గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (09:15 IST)

జనసేనకు షాకిచ్చిన సోము వీర్రాజు... డైలామాలో పవన్!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లభించిన విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని భారతీయ జనతా పార్టీ నేతల ఆనందానికి హద్దుల్లేకుండా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నేతలు దూకుడు పెంచారు. అధికార తెరాసను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇపుడు ఏపీ బీజేపీ నేతలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. 
 
ఇందుకు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నకను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన వైకాపా సిట్టింగ్ ఎంపీ కరోనా వైరస్ సోకి చనిపోయారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. అధికార వైకాపా ఇప్పటికే అక్కడ పోటీ చేసే అభ్యర్థి పేరును ప్రకటించింది. అలాగే, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా అభ్యర్థిని ప్రకటించకున్నప్పటికీ.. ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు సమాయాత్తమవుతోంది. 
 
ఈ క్రమంలో ఈ స్థానం నుంచి బీజేపీ - జనసేన పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తున్నాయి. ఇదే అంశంపై కొద్దిరోజుల కిందట ఢిల్లీ వెళ్లిన జనసేన పార్టీ చీఫ్ పవన్‌ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించారు. తిరుపతి ఎన్నిక విషయంలో ఓ కమిటీ వేసి.. కమిటీలో ఏకాభిప్రాయం సాధించి, ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించారు. 
 
అభ్యర్థి బీజేపీ నుంచా లేక జనసేన నుంచా అనేది కమిటీ నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే ఆ నిర్ణయం ప్రకారం కమిటీని నియమించారో లేదో ఇప్పటికీ క్లారిటీ లేదు. హఠాత్తుగా ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు మాత్రం తిరుపతి నుంచి తమ అభ్యర్థే రంగంలో ఉంటారని ప్రకటించారు. ఇది తమను అవమానించడమేనని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.
 
పవన్‌ను ప్రణాళిక ప్రకారం నిర్వీర్యం చేస్తున్నారని జనసేన నేతలు అనుమానిస్తున్నారు. గత ఎన్నికల్లో తిరుపతిలో బీజేపీ వచ్చిన ఓట్లు 18వేల లోపే. కానీ అక్కడ అన్నిచోట్ల పెద్ద ఎత్తున పవన్‌కు ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. తిరుపతి ఎన్నికల్లో నటుడు చిరంజీవి గెలిచిన చరిత్ర కూడా ఉంది. అయినా సరే తామే పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. 
 
బీజేపీ పోటీ చేసినా అభ్యతరం లేదు. కానీ.. జనసేనను నిర్వీర్యం చేసేలా బీజేపీ వ్యవహరించడం ఏమిటన్న ఆక్రోశం మాత్రం పవన్ మద్దతుదారుల్లో కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని భావించిన పవన్ ఆ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలో కూడా పోటీ చేయకపోతే ఇక జనసేన పరిస్థితి గందరగోళంలో పడుతుందనే భయం ఈ పార్టీ కార్యకర్తల్లో ఉంది. 
 
సోము వీర్రాజు ప్రకటనపై జనసేన ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహరావు తీరుపై ఇప్పటికే జనసేన నాయకత్వం ఆగ్రహంతో ఉందని, బీజేపీ అగ్రనాయకత్వంతోనే తేల్చుకోవాలనుకుంటున్నారని జనసేన వర్గాలు చెబుతున్నారు. మొత్తంమీద ఏపీ బీజేపీ నేతల వైఖరి జనసేన పార్టీ నేతలను అయోమయానికి గురిచేస్తున్నాయి.