పొలిటికల్ మూవీ కోసం పవన్ చూపులు, 2021లో చెప్తారట
సినిమా హీరోగా మంచి ఫాంలో వుండగానే ఎన్.టి.ఆర్, చిరంజీవి ఇద్దరూ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇద్దరూ ముందస్తు చర్యగా సినిమాలు తీసి చూపించారు. దేశభక్తి యుతంగా వున్న ఆ చిత్రాలు వర్తమాన అంశాలను ప్రస్తావించారు. అయితే ఆ తర్వాత ఎవరు వచ్చినా ఎటువంటి అంశాలు తీసుకోవాలనే దానిలో తర్జనభర్జనల్లో వున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆ రూటులో వున్నాడని ఫిలింనగర్ కథనం.
పవన్ తాజాగా వకీల్ సాబ్ సినిమా షూటింగుతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ఎటువంటి సినిమా చేయాలనేది కీలకంగా మారింది. మూడు సినిమాలు లైన్‌లో వున్నా.. గత కొంతకాలంగా దర్శకుడు సురేందర్ రెడ్డితో చేసే ఆలోచన వుంది. ఇందుకు సంబంధించి కరోనా సమయంలో ఆయనకు ఓ కథ చెప్పినట్లు తెలిసింది. ఆ సినిమా ఠాగూర్ రేంజ్ వుంటుందని తెలుస్తోంది.
రాజకీయాలు, అవినీతి, సమాజంలో ప్రజలు ఏ విధంగా వున్నారనే పాయింట్ చుట్టూ తిరుగుతూ.. సినిమా హీరో నిజజీవితంలో హీరోకూ తేడా ఏమిటనేది? ఇందులో ప్రధాన అంశంగా వుండబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు తగిన కథను సురేందర్ రెడ్డి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పవన్ నైజానికి తగినట్లు.. తన పనేదో తను చేసుకుంటూ పోతుంటే.. షడెన్‌గా ఆయన్ను సామాజిక అంశం కలచి వేస్తుంది. దాంతో రాజకీయాలవైపు దృష్టిపెడతాడని తెలుస్తోంది.
మొదట నెగెటివ్‌గా ఏరగెంట్‌గా వుండే పాత్ర రానురాను ప్రశ్నించే తత్త్వం, మానవత్వం అనే కోణంలో వుంటుందట. ఈ అంశం కూడా సీరియస్‌గా చెబితే చూడరని... ఓ వైపు ఎంటర్‌టైనింగ్ చేస్తూనే మరోవైపు నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో పవన్ అభిమానులను అలరించనున్నారట. దీనిపై కొత్త ఏడాదిలో వార్త బయటకు వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి.