గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (09:22 IST)

#InternationalYogaDay2018 : డెహ్రాడూన్‌లో మోడీ యోగాసనాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా యోగాసనాలు వేస్తున్నారు. ముఖ్యంగా, డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ప్రధానితో కలిసి 55 వేల

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా యోగాసనాలు వేశారు. ముఖ్యంగా, డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ప్రధానితో కలిసి 55 వేల మంది ఔత్సాహికులు యోగాసనాలు వేశారు. అలాగే వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన యోగా వేడుకల్లో కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
 
ఆయుష్‌ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 5 వేల చోట్ల యోగా కార్యక్రమాలు చేపట్టారు. దేశరాజధాని ఢిల్లీలో రాజ్‌పథ్‌ సహా 8 ప్రాంతాల్లో యోగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎర్రకోట వద్ద బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం చేపట్టారు. అలాగే 150 దేశాల్లో భారత దౌత్యాధికారుల పర్యవేక్షణలో యోగా వేడుకలు జరుగుతున్నాయి. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, యోగా ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి అనుభూతిని కలుగజేస్తుందన్నారు. ఉత్తరాఖండ్‌ అనేక దశాబ్దాలుగా యోగాకు ముఖ్యకేంద్రంగా వర్ధిల్లుతోందని గుర్తుచేశారు. ఉత్తరాఖండ్‌ యోగా, ఆయుర్వేదిక్‌ కేంద్రంగా విరాజిల్లుతోందన్నారు. సూర్యుడి కిరణాలు అన్ని వైపులా చేరినట్టు ప్రపంచ వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ చెప్పారు.
 
డెహ్రాడూన్‌ నుంచి డబ్లిన్‌ వరకు, షాంఘై నుంచి షికాగో వరకు అందరూ యోగా జపం చేస్తున్నారని అన్నారు. కుటుంబం, సమాజంలో యోగా సద్భావన కలిగిస్తుందన్నారు. అతి తక్కువ కాలంలో యోగా ప్రపంచ వ్యాప్తమైందని, యోగాను భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. యోగా దినోత్సవం అతిపెద్ద సామూహిక ప్రజాహిత కార్యక్రమమని తెలిపారు. యోగాతో మంచి ఆరోగ్యం సమకూరుతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కన్నారు.
 
అదేవిధంగా హైదరాబాద్ సంజీవయ్య పార్క్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో కేంద్రమంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం, బీజేపీ నేతలు దత్తాత్రేయ, లక్ష్మణ్‌, కిషన్ రెడ్డి, రామచంద్రరావు, ఇంద్రసేనా రెడ్డి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలంతా యోగాసనాలు వేశారు. ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో యోగా వేడుకలు నిర్వహించారు. అలాగే, ఆయా జిల్లా కేంద్రాల్ల జరిగిన యోగా వేడుకల్లో మంత్రులు పాల్గొన్నారు.