సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (13:44 IST)

ఇక నా తండ్రి భారం ఆ భగవంతుడిదే : ప్రణబ్ కుమార్తె

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింతగా విషమించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్టు ఆర్మీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్టా ముఖర్జీ కూడా ఆ దేవుడినే నమ్ముకుంది. ఇక నా తండ్రి భారం ఆ భగవంతుడిదే అంటూ వ్యాఖ్యానించింది. 
 
నెలవారీ పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన ప్రణబ్ ముఖర్జీకి కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా, ఆయన పాజిటివ్ అని వచ్చింది. అదేసమయంలో మెదడులోని రక్తనాళాల్లో క్లాట్ ఏర్పడంతో దానికి సర్జరీ చేశారు. ఈ బ్రెయిన్ సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా దిగజారిపోయింది. ఈ క్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోలుకోవాలని పలువురు ప్రముఖులు కోరుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ, తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ట్వీట్ వైరల్ అయింది. ప్రస్తుతం ప్రణబ్, న్యూఢిల్లీలోని ఇండియన్ ఆర్మీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. 
 
'గత సంవత్సరం ఆగస్టు 8. నా జీవితంలోని ఓ అత్యంత ఆనందకరమైన రోజు. సరిగ్గా సంవత్సరం క్రితం ఆయన భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. యేడాది తిరిగేసరికి ఆయన అనారోగ్యం పాలయ్యారు. ఇక నా తండ్రి భారం ఆ దేవుడిదే. తనవంతుగా ఏం చేయాలో ఆ భగవంతుడు అన్నీ చేయాలి. జీవితంలో ఏర్పడే సంతోషాన్ని, కష్టాలను సమానంగా స్వీకరించేలా నాకు బలాన్నివ్వాలి. మాకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అంటూ ఆమె ట్వీట్ చేశారు. 
 
కాగా, ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించిందని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగిన తరువాత, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ఆర్మీ ఆస్పత్రికెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
 
మరోపక్క ముఖర్జీ స్వగ్రామమైన పశ్చిమ బెంగాల్‌లోని గ్రామంలో మహా మృత్యుంజయ హోమాన్ని గ్రామస్థులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 84 ఏళ్ల వయసులో ఇంకోపక్క కరోనాతో కూడా బాధపడుతున్న ప్రణబ్ ముఖర్జీ, తిరిగి కోలుకోవాలని జాతియావత్తూ ప్రార్థిస్తోంది. 2012 నుంచి 2017 మధ్య ప్రణబ్ భారత రాష్ట్రపతిగా విధులను నిర్వర్తించిన సంగతి తెలిసిందే. పైగా, దేశ రాజకీయాల్లో ఆజాత శత్రువుగా ప్రణబ్ ముఖర్జీ పేరుగడించారు.