శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 7 మార్చి 2018 (18:22 IST)

ఏపీకి సానుభూతితో నిధులివ్వలేం.. కేంద్రం వద్ద నిధులు పారట్లేదు: జైట్లీ

ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని.. విభజన హామీలను నెరవేర్చాలని ఏపీ ఎంపీలు ఢిల్లీలో పోరుబాట పట్టారు. రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీ-బీజేపీ నేతల మధ్య రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ప్రత్యేక హోదాపై చర్చ సాగింది.

ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని.. విభజన హామీలను నెరవేర్చాలని ఏపీ ఎంపీలు ఢిల్లీలో పోరుబాట పట్టారు. రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీ-బీజేపీ నేతల మధ్య రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ప్రత్యేక హోదాపై చర్చ సాగింది. అంతేగాకుండా మరో రెండు రోజుల్లో కేంద్రం నుంచి హోదాపై స్పష్టమైన ప్రకటన రావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఏపీ విభజన హామీలపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నోరువిప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రాజకీయాలతో నిధులు రావన్నారు. సెంటిమెంట్ వుందని నిధులు కేటాయించడం కుదరదని వ్యాఖ్యానించారు. హోదాతో సమానంగా నిధులు ఇస్తామని.. మరో ఐదేళ్లకు 90శాతం నిధులు కేంద్రమే ఇస్తుందని అరుణ్ జైట్లీ వెల్లడించారు. 
 
దేశంలో మిగిలిన రాష్ట్రాల తరహాలోనే ఏపీని కూడా చూస్తామని జైట్లీ వ్యాఖ్యానించారు. పోలవరానికి ఐదు వేల కోట్ల నిధులు ఇచ్చామని, ప్రత్యేక హోదాకు సమానమైన నిధులు అందించామని.. అలాకాకుండా హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తాయని.. ప్రత్యేక హోదా ప్రస్తుతం ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని జైట్లీ తెలిపారు. కేంద్రం వద్ద నిధుల వరద పారడం లేదని జైట్లీ అన్నారు. 
 
తగినంత రాబడి లేకపోవడం వల్లే ఈశాన్య రాష్ట్రాలకు గతంలో ప్రత్యేక హోదా ఇచ్చారని.. ఈశాన్య రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలో నిధులు పంపిణీ జరుగుతోందని.. అయితే కొన్ని పరిణామాల వల్ల ప్రత్యేక హోదా అనే అంశానికి మనుగడ లేకపోయిందని జైట్లీ పాత పాటే పాడారు. ఏపీ ప్రాంత ప్రజలకు ఇష్టం లేకుండానే రాష్ట్ర విభజన జరిగిందని, ఆ సమయంలో ఏపీకి రెవెన్యూ లోటు పూడ్చాలని విభజన చట్టంలో ఉందని జైట్లీ వ్యాఖ్యానించారు. ఏపీకి సాయం చేస్తామని.. ఏపీ తీసుకునే విదేశీ రుణాల్లో 90 శాతం కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని వెల్లడించారు.