని ఎవరెన్ని చెప్పినా వినకుండా ప్రభుత్వం మూర్ఖంగా వెళ్లిందని ఆరోపించారు. లేని అవినీతిని నిరూపించాలని చూశారన్నారు. పోలవరం జలవిద్యుత్తు ప్రాజెక్టులో నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్‌కో జారీ చేసిన ప్రిక్లోజర్ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేయడంతో పాటు టెండర్ ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలన్న నవయుగ సంస్థ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు
ముఖ్యంగా, మూర్ఖంగా జగన్ నిర్ణయాలను తీసుకుంటున్నారని విమర్శించారు. పోలవరం రీటెండరింగ్ వల్ల ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతున్నా వైసీపీ ప్రభుత్వానికి అర్థం కాలేదని ఎద్దేవా చేశారు.
టెండర్లను రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలని కేంద్ర మంత్రి గడ్కరీ కూడా ఎన్నో సార్లు చెప్పారని చంద్రబాబు అన్నారు. ఒకసారి న్యాయ వివాదం మొదలైతే... ప్రాజెక్టు నిర్మాణంపై తీవ్ర ప్రభావం పడుతుందని, తీవ్ర జాప్యం జరుగుతుందని చెప్పారు. పోలవరంతో ప్రయోగాలు వద్దని తాము ముందు నుంచి చెబుతున్నామని అన్నారు. ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా? లేక రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలా? అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.