గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 ఆగస్టు 2020 (09:46 IST)

భారత్‌లో కరోనా రికవరీ రేటు 68.78 శాతం - మృతుల రేటు??

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య ప్రతి రోజూ వేల సంఖ్యలో ఉంది. ఆదివారం ఒక్క రోజే ఏకంగా 60 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా, వరుసగా మూడో రోజు కూడా 60 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 20 లక్షల మార్క్‌ను అధిగమించిన మొత్తం కేసుల సంఖ్య, ఆపై రెండు రోజుల్లోనే 21.5 లక్షలను దాటేయడం గమనార్హం. ఇక శాంపిల్స్ సేకరణ సైతం అధికంగానే ఉంది. ఇంతవరకూ 2.41 కోట్లకు పైగా శాంపిల్స్ కలెక్ట్ చేసి పరీక్షించినట్టు ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) గణాంకాలు వెల్లడించాయి.
 
అయితే, కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. కరోనా రికవరీ శాతం 48.2 నుంచి 68.3కు పెరిగిందని, జూన్ 6 - ఆగస్టు 8 మధ్య రికవరీ రేటు 20 శాతానికి పెరిగిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం తెలియజేసింది. ఐసీఎంఆర్ మెడికల్ కోఆర్డినేటర్ లోకేశ్ శర్మ స్పందిస్తూ, 'దేశంలో నిమిషానికి 500కు పైగా కరోనా పరీక్షలను చేస్తున్నాము. రోజుకు 5 లక్షలకు పైగా టెస్టులను చేసే సామర్థ్యం మనకుంది' అని వెల్లడించారు. రికవరీ రేటు 68.78 శాతంగా ఉందిని గుర్తు చేశారు. 
 
అదేసమయంలో కొత్త కేసులతో దాదాపు సమానంగా రికవరీలు నమోదవుతున్నాయని, ఆదివారం నాడు 53,879 మంది కోలుకున్నారని ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతుల రేటు 2.01 పడిపోయిందని, దాదాపు 98 శాతం మంది కోలుకుంటుండటం మంచి పరిణామమని తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 లక్షల కేసుల్లో 91 మంది మరణిస్తుండగా, మన దేశంలో మాత్రం కేవలం 30 మంది మాత్రమే చనిపోతున్నారని, ఇది ప్రపంచంలోనే అత్యల్పమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది.
 
ఇకపోతే, దేశంలో కరోనా కేసుల విస్తృతి ఎంత మాత్రమూ తగ్గలేదు. ఒకరోజులో నమోదైన కేసుల విషయంలో మరో రికార్డు నమోదైంది. గడచిన 24 గంటల వ్యవధిలో ఇండియాలో 64,399 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 21,53,011కు చేరింది. ఇదే సమయంలో కరోనా నుంచి 14,80,885 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. వ్యాధి కారణంగా ఇంతవరకూ 43,379 మంది కన్నుమూశారు.
 
ఇదిలావుండగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 7 లక్షల కరోనా నమూనాలను పరీక్షించామని, దీంతో మొత్తం 2,41,06,535 మందికి కరోనా పరీక్షలు చేశామని కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎక్కువ మొత్తంలో పరీక్షలు చేస్తుండబట్టే కేసులు భారీగా నమోదవుతున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. పాజిటివ్‌ వచ్చిన వారిని సకాలంలో గుర్తిస్తే వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపింది. 
 
ఐసోలేషన్, సమర్థవంతమైన చికిత్సపై దృష్టి సారించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఇదిలా ఉండగా దేశంలో ఇప్పటివరకు 2,156,756 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం 43,498 మంది మరణించారు. 1,481,825 మంది ఇప్పటివరకు వ్యాధి బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు తెలిసింది.