Pawan Kalyan: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసల జల్లు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని ప్రశంసించారు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan). తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డైనమిక్ నేత అనీ, కిందిస్థాయి నుంచి ఎదిగారని అన్నారు. వైసిపి విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదనీ, ఆ రాష్ట్రంలో pushpa 2 బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చి, టికెట్ ధర పెంపుకి కూడా సహకరించారని ప్రశంసించారు.
ఐతే అల్లు అర్జున్ విషయంలో తెర ముందు, వెనుక ఏం జరిగిందో తనకు తెలియదనీ, చట్టం అందరికీ సమానమని చెప్పారు. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టలేననీ, భద్రత గురించి వారు ఆలోచిస్తారని అన్నారు. 'థియేటర్ స్టాఫ్ అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. సీట్లో ఆయన కూర్చున్నాక చెప్పి తీసుకెళ్లాల్సింది. చెప్పినా ఆ అరుపుల్లో ఆయనకు వినిపించలేదేమో. హీరోలు సినిమా థియేటర్లకు వెళ్లి చూడటం ఎప్పట్నుంచో వుంది. ఈ విషయంలో అల్లు అర్జున్ ని తప్పుపట్టడం కరెక్ట్ కాదు. చిరంజీవి కూడా గతంలో అభిమానులతో కలిసి సినిమాలు చూసేందుకు వెళ్లేవారు. కాకపోతే ఆయన ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్‌కు వెళ్లేవారు' అని పవన్ పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప్-2 ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... గోటితో పోయేదాన్ని గొడ్డలివరకు తెచ్చారంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎఫ్.డి.సి చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.