బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (19:11 IST)

హర్యానాలో కోవ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభం

దేశాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ఈ వైరస్ వ్యాప్తికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ... వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. 
 
ఈ క్రమంలో హర్యానా రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటన చేసింది. ఇది దేశ ప్రజలకు ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఐసీఎంఆర్‌తో కలిసి హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ కోవ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ శుక్రవారం హర్యానాలోని రోహత్‌క్‌లో ఉన్న పోస్ట్ గ్యాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రారంభమైనట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. 
 
ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన తెలియజేశారు. ఇప్పటికే భారత్‌లోని పలుచోట్ల భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. మానవులపై కోవ్యాక్సిన్ ప్రయోగం సత్ఫలితాలనిస్తే భారతీయులకు భారీ ఊరట లభించినట్టే అవుతుంది. 
 
కాగా, హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌-ఐసీఎంఆర్‌, అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా హెల్త్‌కేర్‌లు అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్లతో మనుషులపై ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) గత మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
అలాగే, హైదరాబాద్‌లోని నిమ్స్‌లో కూడా భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన కోవ్యాక్సిన్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపిక చేసిన ఆరోగ్య కార్యకర్తల్లో కొందరికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ నివేదికను భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌)కి పంపించినట్లు నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌ ఇప్పటికే తెలిపారు. 
 
ఈ నమునాలు, ఫలితాల పరిశీలన తర్వాత, ఐసీఎంఆర్‌ ఎవరిని ఎంపిక చేస్తే వారిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తామని చెప్పారు. గత మంగళవారం మొదటి దశ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. ఎంపిక చేసిన ప్రతి ఒక్కరిపై రెండు సార్లు క్లినికల్‌ ట్రయల్స్‌ చేయనున్నారు. వ్యాక్సిన్‌ డోసు ఇచ్చిన తర్వాత వారిని రెండు, మూడు రోజులపాటు రెండుసార్లు ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకుని పర్యవేక్షించనున్నారు.