ఉక్రెయిన్ నుంచి భారత్ పౌరుల తరలింపు - రొమేనియా నుంచి బయలుదేరిన విమానం
ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. దీంతో ఉక్రెయిన్‌లో భారతీయ పౌరులు, విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన రొమేనియాకు ప్రత్యేక విమానాలను నడుపుతుంది. ఇక్కడ నుంచి ఓ విమానం కూడ బయలుదేరింది. ఇందులో 219 మంది వస్తున్నారు. వీరిలో అనేక తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచనలు పాటిస్తూ రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మంది భారతీయులను ఆ విమానం ద్వారా ముంబైకు పంపినట్టు ఆయన తెలిపారు. అలాగే, ఉక్రెయిన్‌లో మిగిలిన భారతీయులను కూడా సురక్షితంగా భారత్‌కు తరలించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియను స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నట్టు మంత్రి జైశంకర్ వెల్లడించారు. అలాగే, భారతీయ పౌరులను తరలింపులో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న రొమేనియా విదేశాంగ మంత్రి బోగ్డాన్ అరెస్కూకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.