అవినీతికొండ.... రూ.కోట్లకు పడగలెత్తిన తాహసీల్దారు

cash
Last Updated: శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (11:59 IST)
ఏపీలోని కర్నూలు జిల్లాలో మరో అవినీతి కొండ బయటపడింది. జిల్లాలోని పాణ్యం డిప్యూటీ తాహసీల్దారు అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. ఆయనకు కోట్లాది రూపాయల మేరకు అక్రమాస్తులు ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో తేలింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

పాణ్యం మండలంలో డిప్యూటీ తాహసీల్దారుగా పతతి శ్రీనివాసులు పని చేస్తున్నారు. ఈయన తండ్రి ఉపాధ్యాయుడుగా పని చేస్తూ మరణించాడు. దీంతో కుమారుడైన శ్రీనివాసులకు కారుణ్య నియామకం కింద 2004లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చారు.

అప్పట్లో ఆయన జీతం రూ.1800 మాత్రమే. తర్వాత జిల్లాలోని పలు ఎమ్మార్వో కార్యాలయాల్లో జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, ఆర్‌ఐగా పనిచేశారు. ఈ క్రమంలో అక్రమార్జనకు రుచి మరిగి ఎడాపెడా లంచాలతో కోట్లు కూడబెట్టారు. మరోపక్క, ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన శ్రీనివాసులు భార్య హరిత కూడా డిప్యూటీ తహసీల్దార్‌గా ఇటీవలే ఉద్యోగం సంపాదించారు.

వీరిద్దరూ కలిసి భారీ స్థాయిలో అక్రమాస్తులు సంపాదించినట్టు ఏసీబీ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో కోవెలకుంట్ల, నంద్యాలలోని ఆయన నివాసాలతోపాటు పాణ్యం మండలం కొండజూటురులోని ఆయన మామగారి నివాసంలోనూ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

ఈ సోదాల్లో భాగంగా, నంద్యాలలోని ఆయన అద్దె ఇంట్లో రూ.1.60 లక్షల నగదు, 250 గ్రాముల బంగారు ఆభరణాలు, కోవెలకుంట్లలో జీ ప్లస్ 3 భవనంతోపాటు మరో మూడు నివాస గృహాలు, రూ.11.60 లక్షల విలువ చేసే 4.64 ఎకరాల వ్యవసాయ భూములు, రూ.20 లక్షల విలువ చేసే ఇన్నోవా కారు, ఒక ట్రాక్టర్‌, రెండు ద్విచక్ర వాహనాలు, రూ.25 లక్షల విలువ చేసే ఎల్‌ఐసీ బాండ్లు, కోవెలకుంట్లలోని ఆంధ్రప్రగతి బ్యాంకు లాకరులో రూ.1.50 లక్షల నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.1.5 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్లో రూ.5 కోట్ల పైమాటేనని
ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు.దీనిపై మరింత చదవండి :