శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (18:00 IST)

ఛలో అమలాపురం.. సోము వీర్రాజు హౌస్ అరెస్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. దాడులకు గురైన ఆలయాల సందర్శనకు వెళ్లిన యువకులపై కేసులు పెట్టడం దారుణమన్నారు. 
 
పైగా, ప్రభుత్వ ఆగడాలను నిరసిస్తూ ఛలో అమలాపురం కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామన్నారు. ఛలో అమలాపురం కార్యక్రమాన్ని తాను ఇప్పటివరకు ప్రకటించనప్పటికీ... వాలంటీర్ల ద్వారా గ్రామాల్లోని బీజేపీ నేతలు, కార్యకర్తల వివరాలను ప్రభుత్వం ఎందుకు సేకరిస్తోందని ప్రశ్నించారు. 
 
ఈ నేపథ్యంలో సోము వీర్రాజును ఏపీ పోలీసులు ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. 'ఛలో అమలాపురం' కార్యక్రమానికి సోమువీర్రాజు బయల్దేరారు. ఆయనను విజయవాడలో పోలీసులు అడ్డుకున్నారు. 
 
అమలాపురం పార్లమెంట్ పరిధిలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నందున ముందస్తు అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఛలో అమలాపురం నిర్వహిస్తున్నట్లు సోము వీర్రాజు ప్రకటించారు. 
 
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ఐదు పార్లమెంటు నియోజక వర్గాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు ఛలో అమలాపురం కార్యక్రమంలో పాల్గొంటారని వీర్రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజును కూడా పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. అంతర్వేది సందర్శనకు వెళ్తామని ప్రకటించిన నేపథ్యంలో ముందస్తుగా నోటీసు ఇచ్చి పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.