ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 8 మార్చి 2018 (07:37 IST)

మోడీకి చంద్రబాబు 'ట్రిపుల్ తలాక్' .. నేడు మంత్రిపదవులకు రాజీనామా

ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రిపుల్ తలాక్ చెప్పారు. దీంతో బీజేపీ - టీడీపీల మధ్య ఉన్న బంధం బ్రేకప్ అయింది. బుధవారం సాయంత్రం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ మీడియా సమావేశం

ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రిపుల్ తలాక్ చెప్పారు. దీంతో బీజేపీ - టీడీపీల మధ్య ఉన్న బంధం బ్రేకప్ అయింది. బుధవారం సాయంత్రం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాటలను పరిశీలిస్తే, ఏపీని ఆదుకునే ఉద్దేశ్యం కేంద్రానికి లేదని తేలిపోయింది. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయి. 
 
రాష్ట్రాన్ని ఆదుకునే ఉద్దేశం ఏమాత్రం లేని బీజేపీతో పొత్తు, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అక్కర్లేదన్న భావనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చారు. దీంతో బుధవారం రాత్రి 10.30 గంటల తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని విషయాలను వెల్లడించారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని, ప్యాకేజీకి కూడా కొర్రీలు పెట్టిన భాగస్వామితో ఇంక కలిసుండటం కుదరదని తేల్చి చెప్పారు.
 
ప్రజల హక్కుల కోసమే తాను పోరాడుతున్నానని, నాడు ఇచ్చిన హామీల్లో తాను కూడా భాగస్వామినన్న విషయాన్ని బీజేపీ విస్మరించిందంటూ నిప్పులు చెరిగారు. ఇది పచ్చి మోసం అన్నారు. ఏపీ ప్రజలను కాంగ్రెస్ పార్టీలానే బీజేపీ కూడా దగా చేసిందన్నారు. నాడు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నేతలు కూడా డిమాండ్‌ చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. 
 
ఇప్పుడు ఇతర రాష్ట్రాల సెంటిమెంట్‌ను బూచిగా చూపించడం ఏంటని ప్రశ్నించారు. విభజన హామీలన్నీ నెరవేర్చాలని తాను ఎంతగానో పోరాడానని, కేంద్రమంత్రులు రాజీనామా చేసే విషయమై ఇప్పటికే సుజనా చౌదరి, అశోక్‌ గజపతిరాజులతో సుదీర్ఘంగా మాట్లాడానని, వారు కూడా తన అభిప్రాయాన్ని గౌరవించారని అన్నారు. 
 
అయితే, రాజీనామాలు సమర్పించే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఒక్క మాట చెప్పాలని, ఇది కనీస ధర్మమన్నారు. అందుకే గురువారం తమ పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రధానిని కలిసి రాజీనామా చేస్తారని చంద్రబాబు తెలిపారు. 
 
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడంలో కేంద్రంలోని బీజేపీ సహా ప్రతి ఒక్కరూ నాటకాలు ఆడారని, ఇక భవిష్యత్తులో ఏం చేయాలో తనకు తెలుసునన్నారు. తెలుగు ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాన్ని తమిళులు, కన్నడిగులతో పోల్చడం ఏంటని ప్రశ్నించిన ఆయన, నాలుగు సంవత్సరాల పాటు ఓపిక పట్టామని, ఇంకా వేచి చూడటం అనవసరమన్న ఆలోచనకు వచ్చేశామని తెలిపారు.
 
ఎన్డీయే సర్కారు నుంచి వైదొలగి, ప్రజల్లోకి వెళ్లి జరిగిందంతా చెబుతానని ఆయన అన్నారు. పోలవరం సహా ఎన్నో అంశాల్లో ఇంకా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎన్నో ఉన్నాయని వెల్లడించిన ఆయన, ప్రతి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణినే అవలంబించిందని తెలిపారు. ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని ఎంతగానో తాను చెప్పి చూశానని, అయినా పట్టించుకోలేదని చంద్రబాబు విమర్శించారు. ఇప్పటికీ తాము బీజేపీతో బంధాన్ని కొనసాగించడం భావ్యం కాదని అందుకే తెగదెంపులు చేసుకుంటున్నట్టు చెప్పారు.