శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (20:22 IST)

కొత్త మ్యాప్‌కు నేపాల్ పార్లమెంట్ ఆమోదం - అది చెల్లదంటున్న భారత్!

భారత్‌లోని కొన్ని ప్రాంతాలతో రూపొందించిన కొత్త మ్యాప్‌కు నేపాల్ పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. నేపాల్ ప్రభుత్వం రూపొందించిన కొత్త మ్యాప్‌లో భారత్‌కు సంబంధించిన 370 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న భూభాగం ఉంది. ముఖ్యంగా, కాలాపానీ, లిపులేక్, లింపియాధురా ప్రాంతాలను నేపాల్ తన భూభాగాలుగా చూపించుకుంది. ఈ మ్యాప్‌కు ఆమోదముద్ర వేయించుకునేందుకు యత్నించి ఈ మధ్యకాలంలో ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ విఫలమయ్యారు. అయినా పట్టుదలతో ప్రత్యేకంగా పార్లమెంటును సమావేశపరిచి, చర్చ జరిపి కొత్త మ్యాప్‌కు ఆమోద ముద్ర వేయించారు.
 
కొత్త మ్యాప్‌కు ఆమోదం లభించిన నేపథ్యంలో, తదుపరి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఎగువ సభ అయిన నేషనల్ అసెంబ్లీకి వెళ్తుంది. అక్కడ కూడా ఆమోదం పొందిన అనంతరం దేశాధ్యక్షుడి ఆమోదం కోసం పంపుతారు. ఆయన ఆమోదించిన తర్వాత రాజ్యాంగంలో కొత్త మ్యాప్‌ను పొందుపరుస్తారు.
 
ఇదిలావుంటే, ఈ కొత్త మ్యాప్ చెల్లదని భారత్ వాదిస్తోంది. నేపాల్ మ్యాప్‌లో చూపించిన భూభాగాలన్నీ తమవేనని భారత్ వాదిస్తోంది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, నేపాల్ మ్యాప్ విస్తరణకు చారిత్రక నిదర్శనాలు కానీ, ఇతర ఆధారాలు కానీ లేవని, ఇది చెల్లుబాటు కాకపోవచ్చని స్పష్టం చేశారు. 
 
సరిహాద్దు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న విధానాన్ని ఇది ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. భారత్ ప్రాదేశిక భూభాగంలోని కొన్ని ప్రాంతాలను తనవిగా చూపించుకుంటూ రూపొందించిన మ్యాప్‌కు రాజ్యాంగబద్ధత కల్పించే బిల్లుకు నేపాల్ చట్టసభలో ఆమోదం లభించిన విషయం తమకు తెలిసిందని, ఈ విషయంలో తమ వైఖరి ఇప్పటికే నేపాల్‌కు తెలియజేశామని వెల్లడించారు.
 
గత నెలలో 8వ తేదీన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భారత్-నేపాల్ సరిహద్దుల్లో లిపులేఖ్ ప్రాంతాన్ని దర్చూలా ప్రాంతంతో కలిపే 80 కిలోమీటర్ల రోడ్‌కు ప్రారంభోత్సవం చేశారు. ఈ చర్య నేపాల్‌ను అసంతృప్తి గురిచేయగా, అప్పటి నుంచే మ్యాప్ సవరణలు చేస్తూ తన అసహనాన్ని వెళ్లగక్కుతోంది. అయితే, చైనా ప్రోద్బలంతోనే నేపాల్ ఈ సాహసానికి ఒడిగడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.