మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 19 మార్చి 2018 (12:39 IST)

'అవిశ్వాస తీర్మానం' అడ్డుకట్టకు అన్నాడీఎంకే అస్త్రాన్ని ప్రయోగించిన బీజేపీ

తమపై తెలుగుదేశం పార్టీ ప్రయోగించిన అవిశ్వాస తీర్మాన అస్త్రానికి విరుగుడుగా అన్నాడీఎంకే అస్త్రాన్ని అధికార భారతీయ జనతా పార్టీ ప్రయోగించింది. ఆ పార్టీ ద్వారా సభలో రభస చేయించి, సభా కార్యక్రమాలు ఆర్డర్‌లో

తమపై తెలుగుదేశం పార్టీ ప్రయోగించిన అవిశ్వాస తీర్మాన అస్త్రానికి విరుగుడుగా అన్నాడీఎంకే అస్త్రాన్ని అధికార భారతీయ జనతా పార్టీ ప్రయోగించింది. ఆ పార్టీ ద్వారా సభలో రభస చేయించి, సభా కార్యక్రమాలు ఆర్డర్‌లో లేకుండా చేస్తూ, అవిశ్వాస తీర్మాన నోటీసు చర్చకు రాకుండా అడ్డుకోవాలని కమలనాథులు వేసిన ఎత్తుగడ పూర్తిగా ఫలించింది. ఫలితంగా 37 మంది ఎంపీలు కలిగిన అన్నాడీఎంకే సభ్యులు ఏకమై కావేరీ జల బోర్డును ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టిముట్టి రభస చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా ఈ రభసను సాకుగా చూపి సభను వాయిదా వేశారు. శుక్రవారం ఇదేవిధంగా వాయిదా వేయగా, సోమవారం కూడా సభను మంగళవారానికి వాయిదావేశారు. దీంతో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే ఆస్కారమే లేకుండా పోయేలా కనిపిస్తోంది. 
 
నిజానికి ప్రధాని మోడీ సర్కారుపై తెలుగుదేశం, వైకాపాలు లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు. ఈ విషయాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా సభలో ప్రకటించారు. అయితే, ఆ అవిశ్వాస తీర్మానం సోమవారం కూడా చర్చకు రాలేదు. ఉదయం 11 గంటలకు మొదలైన సభ క్షణాల్లోనే 12 గంటల వరకూ వాయిదా పడగా, ఆపై 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పలు పార్టీల సభ్యులు నినాదాలతో సభను హోరెత్తించారు. 
 
ప్రశ్నోత్తరాలను చేపట్టాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రయత్నించి విఫలమయ్యారు. సభ ఆర్డర్‌లో లేదంటూ, అవిశ్వాసంపై చర్చించాలని ఉన్నప్పటికీ, కుదిరేలా లేదన్న ఆమె, సభను రేపటి (మంగళవారం)కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందే రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది. కేంద్రం అవిశ్వాస తీర్మానంపై మొండి వైఖరిని అవలంభిస్తోందని, అందుకే సోమవారం కూడా చర్చ చేపట్టలేదని వైసీపీ, టీడీపీ ఎంపీలు ఆరోపించారు. తాము మరింతగా నిరసనలు తెలియజేస్తామని తెలిపారు.