గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 ఆగస్టు 2020 (14:59 IST)

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం క్రిటికల్ : ఆర్మీ ఆస్పత్రి

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగా మారింది. మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో నిన్న ఆయనకు న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో సర్జరీ చేశారు. అయితే, ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని ఆర్మీ ఆసుపత్రి ప్రకటించింది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందుతోందని ఆర్మీ ఆసుపత్రి తెలిపింది. నిన్న మధ్యాహ్నం 12.07కి ఆయన తమ ఆసుపత్రిలో చేరారని పేర్కొంది.  
 
కాగా, ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఇతర వైద్య పరీక్షల నిమిత్తం ఆర్మీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ అని వచ్చింది. మరోవైపు, బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉండటంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆసుపత్రిని సందర్శించారు. 
 
ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను సమాచారం అడిగి తెలుసుకున్నారు. ప్రణబ్‌కు కరోనా కూడా సోకడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండటంతో, ప్రస్తుతం ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి, చికిత్స అందిస్తున్నారు. తాను ఆర్మీ ఆసుపత్రిని సందర్శించానని, ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని రాజ్‌నాథ్ సింగ్, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.