మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2020 (08:39 IST)

అన్ని ఒప్పందాలను తుంగలో తొక్కిన చైనా : భారత్

భారత్ చైనా దేశాల మధ్య మళ్లీ సరిహద్దు ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో 21 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, చైనా వైపు నుంచి కూడా ప్రాణనష్టం ఉన్నప్పటికీ ఆ దేశం మాత్రం ఏమాత్రం బయటకు చెప్పడం లేదు. పైగా, చైనా తీరును ప్రతి ఒక్కరూ తప్పబడుతున్నారు. అలాగే, సరిహద్దుల్లో చైనా బలగాల వైఖరిపై భారత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. 
 
గతంలో సందర్భాలకు అనుగుణంగా వెనక్కి తగ్గినప్పటికీ, ఈ యేడాది చైనా దళాల వ్యవహారశైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని భారత విదేశాంగ శాఖ విమర్శించింది. మే నెల ఆరంభం నుంచి చైనా బలగాలు పరస్పర ఒప్పందాలను గౌరవించిన దాఖలాలు లేవని ఆరోపించింది. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద చైనా గత నెల నుంచి పెద్ద ఎత్తున బలగాలను, యుద్ధ సామగ్రిని మోహరించడం ప్రారంభించిందని పేర్కొంది.
 
భారత్ - చైనా సరిహద్దు ప్రాంతంలోని నియంత్రణ రేఖ వద్ద సామరస్యపూర్వకంగా ఉండాలన్నది 1993 నాటి ఒప్పందంలోని అంతస్సూత్రమని, కానీ చైనా ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు అందుకు వ్యతిరేకం అని విదేశాంగ శాఖ తెలిపింది. నియంత్రణ రేఖ వద్ద తమ అధీనంలోని భూభాగంలో పరిమిత సంఖ్యలో సైనిక బలగాలను మోహరించాలన్నది ఒప్పందంలో ఓ నిబంధన కాగా, చైనా అన్నింటినీ ఉల్లంఘిస్తూ భారీగా బలగాలను మోహరిస్తోందని ఆరోపించింది.
 
ఇదిలావుంటే, ఇండో చైనా సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొనివుంది. వీటిని తగ్గించేందుకు ఇరు దేశాల సైనికాధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ... పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. దీంతో భారత్ భారీ ఎత్తున చైనా సరిహద్దులకు బలగాలను తరలిస్తోంది. అలాగే, చైనా కూడా అదనపు బలగాలను మొహరిస్తోంది. 
 
ప్రస్తుతం చైనాతో సరిహద్దుల్లో కీలక స్థానాలుగా భావించే గాల్వన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, పాంగోంగ్ సరస్సు వద్ద ఇప్పటికీ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉందని జాతీయ భద్రతా మండలి పేర్కొంటోంది.
 
ఈ నేపథ్యంలో, సమస్యాత్మక ప్రాంతాలకేకాకుండా, 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ పొడవునా సైనిక బలగాలను తరలించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు కేంద్ర వర్గాలంటున్నాయి. 
 
సైన్యానికి మద్దతుగా, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కూడా తన బలగాలను, ఆయుధ సంపత్తిని తరలిస్తోంది. ఉద్రిక్తతలు నెలకొన్న అనేక గస్తీ పాయింట్ల వద్ద చైనా కొత్త నిర్మాణాలకు ప్రయత్నిస్తున్నట్టు ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో వెల్లడైంది. 
 
ఇప్పటికీ చైనా దూకుడు తగ్గకపోవడం భారత్‌ను కలవరపాటుకు గురిచేస్తోంది. చైనా దుశ్చర్యలను ప్రపంచం మొత్తం ఛీకొడుతున్నా.. డ్రాగన్ కంట్రీకి మాత్రం చీమకుట్టినట్టుగా లేదని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
మరోవైపు, భారత్ చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని రెండు పెద్ద దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనివుండటం ఏమాత్రం భావ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.