బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Updated : ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (23:21 IST)

రాత్రి 9 గంటలకు లైట్స్ ఆఫ్, నాగార్జున సాగర్ పంపు సెట్లు ఆన్ చేసిన అధికారులు, సీఎం కేసీఆర్ అభినందన

కరోనా వైరస్ పోరుకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆర్పేసినా విద్యుత్‌కు సంబంధించి లాంటి ఇబ్బందులు లేకుండా చేసిన విద్యుత్ శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. జెన్ కో – ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర్ రావు, ఇతర డైరెక్టర్లు, ఇంజనీర్లకు సిఎం శుభాకాంక్షలు తెలిపారు. అంచనా వేసిన దానికన్నా భారీగా డిమాండ్ పడిపోయినప్పటికీ వ్యూహాత్మకంగా వ్యవహరించి బ్యాలెన్స్ చేయగలిగారన్నారు. 
 
 
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం రాత్రి 9 గంటలకు ఒకేసారి విద్యుత్ దీపాలు ఆర్పినప్పటికీ, విద్యుత్ శాఖ పక్కా వ్యూహంతో వ్యవహరించడంతో  ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. ఒకే సారి పెద్దమొత్తంలో విద్యుత్ వినియోగంలో మార్పులు సంభవించినప్పటికీ, ఉత్పత్తి – సరఫరా మధ్య పూర్తి స్థాయి సమతూకం సాధించడంలో జెన్ కో, ట్రాన్స్ కో పూర్తిస్థాయిలో విజయం సాధించాయి. 
 
ఆదివారం ఉదయం నుంచి జెన్ కో- ట్రాన్స్ కో సిఎండి డి.ప్రభాకర్ రావు విద్యుత్ సౌధలోని లోడ్ డిస్పాచ్ సెంటర్లోనే ఉండి విద్యుత్ డిమాండ్ ఒకేసారి పడిపోయినప్పుడు అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేశారు. దానికి అనుగుణంగా రాత్రి 9 నుంచి 9 నిమిషాల పాటు వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి లైట్లు ఆర్పేయడం వల్ల 300 నుంచి 500 మెగావాట్ల డిమాండ్ పడిపోయే అవకాశం ఉందని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ అంచనా వేసింది. 
 
కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆర్పేయడం వల్ల రాష్ట్రంలో 1500 మెగావాట్ల డిమాండ్ పడిపోయింది. పరిస్థితిని క్షణక్షణానికి పర్యవేక్షిస్తూ తగ్గిన లోడ్‌ను బట్టి మరో చోట అదనంగా విద్యుత్ ఖర్చు చేసే వ్యూహం అనుసరించారు. తగ్గిన డిమాండును బ్యాలెన్స్ చేయడం కోసం నాగార్జున్ సాగర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో, కాళేశ్వరం ప్రాజెక్టులో పంపుసెట్లు నడిపి విద్యుత్ ఖర్చు చేశారు.
 
థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి- సరఫరాల మధ్య సమతూకం కుదిరింది. అటు గ్రిడ్ పైన ఎలాంటి ప్రభావం కలగలేదు. మరోవైపు 9 గంటల 9 నిమిషాల నుంచి మళ్లీ డిమాండ్ పెరగడం ప్రారంభమయింది. దీంతో ఇతర చోట్ల వినియోగాన్ని తగ్గించుకుని బ్యాలెన్స్ చేశారు. ఫలితంగా తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆన్ చేసినా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. సిఎండితో పాటు ట్రాన్స్ కో డైరెక్టర్లు టి.నర్సింగ్ రావు, జగత్ రెడ్డి, సూర్యూప్రకాశ్, జెన్ కో డైరెక్టర్లు సచ్చిదానందం, లక్ష్మయ్య తదితరులు పరిస్థితిని పర్యవేక్షించిన వారిలో ఉన్నారు.