సొంత కారులేని హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి! ఆస్తుల విలువ రూ.1.27 కోట్లు
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం నోటిఫికేషన్ జారీ కాగా, అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ కూడా మరోమారు పోటీ చేయనున్నారు. ఆయన కర్నాల్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు.
65 ఏళ్ల ఈ బీజేపీ సీనియర్ నేత నిన్న తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన పత్రాల్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. రిటర్నింగ్ అధికారికి ఖట్టర్ సమర్పించిన నామినేషన్ పత్రాల ప్రకారం.. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.1.27 కోట్లు. అందులో రూ.94 లక్షలు చరాస్తులు కాగా, 33 లక్షలు స్థిరాస్తులు. 2014లో ఖట్టర్ తన చరాస్తుల విలువను రూ. 8,29,952గా చూపగా ఐదేళ్లలో వాటి విలువ రూ.94,00,985కు పెరిగింది.
ఇక తన స్వగ్రామమైన రోహ్‌తక్ జిల్లాలోని బినాయినిలో రూ.30 లక్షల విలువ చేసే సాగు భూమి, 800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు ఉన్నట్టు పత్రాల్లో పేర్కొన్నారు. దాని విలువను రూ.3 లక్షలుగా చూపారు. తనపై ఎటువంటి కేసులూ లేవని పేర్కొన్నారు. అలాగే, తిరిగేందుకు సొంత కారు కూడా లేదని అఫిడవిట్‌లో పేర్కొనడం గమనార్హం.
డిగ్రీ పట్టభద్రుడైన తనవద్ద ప్రస్తుతం రూ.15 వేల నగదు మాత్రమే ఉందన్నారు. అలాగే, ప్రభుత్వం తనకు కేటాయించిన ఇంటి అద్దె, విద్యుత్, తాగునీరు, టెలిఫోన్ చార్జీలన్నీ చెల్లించేశానని, ఎటువంటి బకాయిలు లేవని ఖట్టర్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.